ఔషధ గుణాలున్న వేపకు కష్టకాలం

ఔషధ గుణాలున్న వేపకు కష్టకాలం

వనపర్తి, వెలుగు: పంటలను ఆశించే చీడపీడల మీద జీవాయుధంగా ప్రయోగించే వేపచెట్టుకే పెను ప్రమాదం ముంచుకొచ్చింది. తెలంగాణలోని చాలా జిల్లాల్లో  వేపచెట్లు కొంతకాలంగా ఒక్కొక్కటే ఎండిపోతున్నాయి. మొదట చెట్టు కొనలు కాలిపోయినట్టు మారి క్రమంగా మోడువారుతున్నాయి. ఇలా వేపచెట్లు ఎండిపోతుండడం ఇటు జనాలతో పాటు అటు సైంటిస్టులను ఆందోళనకు గురిచేస్తోంది. రాష్ట్ర ప్రజలకు వేపతో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. ఊళ్లలో నేటికీ నాటితరం మనుషులకు పొద్దున వేపపుల్లతో పండ్లు తోముకోనిదే దినచర్య మొదలుకాదు. ఆయుర్వేదంలో వేపాకు, పూత, బెరడుకు ఎంతో ప్రాధాన్యముంది. చాలా మందుల్లో, ముఖ్యంగా డయాబెటిస్​ నివారణలో వేపను వినియోగిస్తారు. పండుగలకు, పూజలకు వేపకొమ్మలను గుమ్మాలకు కట్టడం హిందువుల ఆచారం. ఇండ్లలో దోమలను తరిమేందుకు  వేపాకు పొగ వేస్తారు. పంటల మీద చీడపీడలను వదిలించేందుకు వేపాకు రసాన్ని పిచికారీ చేస్తారు. ఈక్రమంలో వేప ఉత్పత్తులపై మన దేశానికి పేటెంట్​ కూడా ఉంది. అలాంటి కీలక ఔషధ గుణాలున్న వేపకే ఇప్పుడు ఆపద వచ్చింది.

గాలి ద్వారా వ్యాపిస్తున్న బ్యాక్టీరియా

తెలంగాణలోని దాదాపు అన్ని జిల్లాల్లో వేపచెట్లు వయసుతో సంబంధం లేకుండా ఎండిపోతున్నాయి. దీనికి ‘ డై బ్యాక్ డిసీజ్’ కారణమని సైంటిస్టులు తేల్చారు.  మూడేళ్ల కింద  వనపర్తి జిల్లా కంబళ్లాపురం గ్రామంలో వేప చెట్లు ఒక్కసారిగా ఎండిపోయాయి. అప్పట్లో  సైంటిస్టులు వాటిని పరిశీలించి శాంపిళ్లు తీసుకున్నారు. వీటిని టెస్టు చేసి ప్రాథమికంగా డై బ్యాక్ డిసీజ్ అని నిర్ధారించారు.  ఒక రకమైన బ్యాక్టీరియా గాలి ద్వారా వ్యాపించడంవల్ల  వేప చెట్ల కొనలు  ఎండిపోయి, రెండు మూడు నెలల్లో చెట్టు మొత్తం నిర్జీవంగా మారుతుంది. బాబిస్టిన్ అనే పెస్టిసైడ్​ను తెగులు సోకిన చెట్ల మీద పిచికారీ చేయడం ద్వారా ఈ తెగులును నివారించవచ్చునని సైంటిస్టులు నివేదిక ఇచ్చారు. కానీ ప్రభుత్వం మాత్రం తమకేమీ పట్టనట్లు వ్యవహరించడంతో ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా విస్తరించింది.

ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి

డైబ్యాక్​ డిసీజ్​ను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. లేకుంటే వేప చెట్లు నాశనమవు తాయి. ఇదే తీవ్రత ఉంటే రెండేళ్లలో 95 శాతం వేపచెట్లు చనిపోయే ప్రమాదం ఉంది. చీడ ఆశించిన వేపచెట్టు కొమ్మలను వెంటనే నరికి బాబిస్టిన్​ను పిచికారి చేయాలి. లేదంటే మైదాకును ముద్దగా చేసి నరికిన కొమ్మలకు అంటించాలి. ఫారెస్ట్, హార్టికల్చర్, అగ్రికల్చర్ ఆఫీసర్లు సమన్వయంతో పని చేస్తే తెగులు ఉధృతిని  తగ్గించవచ్చు.- డాక్టర్ సదాశివయ్య, బోటనీ ప్రొఫెసర్