- కస్టమర్లకూ నష్టమే
- వేలాది వస్తువులు ఔట్
- తక్కువ ధరలూ కష్టమే
ఇన్ని రోజులు ఏ వస్తువు కావాలన్నా చేతిలోని ఫోన్ తీసి రెండు నిమిషాల్లో కావాల్సిన వస్తువులను ఆర్డర్ చేస్తే 1,2 రోజుల్లో లేదా ప్రైమ్ కస్టమర్లకైతే 24 గంటల్లోపే డెలివరీ అయ్యేవి. కానీ ఇప్పుడు ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన ఈ–కామర్స్ ఎఫ్ డిఐ పాలసీతో ఇక ఆన్ లైన్ ఆర్డర్లకు కనీసం 4 నుంచి 7 రోజుల వరకు ఎదురుచూడాల్సిందే.
హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఈ–కామర్స్ ఎఫ్‌డిఐ పాలసీ వల్ల రిటైలింగ్ వెబ్ సైట్ల ద్వారా కొనుగోలుచేసే కస్టమర్లు ఇక డెలివరీ కోసం 1,2 రోజులు కాకుండా 4–7 రోజులు ఆగాల్సి ఉంటుంది. కొన్ని వస్తువులకు అంతకంటే ఎక్కువ సమయం కూడా పట్టవచ్చు. కొత్త నిబంధనలు అమెజాన్ పై ఎక్కువగా ప్రభావం చూపనున్నాయి. నిబంధనల ప్రకారం స్వంత ఉత్పత్తులతో పాటు ఇతర సంస్థల్లో వాటా ప్రయోజనం ఉన్న ఉత్పత్తులను వెండర్స్ ద్వారా కూడా ఈ–కామర్స్ సైట్లలో అమ్మకూడదు. అమెజాన్ కు క్లౌడ్ టేల్, అపారియో సెల్లర్ల ద్వారానే దాదాపు 50 శాతం అమ్మకాలు జరుగుతున్నాయి. కానీ ఫిబ్రవరి 1 నుండి కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో అమెజాన్ వేలాది వస్తువులను తొలగించింది. కొత్త నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించడం తప్ప అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లకు వేరే మార్గం లేదు.
వేలాది వస్తువులు మాయం
కొత్త నిబంధనల నేపథ్యంలో అమెజాన్, ఫ్లిప్ కార్ట్ ల నుండి వేలాది ఉత్పత్తులు మాయమయ్యాయి. మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, గ్రోసెరీ, ఫ్యాషన్ తో పాటు పలు విభాగాల్లో ఎన్నో ఉత్పత్తులను తీసివేసింది. అలెక్సా ఎకో స్పీకర్లు, బ్యాటరీలు, క్లౌడ్ టేల్ ద్వారా అమ్మే ఫ్లోర్ క్లీనర్స్, ఇతర రోజూవారి ఉత్పత్తుల వంటి వేలాది ప్రాడక్ట్స్ అమెజాన్ సైట్ నుండి మాయమయ్యాయి. అమెజాన్ జాయింట్ వెంచర్ పార్ట్‌నర్ గా ఉన్న క్లౌడ్ టేల్, అపారియో వంటి సెల్లర్లు ఇక అమెజాన్ లో దాదాపు కనుమరుగైనట్లే. ఈ కొత్త పాలసీ అటు అమ్మకందారులతో పాటు కొనుగోలుదారులుపై కూడా ప్రభావం చూపనుంది. ఎప్పటిలా భారీ డిస్కౌంట్లు, తక్కువ ధరకే వస్తువులు లభించడం కష్టమే. దీంతో పాటు డెలి వరీ కూడా ఆలస్యం కానుంది.
ప్రభుత్వ నిర్ణయం పై అసంతృప్తి
ఇండియాలో ప్రైజ్ సెలక్షన్ తో పాటు వెసులుబాటు వంటి వాటితో బిజినెస్ ను నిర్మించుకున్నామని, కానీ కొత్త నిబంధనల వల్ల కస్టమర్లకు, సెల్లర్లకు ఈ విషయంలో ఎలాంటి లాభం ఉండబోదని అమెజాన్ సీఎఫ్‌వో బ్రేన్ ఓల్సావ్‌స్కి అన్నారు. అయినప్పటికీ కస్టమర్లపై ఈ ప్రభావాన్ని తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపారు. నిబంధనలను వాయిదా వేయడానికి వాల్ మార్ట్, అమెజాన్ ఎంత ప్రయత్నించినప్పటికీ, ముందుచెప్పిన డెడ్ లైన్ లో ఎలాంటి మార్పు లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో 6 నెలల గడువు కావాలని కోరిన ఫ్లిప్ కార్ట్ ప్రభుత్వ నిర్ణయం పై అసంతృప్తిని వ్యక్తం చేసింది. ఫ్లిప్ కార్ట్ కు లార్జ్ సెల్లర్స్ తో ఎలాంటి భాగస్వామ్యం లేనందున ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రభావం పడే అవకాశం లేదు. కానీ రానున్న రోజుల్లో ఇన్వెంటరీ అయిపోయిన తరువాత బ్రాండ్స్ తో మళ్లీ కొత్తగా ఒప్పందాలు కుదుర్చుకోవాలి.
తెరమీదకు కొత్త సెల్లర్లు
24 గంటల్లో ప్లాట్ ఫామ్ పై కొత్త సెల్లర్లు తెరమీదకు వచ్చారు. క్లౌడ్ టేల్ కు సంబంధిం చిన కొన్ని ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. ఇప్పుడు అమెజాన్ డివైజెస్ ను ఫర్ యు మార్కెటింగ్ విక్రయిస్తోంది. దీంతో పాటు జై సమధ కూడా అమెజాన్ లో తమ అమ్మకాలను సాగిస్తోంది. 50 బిలియన్ డాలర్ల నష్టం అమెజాన్, ఫ్లిప్ కార్ట్ లో 77 శాతం వాటా కొనుగోలు చేసిన వాల్ మార్ట్ సంస్థ శుక్రవారం తమ మార్కెట్ విలువను 50 బిలి యన్ డాలర్ల మేర నష్టపోయాయి.
ప్రైమ్ మెంబర్లకు చేదువార్తే
ఫాస్ట్ డెలి వరీ తో పాటు ఇతర సౌకర్యాలను కల్పిస్తూ రూ.999 కు ప్రైమ్ మెంబర్ షిప్ ను అందించింది. ఇండియాలో గత యేడాది 70 లక్షల మంది ప్రైమ్ సబ్స్ర్కైబర్లున్నట్లు బార్ క్లేస్ తమ రిపోర్ట్ లో తెలిపింది. నాన్ ప్రైమ్ మెంబర్స్ తో పోలిస్తే ప్రైమ్ మెంబర్స్ తరుచుగా అమెజాన్ లో షాపింగ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కొత్త నిబంధనలతో ప్రైమ్ మెంబర్స్ కూడా డెలివరీ కోసం ఎదురుచూడాల్సిందే. చాలా ఉత్పత్తులను వీరికి 24 గంటలలోపే డెలివరీని అందించింది అమెజాన్. కానీ ఇప్పుడు దేనికైనా కనీసం 4–7 రోజులు ఆగాల్సిందే. ఇది ప్రైమ్ సబ్‌స్ర్కైబర్లకు నిజంగా చేదువార్తే. నెలసరి
సరుకులను ప్రైమ్ నౌ ద్వారా రెండు గంటల్లోపే డెలివరీ అందిస్తున్న అమెజాన్ కు ఇప్పుడది సాధ్యం కాదు. ప్రైమ్ నౌ స్టోర్ ను పూర్తిగా తొలిగించింది. ఇది క్లౌడ్ టేల్ ఆధ్వర్యంలో నడుస్తున్నందున ఈ మొత్తం సేవలనే నిలిపి వేసింది. దీంతో ఈ సేవలపై ఆధారపడ్డ వారికి కూడా తిప్పలు తప్పవు.
