రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ

రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఎన్జీటీ చెన్నై బెంచ్ విచారణ
పనులు జరపడం లేదని.. కేవలం సన్నాహాలు.. అధ్యయనాలు మాత్రమే చేస్తున్నామన్న ఏపీ ప్రభుత్వ సీనియర్ లాయర్ వెంకటరమణి చెన్నై: రాయలసీమఎత్తిపోతల పథకంపై దాఖలైన ధిక్కరణ పిటిషన్ పై ఎన్జీటీ చెన్నై బెంచ్ లో ఇవాళ విచారణ జరిగింది. జస్టిస్ రామకృష్ణన్, ఎక్స్పర్ట్ మెంబర్ సైబల్ దాస్ గుప్త లతో కూడిన బెంచ్ విచారణ చేపట్టింది.  నారాయణపేట జిల్లా బాపన్ పల్లి గ్రామ మాజీ సర్పంచ్ గవినోళ్ల శ్రీనివాస్ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పనులు జరపొద్దని ఎన్జీటీ ఆదేశాలు ఇచ్చినా వాటిని ఉల్లంఘించారని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. పిటిషనర్ లేవనెత్తిన అంశంపై ఏపీ తరఫున సీనియర్ న్యాయవాది వెంకటరమణి వివరణ కోరింది బెంచ్. ప్రాజెక్టు పనులు జరపడం లేదని ఎన్జీటీకి వివరణ ఇచ్చారు ఏపీ ప్రభుత్వ న్యాయవాది. కేవలం సమాయత్త పనులు, అధ్యయనాలు మాత్రమే చేస్తున్నామన్నారు ఏపీ తరపు సీనియర్ న్యాయవాది వెంకట రమణి. దీంతొో పనులు జరగట్లేదన్న వివరాలతో అఫిడవిట్ వేయాలని ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ ఆదేశించింది. గత ట్రైబ్యునల్ ఆదేశాలను సుప్రీంలో సవాలు చేశారా అని ఏపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ఎన్జీటీ. తాము సవాలు చేయలేదని బాధ్యతాయుత ప్రభుత్వంగా నిబంధనలకు అనుగుణంగానే వెళ్తామని ఏపీ తరపు న్యాయవాది వెంకట రమణి వివరించింది. తాను లేవనెత్తిన అంశాలపై స్వతంత్రంగా కమిటీ ద్వారా విచారణ జరపాలని పిటిషనర్ తరఫు న్యాయవాది శ్రావణ్ కుమార్ కోరారు. ఏఫీ  ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది పనులు చేపట్టడం లేదని ట్రిబ్యునల్ ముందు చెబుతున్నందువల్ల ఆయన వివరణను నమోదు చేస్తామని జస్టిస్ రామకృష్ణన్ అన్నారు. కొన్ని సందర్భాల్లో అధికారులు వాస్తవాలను దాచే అవకాశం లేకపోలేదని జస్టిస్ రామకృష్ణన్ అభిప్రాయపడ్డారు. ముందుగా ఏపీ ప్రభుత్వం రాతపూర్వక వివరణ పరిశీలించాక తాము సంతృప్తి చెందక పోతే కమిటీ ద్వారా తనిఖీలు జరిపిస్తామని అన్నారు. తదుపరి విచారణ జనవరి 18 కి వాయిదా వేశారు.