నెట్‌ఫ్లిక్స్‌లో దొంగలు.. రిలీజ్‌కు ముందే నికోలస్ కేజ్ మూవీ కాపీ చోరీ.. వేల కోట్లలో నష్టపరిహారం డిమాండ్!

నెట్‌ఫ్లిక్స్‌లో దొంగలు.. రిలీజ్‌కు ముందే నికోలస్ కేజ్ మూవీ కాపీ చోరీ.. వేల కోట్లలో నష్టపరిహారం డిమాండ్!

ప్రపంచంలోనే అతిపెద్ద ఓటీటీ దిగ్గజాల్లో ఒకటైన నెట్‌ఫ్లిక్స్‌లో దొంగలు పడ్డారు.  ఇంకా థియేటర్లలోకి విడుదల కూడా కాని ఓ భారీ హాలీవుడ్ మూవీ డిజిటల్ కాపీ హార్డ్ డిస్క్ చోరికి గురైంది. దీంతో నెట్ ఫిక్స్ కు ఊహించని ఎదురదెబ్బ తగిలింది.  ఇప్పుడు ఏకంగా రూ. 1,003 కోట్ల నష్టపరిహారం కేసును ఎదుర్కొవాల్సి వచ్చింది.ఈ ఘటన అంతర్జాతీయ సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.

డిజిటల్ కాపీ మాయం..

హాలీవుడ్ స్టార్ నికోలస్ కేజ్ ప్రధాన పాత్రలో నటించిన రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలోని స్పై థ్రిల్లర్ 'ఫోర్టిట్యూడ్' (Fortitude). ఈ మూవీని దాదాపు రూ.430 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. అయితే ఈ సినిమా ప్రమోషనల్ మెటీరియల్‌ను పరిశీలించిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ అంతర్గత స్క్రీనింగ్ కోసం చిత్ర నిర్మాతలు డిజిటల్ కాపీని కంపెనీకి అందించారు. స్క్రీనింగ్ పూర్తైన వెంటనే ఆ ఫైళ్లను తొలగించాలని కూడా స్పష్టంగా ఈ మూవీ మేకర్స్ సూచించినట్లు సమాచారం.

చరిత్రలో ఇదే తొలిసారి

అయితే ఇదే సమయంలో లాస్ ఏంజెల్స్‌లోని నెట్‌ఫ్లిక్స్ కార్యాలయంలో జరిగిన చోరీలో పలు హార్డ్‌డిస్క్‌లు మాయమయ్యాయి. వాటిలో 'ఫోర్టిట్యూడ్' సినిమా కాపీ కూడా ఉన్నట్లు వెల్లడైంది. ఈ ఘటన గురించి సినిమా నిర్మాతలకు  నెట్‌ఫ్లిక్స్  ఈమెయిల్‌ ద్వారా వెల్లడించింది. ఇలాంటి ఘటన మా సంస్థ చరిత్రలో ఇదే తొలిసారి  అని పేర్కొంటూ సమాచారం అందించింది. భద్రతా, యాంటీ పైరసీ బృందాలు దర్యాప్తు చేస్తున్నాయని, సినిమా ఎక్కడైనా లీక్ అయిందేమోనని నిరంతరం పర్యవేక్షిస్తున్నామని కూడా తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్‌పై తీవ్ర ఆరోపణలు..

అయితే నిర్మాతలు మాత్రం నెట్‌ఫ్లిక్స్‌ సంస్థపై తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. చోరీ జరిగిన వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారా లేదా అనే విషయాన్ని  కూడాసంస్థ వెల్లడించలేదని మండిపడ్డారు. తర్వాత తామే ఫిర్యాదు చేసినప్పటికీ లాస్ ఏంజెల్స్ పోలీస్ డిపార్ట్‌మెంట్‌తో పూర్తిస్థాయిలో సహకరించలేదని ఆరోపించారు. ఈ ఘటన వల్ల సినిమా అంతర్జాతీయ విడుదల, విదేశీ హక్కుల విక్రయాలు, అవార్డుల ప్రచార ప్రణాళికలన్నీ నిలిచిపోయాయని కోర్టులో పేర్కొన్నారు.

నష్టానికి బాధ్యత వహించం..

దీనిపై స్పందించిన నెట్‌ఫ్లిక్స్.. సరైన పరిశ్రమ ప్రమాణాల భద్రతా విధానాలు లేకుండా అందిన కంటెంట్ నష్టానికి తాము బాధ్యత వహించబోమని స్పష్టం చేసింది. అలాగే 'ఫోర్టిట్యూడ్' చిత్ర హక్కులు తమ వద్ద లేవని, అయినప్పటికీ కంటెంట్ భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తామని తెలిపింది. పైరసీ వెబ్‌సైట్లపై నిఘా పెంచినట్లు కూడా వెల్లడించింది.

ALSO READ : భారీ అంచనాలు.. మిక్స్‌డ్ టాక్..

దర్శకుడు సైమన్ వెస్ట్ తెరకెక్కించిన ఈ చిత్రంలో నికోలస్ కేజ్‌తో పాటు మాథ్యూ గుడ్, మైఖేల్ షీన్, బెన్ కింగ్స్‌లే కీలక పాత్రలు పోషించారు. ఏడు సంవత్సరాల కృషితో ఈ సినిమాను రూపొందించామని, ఇప్పుడు ఈ న్యాయపోరాటం 'ఫోర్టిట్యూడ్' భవితవ్యాన్ని నిర్ణయించే అవకాశం ఉందని నిర్మాత-,రచయిత సైమన్ అఫ్రామ్ ఆవేదన వ్యక్తం చేశారు.