ఇక కార్లకు సేఫ్టీ రేటింగ్

ఇక కార్లకు సేఫ్టీ రేటింగ్

భద్రతా సామర్థ్యం ఆధారంగా కార్లకు స్టార్ రేటింగ్ ఇచ్చే విధానం భారత్ లోనూ అందుబాటులోకి రానుంది. దాని పేరే ‘న్యూ కార్ అసెస్ మెంట్ ప్రోగ్రామ్’ (ఎన్ క్యాప్). ఈ విప్లవాత్మక విధానానికి సంబంధించిన నియమ నిబంధనలతో కూడిన  ముసాయిదాకు కేంద్ర రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఆమోద ముద్ర వేశారు. ఈవిషయాన్ని ఆయన శుక్రవారం ట్విటర్ వేదికగా ప్రకటించారు. ఇప్పటివరకు క్రాష్ టెస్ట్ కోసం కార్ల కంపెనీలు అంతర్జాతీయ సంస్థలపై ఆధారపడేవి. ఇకపై ఆ అవసరం ఉండదు.

కేంద్ర ప్రభుత్వం ‘ఎన్ క్యాప్’ ఆధ్వర్యంలో ప్రతి కొత్త కారు మోడల్ కు దేశంలోనే క్రాష్ టెస్టు నిర్వహిస్తుంది. తద్వారా అది ఎంతమేరకు భద్రమైంది ? ప్రమాదం జరిగే సందర్భాల్లో ప్రయాణికుడికి ఎంతమేర భద్రత కల్పించగలదు ? అనేది నిర్ధారిస్తుంది. ఇందులో వచ్చే ఫలితం ఆధారంగా కార్లకు స్టార్ రేటింగ్ కేటాయిస్తుంది. అత్యంత భద్రమైన కార్లను వినియోగదారులు కొనుగోలు చేసేందుకు స్టార్ రేటింగ్ దిక్సూచిలా నిలుస్తుందని పరిశీలకులు అంటున్నారు.