దుబాయ్​ లాటరీలో మనోడికి 28 కోట్లు

దుబాయ్​ లాటరీలో మనోడికి 28 కోట్లు

ఉపాధి కోసం దుబాయ్ వెళ్లిన ఓ వ్యక్తికి ఉద్యోగం రాక నిరాశే ఎదురైనా.. అదృష్టం మరో రూపంలో పట్టుకుంది. చాలీచాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న అతడు లాటరీ టికెట్ కొనడంతో లక్కు కలిసి వచ్చింది. దుబాయ్ బిగ్ టికెట్ బంపర్ డ్రాలో ఏకంగా 28 కోట్లకు పైగా గెలుచుకుని రాత్రికి రాత్రే కోటీశ్వరుడయ్యాడు. ఒక్క లాటరీ టికెట్ నిజామాబాద్ జిల్లా జక్రాన్‍పల్లి గ్రామానికి చెందిన రిక్కల విలాస్‍రెడ్డి జీవితాన్నే మార్చేసింది.

ఉపాధి కోసం గల్ఫ్ బాట..

రైతు కుటుంబానికి చెందిన విలాస్ రెడ్డికి భార్య, ఇద్దరు కూతుళ్లు. వ్యవసాయం అంతంత మాత్రంగానే సాగుతుండటంతో ఉపాధి వేటలో దుబాయ్​కి వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో డ్రైవర్ గా పనికి కుదిరిన విలాస్‍ ఎంత పని చేసినా మనసులో ఏదో వెలితిగా ఉండేది. కుటుంబ పోషణకు సరిపడా జీతం దక్కేది కాదు. ఎప్పుడూ ఆర్థిక ఇబ్బందులు. ఎప్పుడెప్పుడూ ఇండియాకు తిరిగి వెళ్దామా అనిపించేలా చేసేవి.  కుటుంబం, ఇద్దరు కూతుళ్ల భవిష్యత్తు గుర్తొచ్చి కష్టమైనా భరించి ఎదో ఒక పనిచేస్తూ గడిపాడు. ఈ క్రమంలో రెండేళ్లుగా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి లాటరీ టికెట్లు కొనడం అలవాటు చేసుకున్నాడు. నెలన్నర కిందట సెలవుపై సొంతూరుకు వచ్చిన విలాస్ ఇక్కడుండగానే అబుదాబిలో ఉన్న తన ఫ్రెండ్ కు ఫోన్ చేసి ‘ డీహెచ్​ మిలియన్ బిగ్ టికెట్ రాఫెల్’ లాటరీ టికెట్లు తన పేరు మీద కొనాలని చెప్పాడు. ఒక్కో టికెట్ ప్రైజ్  10 వేలు కాగా, రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీ ఆఫర్ కలిసివచ్చింది. దీంతో 20 వేలకే మూడు టికెట్లు లభించాయి. ఈ నెల 3 న  తీసిన డ్రాలో విలాస్ రెడ్డి కొనుగోలు చేసిన లాటరీపై  28,43,32,500 లు(4.08 మిలియన్‍డాలర్లు) ప్రైజ్ మనీ తగిలిందంటూ బిగ్ టికెట్ ప్రతినిధులు శనివారం రాత్రి 10 గంటల సమయంలో ఫోన్ చేసి చెప్పారని, లాటరీలో ఇంతపెద్ద మొత్తం దక్కడం చాలా సంతోషంగా ఉందని విలాస్ చెబుతున్నాడు. త్వరలోనే లాటరీ నిర్వాహకులను కలిసి తాను గెలిచిన మొత్తాన్ని  తీసుకుంటానని, డబ్బులు రాగానే తన కుటుంబ సభ్యులందరితో కలిసి మరోసారి దుబాయ్ టూర్ వేస్తానని అంటున్నారు.

నా భార్య ఇచ్చిన డబ్బుతోనే..

‘సెలవుపై ఇంటికి వచ్చాక డబ్బుల్లేకపోవడంతో నా భార్యనే 20 వేలు ఇచ్చింది. వాటితో రెండు టికెట్లు కొంటే ఒక టికెట్ ఫ్రీగా వచ్చింది. ఆ మూడో టికెట్ కే లాటరీ తగిలింది. ఈ అదృష్టం క్రెడిట్ నా భార్యదే’ అని విలాస్ చెప్పారు. ఇండియాకు వచ్చాక కొన్న టికెట్‍పైనే లాటరీలో 29 కోట్ల వరకు దక్కాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.