ఎకానమీ ఎఫెక్ట్.. లాక్ డౌన్ ను ఎత్తివేయనున్న దేశాలివే..

ఎకానమీ ఎఫెక్ట్.. లాక్ డౌన్ ను ఎత్తివేయనున్న దేశాలివే..

బెర్లిన్​కరోనా ప్రభావంతో అల్లకల్లోలమవుతున్న ఆర్థిక పరిస్థితిని గాడిలో పెట్టేందుకు ప్రపంచ దేశాలు నడుం బిగించాయి. వైరస్​ ఉధృతిని నిరోధిస్తూనే ఆర్థిక పరిస్థితిని బాగు చేసుకునేందుకు లాక్​డౌన్​లో సడలింపులు ఇస్తున్నాయి. అందులో భాగంగా 13 దేశాలు కలిసి లాక్​డౌన్​ మినహాయింపులపై తీర్మానం చేశాయి.  శనివారం ఓ ప్రకటన చేశాయి. జర్మనీ, ఇటలీ, బ్రెజిల్​, కెనడా, బ్రిటన్​, ఫ్రాన్స్​, సౌత్​కొరియా, టర్కీ, సింగపూర్​, ఇండొనేసియా, మెక్సికో, మొరాకో, పెరూలు.. నీరుగారిపోయిన ఆర్థిక వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టేందుకు అన్ని దేశాలతో కలిసి పనిచేస్తామని ప్రకటించాయి. ప్రస్తుతం ఉన్న ఆర్థిక సంక్షోభాన్ని తగ్గించేందుకు పబ్లిక్​ హెల్త్​, ప్రయాణాలు, వ్యాపారం వంటి విషయాల్లో సడలింపులు అవసరమని చెప్పాయి. వాటిలో కొన్ని మినహాయింపులు ఇస్తే ప్రస్తుత గండం నుంచి గట్టెక్కే పరిస్థితులుంటాయని చెప్పాయి. ముఖ్యంగా నిత్యావసరాలు, మందులు, వైద్య పరికరాలు, సాయాన్ని వివిధ దేశాలకు అందించేలా విమానయానం, రోడ్డు రవాణా, సముద్ర మార్గాలను తెరవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాయి.

అమెరికా రెడీ

లాక్​డౌన్​ను మూడు దశల్లో ఎత్తేసేలా అమెరికా నిర్ణయం తీసేసుకుంది. ఎకానమీ మరింత నష్టపోకుండా ఉండాలంటే లాక్​డౌన్​ను ఎత్తేయడం కంపల్సరీ అని ట్రంప్​ అన్నారు. కొన్ని రాష్ట్రాల్లో ట్రంప్​ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. అన్ని రాష్ట్రాలతో పాటు డెమొక్రాట్ల చేతుల్లో ఉన్న మూడు రాష్ట్రాల్లోనూ లాక్​డౌన్​ను ఎత్తేయాలని ట్రంప్​ ట్వీట్​ చేశారు. ఆయా రాష్ట్రాలకు స్వేచ్ఛనివ్వాలన్నారు. ఇప్పటికే ప్రభుత్వ నిర్ణయాన్ని సమర్థిస్తూ చాలా మంది రోడ్లపైకి వచ్చి ఆందోళనలకు దిగుతున్నారు. కనీసం మాస్కులు, ఫిజికల్​ డిస్టెన్సింగ్​ అన్నది లేకుండానే తుపాకులు పట్టుకుని ఆందోళన చేస్తున్నారు. ఆ ఆందోళనలకు ట్రంప్​ కూడా మద్దతు తెలిపారు.

చిన్నచిన్నగా ఎత్తేస్తున్న జర్మనీ

మరణాల విషయంలో అంతో ఇంతో ఫర్వాలేకున్నా కేసుల్లో మాత్రం దూసుకుపోతున్న జర్మనీ ఆగస్టు 31 దాకా లాక్​డౌన్​ ప్రకటించింది. అయితే, దాని వల్ల ఉపాధి మీద, దేశ ఆర్థిక వ్యవస్థ మీద భారం పడుతుందని భావించిన వైస్​చాన్స్​లర్​ ఏంజెలా మెర్కెల్​.. రెండు రోజుల క్రితం లాక్​డౌన్​లో కొన్ని సడలింపులిచ్చారు. మే 4 తర్వాత క్రమంగా స్కూళ్లను తెరవొచ్చని ప్రకటించారు. సోమవారం నుంచి 800 చదరపు మీటర్లున్న షాపులు ఓపెన్​ చేసుకోవచ్చన్నారు. ఏరియాతో సంబంధం లేకుండా కార్​ డీలర్లు, సైకిల్​ షాపులు, బుక్​స్టోర్లను తెరిచేందుకు అవకాశం ఇచ్చారు. ట్రాన్స్​పోర్ట్​నూ దారిలోకి తెచ్చారు. అందరూ మాస్కులు పెట్టుకోవాలని, దూరం పాటించాలని రూల్స్​ పెట్టారు.

