పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు

పలు ప్రాంతాల్లో కొనసాగుతున్న ఎన్ఐఏ దాడులు

ఉగ్రవాద గ్రూపులతో సంబంధంపై కొనసాగుతున్న కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) దేశంలోని వివిధ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. అందులో భాగంగా ఈ రోజు పంజాబ్, హర్యానా, రాజస్తాన్ తో పాటు ఢిల్లీలో ఎన్ఐసీ తనిఖీలు నిర్వహిస్తోంది. దేశ, విదేశాలలో ఉన్న ఉగ్రవాదులు, గ్యాంగ్‌స్టర్లు, డ్రగ్స్ స్మగ్లర్లు, ట్రాఫికర్లను చేధించే క్రమంలో అధికారులు ఈ సోదాలు నిర్వహిస్తున్నట్టు సమాచారం. రాష్ట్ర పోలీసు బలగాల సమన్వయంతో నిర్దిష్ట సమాచారం ఆధారంగా కొన్ని ప్రదేశాలలో ఏకకాలంలో ఈ దాడులను నిర్వహిస్తున్నామని ఎన్ఐఏ తెలిపింది. ఇదే తరహా తనిఖీలను సెప్టెంబర్ 12న ఎన్ఐఏ చేపట్టింది.  పంజాబ్, హర్యానా, రాజస్తాన్, ఢిల్లీలో ని దాదాపు 50 ప్రాంతాల్లో ఈ సోదాలను నిర్వహించింది. ఉగ్రవాద కదలికలు, గ్యాంగ్ స్టర్ కార్యకలాపాల సంబంధాల నేపథ్యంలో ఈ దాడులు చేపట్టినట్లు సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. 

చాలా మంది ముఠా నాయకులు, సభ్యులు దేశం నుండి పారిపోయి వారి కార్యకలాపాలను ఇప్పుడు పాకిస్తాన్, కెనడా, మలేషియా ఆస్ట్రేలియాతో సహా విదేశాల నుండి నిర్వహిస్తున్నారని ఎన్ఐఏ మొదటిసారి మెగా రైడ్ చేసినప్పుడు తెలిపింది. పంజాబ్‌లో శౌర్య చక్ర అవార్డు గ్రహీత కామ్రేడ్ బల్వీందర్ సింగ్ హత్య వంటి కేసుల్లో ఎన్‌ఐఏ దర్యాప్తు జరుపుతున్నందున, ఈ కుట్రలు చాలా వరకు వివిధ రాష్ట్రాల జైళ్లలో నుండి జరుగుతున్నాయని, వ్యవస్థీకృత నెట్‌వర్క్ ద్వారా అమలు చేయబడుతున్నాయని వెల్లడైంది. ఈ ముఠాలు తమ క్రిమినల్ సిండికేట్‌లు, కార్యకలాపాలను అమలు చేయడం, ప్రోత్సహించడం కోసం డబ్బు వసూలు చేస్తూ సాధారణ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, ప్రముఖ వ్యక్తులతో సహా లక్ష్యంగా హత్యలు చేస్తున్నాయని ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. డ్రగ్స్, ఆయుధాల అక్రమ రవాణా చేస్తూ నేరాలకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది."