SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

SRH vs RR: తెలుగు కుర్రాడు మెరుపులు.. రాజస్థాన్ ముందు భారీ లక్ష్యం

ఐపీఎల్ లో సన్ రైజర్స్ గాడిలో పడింది. గత రెండు మ్యాచ్ ల్లో బ్యాటింగ్ వైఫల్యంతో ఓటములు మూట కట్టుకున్న ఆ జట్టు నేడు (మే 2) రాజస్థాన్ రాయల్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో సత్తా చాటింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. తెలుగు కుర్రాడు నితీష్ రెడ్డి( 42 బంతుల్లో 72,3 ఫోర్లు, 8 సిక్సులు) టాప్ స్కోరర్ గా నిలిచాడు. హెడ్ (44 బంతుల్లో 58... 6 ఫోర్లు, 3 సిక్సులు) క్లాసన్ (19 బంతుల్లో 42, 3 ఫోర్లు, 3 సిక్సులు) రాణించారు.    

ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ కు మంచి ఆరంభం లభించలేదు. పవర్ ప్లే లోనే అభిషేక్ శర్మ , అల్మొప్రీత్ సింగ్ వికెట్లను కోల్పోయింది. దీంతో 35 పరుగులకే 2 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో జట్టును ఆదుకునే బాధ్యతను ట్రావిస్ హెడ్, నితీష్ రెడ్డి తీసుకున్నారు. ఓ వైపు నిలకడగా ఆడుతూనే మరోవైపు స్కోర్ వేగం పెంచారు. బౌండరీలతో చెలరేగుతూ స్కోర్ బోర్డును పరుగులు పెట్టించారు. ఈ క్రమంలో ఇద్దరూ తమ హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్నారు. 

మూడో వికెట్ కు వీరిద్దరూ 95 పరుగులు జోడించిన తర్వాత హెడ్ ఔటయ్యాడు. ఈ దశలో నితీష్ కు జత కలిసిన క్లాసన్ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 19 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేశాడు. దీంతో సన్ రైజర్స్ 200 మార్క్ అందుకుంది. రాజస్థాన్ బౌలరల్లో  ఆవేశ్ ఖాన్ రెండు వికెట్లు తీసుకున్నాడు. సందీప్ శర్మకు ఒక వికెట్ దక్కింది.