టర్కీలో వీకెండ్​ లాక్​డౌన్​

టర్కీ లాక్​డౌన్​ను కొంచెం కొత్తగా అమలు చేస్తోంది. కేవలం వీకెండ్​(శని, ఆదివారాలు) లాక్​డౌన్​ ప్రకటించింది. మిగతా రోజుల్లోనూ లాక్​డౌన్​ ఉన్నా వయసుల వారీగా ఆంక్షలు పెట్టింది. 20 ఏళ్ల లోపు వాళ్లు, 60 ఏళ్లు దాటిన వారు బయటకు రాకుండా రూల్స్​ పాస్​ చేసింది. నిర్మాణ రంగం, ఫ్యాక్టరీలు, ఇతర కంపెనీలు పూర్తిగా నడుస్తున్నాయి. రెస్టారెంట్లు ఓపెన్​ ఉన్నా, కేవలం పికప్​ డెలివరీలకే అనుమతిచ్చింది. పార్కులు, బ్యాంకులకు కొన్ని గంటల పాటే పనిచేసేలా రూల్స్​ పెట్టింది.

ఇరాన్​లో బిజినెస్​లు ఓపెన్​

ఇరాన్​ రాజధాని టెహ్రాన్​, దాని చుట్టుపక్కల ఉన్న పట్టణాల్లో బిజినెస్​లకు ఆ దేశ ప్రభుత్వం అనుమతిచ్చింది. దీంతో శనివారం నుంచి అక్కడ వ్యాపార పనులు జోరందుకున్నాయి. ప్రభుత్వ ఆఫీసులు తెరుచుకున్నాయి. దేశవ్యాప్తంగా వ్యాపారాలు చేసుకునేందుకు వారం క్రితమే ప్రభుత్వం ఓకే చెప్పింది. అయితే, కేసుల ప్రభావం దృష్ట్యా రాజధానిలో మాత్రం ఓపెన్​ చెయ్యలేదు. ఇప్పుడు అక్కడ కూడా పనులు ఎప్పటిలాగానే జరుగుతున్నాయి. జిమ్ములు, రెస్టారెంట్లు, షాపింగ్​మాల్స్​, టెహ్రాన్​ గ్రాండ్​ బజార్​, స్కూళ్లు, కాలేజీలు మాత్రం లాక్​డౌన్​లోనే ఉంటాయి.

ఇటలీలో కంప్యూటర్​ల తయారీ కూడా

ప్రస్తుతం ఇటలీలో లాక్​డౌన్​ అమల్లో ఉంది. బుక్​స్టోర్లు, చిన్న పిల్లల బట్టల షాపులు, స్టేషనరీ షాపులను మంగళవారం నుంచి తెరిచేలా ప్రధాని గ్వెసెప్​ కాంటీ ఆదేశాలిచ్చారు. కంప్యూటర్ల తయారీ, అటవీ పనులకు సంబంధించిన వాటికీ మినహాయింపులిచ్చారు. ఇంట్లోనే ఉన్న చాలా మందికి బుక్స్​ చాలా అవసరం కాబట్టే బుక్​స్టోర్స్​ను తెరుస్తున్నామన్నారు.

స్పెయిన్​లో ఆఫీసుకెళుతున్నరు

కరోనాతో స్పెయిన్​ కూడా బాగా ఎఫెక్ట్​ అయింది. దేశంలో లాక్​డౌన్​ పెట్టి రెండు నెలలవుతోంది. ఆ దేశ ప్రభుత్వం ఇప్పుడు లాక్​డౌన్​లో మినహాయింపులిచ్చింది. ఆఫీసులు ఓపెన్​ చేసేలా పోయిన సోమవారమే అనుమతిచ్చింది. దీంతో దాదాపు 3 లక్షల మంది ఎప్పటిలాగే డ్యూటీలకు వెళుతున్నారు. నిర్మాణ రంగం, మాన్యుఫాక్చరింగ్​ఉద్యోగులు డ్యూటీ ఎక్కారు. మిగతా కొన్ని రంగాలకూ సడలింపులిచ్చింది సర్కార్​.

ఇంకొన్ని దేశాలు

  • ఫ్రాన్స్​ మాత్రం లాక్​డౌన్​కే కట్టుబడి ఉంది. అయితే, జర్మనీ లాగే మే 11 తర్వాత చిన్న బిజినెస్​లు, స్కూళ్లు ఓపెన్​ చేసుకునేందుకు ఓకే చెప్పింది.
  • డెన్మార్క్​లో స్కూళ్లను ఓపెన్​ చేసింది అక్కడి సర్కార్​. అక్కడ 7,250 కేసులు, 346 మరణాలు నమోదయ్యాయి.
  • నార్వే కూడా ఏప్రిల్​ 20 నుంచి స్కూళ్లు ఓపెన్​ చేయనుంది. అక్కడా కేసులు 7 వేలు దాటాయి. 160 మంది చనిపోయారు.
  • చెక్​రిపబ్లిక్​ సర్కార్​.. షాపులు, ఔట్​డోర్​ స్పోర్ట్​ ఫెసిలిటీలను ఓపెన్​ చేసింది. స్కూళ్లను తెరవనుంది. అయితే, హైస్కూళ్లను మాత్రం సెప్టెంబర్​ 1 దాకా బంద్​ పెట్టనుంది.
  •  ప్రజలు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునేలా వీలు కల్పించేందుకు ఇప్పటికే సౌత్​కొరియా ఆదేశాలిచ్చింది. కొన్ని ఆఫీసులు తెరిచేందుకు అనుమతిచ్చింది.