గవర్నమెంట్‌‌‌‌ కంటే సమాజమే శక్తిమంతం.. ప్రజా భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి: ప్రధాని మోదీ

గవర్నమెంట్‌‌‌‌ కంటే సమాజమే శక్తిమంతం.. ప్రజా భాగస్వామ్యంతోనే దేశాభివృద్ధి: ప్రధాని మోదీ

    ‘ఏక్ పేడ్ మా కే నామ్’ పేరుతో అందరూ చెట్లు నాటాలని పిలుపు
    బెంగళూరులో ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ 45వ వార్షికోత్సవానికి హాజరు

బెంగళూరు: ప్రభుత్వాల కంటే సమాజమే అత్యంత శక్తిమంతమైనదని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడే దేశం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని చెప్పారు. ఆదివారం బెంగళూరు శివారులో ఉన్న ‘ఆర్ట్ ఆఫ్ లివింగ్’ అంతర్జాతీయ కేంద్రం 45వ వార్షికోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక గురువు శ్రీ శ్రీ రవిశంకర్ సమక్షంలో నూతనంగా నిర్మించిన ‘ధ్యాన మందిరాన్ని’  ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ.. భారతదేశ వైవిధ్యతను ఏకం చేసే శక్తి ‘ఇతరుల కోసం జీవించడం’లోనే ఉందని అన్నారు. ‘‘మన దేశంలో ఎన్నో భాషలు, ఆచారాలున్నాయి. వీటన్నింటినీ కలిపి ఉంచేది సేవాభావమే. ఆర్ట్ ఆఫ్ లివింగ్ చేస్తున్న ప్రతి పనిలోనూ ఈ సేవా దృక్పథం కనిపిస్తోంది” అని వ్యాఖ్యానించారు. బెంగళూరు నగరం కేవలం సాఫ్ట్‌‌‌‌వేర్, సర్వీసెస్ రంగానికే పరిమితం కాలేదని, భారతదేశ ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రపంచానికి చాటడంలోనూ కీలక పాత్ర పోషిస్తోందని ప్రధాని మోదీ అన్నారు. ‘ఆర్ట్‌‌‌‌ ఆఫ్​లివింగ్’​ మానవతావాద సంస్థ అని పేర్కొన్నారు. యోగా, ధ్యానం, ప్రాణాయామంలాంటి మన సాంస్కృతిక వారసత్వాన్ని శ్రీ శ్రీ రవిశంకర్ ఒక మహావృక్షంలా విస్తరించారని ప్రశంసించారు. వికసిత్‌‌‌‌ భారత్ నిర్మాణం కేవలం మానసిక ప్రశాంతత, సామాజిక బాధ్యత కలిగిన యువతతోనే సాధ్యమవుతుందని చెప్పారు. ‘ఏక్ పేడ్ మా కే నామ్’ (అమ్మ పేరుతో ఒక మొక్క) లాంటి కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని పిలుపునిచ్చారు.