మా వాహనాల్లో డీజిల్ లేదు.. మీ కుమార్తెను ఎలా వెతకాలి: స్టేషన్ లోనే పోలీస్ ఆఫీసర్ డబ్బులు డిమాండ్..!

మా వాహనాల్లో డీజిల్ లేదు.. మీ కుమార్తెను ఎలా వెతకాలి: స్టేషన్ లోనే పోలీస్ ఆఫీసర్ డబ్బులు డిమాండ్..!

సార్.. సార్.. మా అమ్మాయి కనిపించటం లేదు.. మైనర్.. బయటకు వెళ్లిన అమ్మాయికి తిరిగి ఇంటికి రాలేదు అంటూ బాధిత కుటుంబం పరుగు పరుగునా పోలీస్ స్టేషన్ కు వచ్చింది. కంప్లయింట్ ఇచ్చింది. ఇంత వరకు బాగానే ఉన్నా.. తప్పిపోయిన ఆ అమ్మాయి కుటుంబం సభ్యులతో ఆ పోలీస్ ఆఫీసర్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. మా వాహనాల్లో (పోలీస్) డీజిల్ లేదు.. మీ అమ్మాయిని ఎలా వెతకాలి అంటూ డబ్బులు డిమాండ్ చేసిన వీడియో వైరల్ అయ్యింది. స్టేషన్ లో బాధితులతో ఓ పోలీస్ ఆఫీసర్ మాట్లాడే మాటలు ఇలా ఉంటాయా అంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోయవటంతో.. పై అధికారులు హడావిడిగా చర్యలకు దిగారు. ఈ ఇన్సిడెంట్ ఎక్కడ జరిగింది.. ఏ పోలీస్ స్టేషన్ లో జరిగింది అనేది పూర్తిగా తెలుసుకుందాం...

తప్పిపోయిన మైనర్ కోసం గాలింపు చేపట్టే ముందు పోలీసులు డీజిల్ కోసం డబ్బులు డిమాండ్ చేసిన సంఘటన నాగ్‌పూర్‌లో జరిగింది. ఈ ఘటనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ కావడంతో రాజకీయంగా దుమారం రేపుతోంది.  మహారాష్ట్ర పోలీసింగ్ వ్యవస్థపై తీవ్ర ప్రశ్నలు తలెత్తాయి.  దీంతో  సదరు సీనియర్ పోలీస్ అధికారిని బదిలీ చేశారు సీనియర్ అధికారులు. 

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న  వీడియోతో మహారాష్ట్ర పోలిసింగ్ వ్యవస్థపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఆ వీడియోలో పంచపౌలి పోలీస్ స్టేషన్‌కు చెందిన సీనియర్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ బాబురావు రౌత్, తప్పిపోయిన ఒక మైనర్ బాలిక కుటుంబంతో వ్యవహరించిన తీరును నెటిజన్లు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ‘‘పోలీసు వాహనాల్లో  డీజిల్ లేదు అని గాలింపు చర్యలు ప్రారంభించే ముందు ఇంధనం కోసం డబ్బులు ఇవ్వమని డైరెక్టుగా బాధితులను అడుగుతున్నట్లుగా ఆ వీడియో ద్వారా స్పష్టంగా తెలుస్తోంది. ఈ ఘటనపై ప్రజల నుంచి తీవ్ర విమర్శలు, ఆన్‌లైన్‌లో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. 

ఇక ఈ ఘటనతో మహారాష్ట్రలో పొలిటికల్ దుమారం రేగింది. మహారాష్ట్ర ప్రభుత్వంపై ప్రతిపక్ష కాంగ్రెస్  నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. కీలకమైన పోలిసింగ్ వ్యవస్థ దిగజారడానికి  ప్రభుత్వమే కారణమని ఆరోపించింది. రాష్ట్ర హోంశాఖ మంత్రిగా ఉన్న సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఏరియా నాగ్ పూర్ లోనే ఇలాంటి పరిస్థితి ఉంటే మిగతా ప్రాంతాల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వ ప్రచారం, రాజకీయ  కార్యక్రమాలకు భారీగా ఖర్చు చేస్తున్న ప్రభుత్వం.. కీలకమై పోలిసింగ్ వ్యవస్థలో సౌకర్యాలను నిర్లక్ష్యం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతలు.