టీఆర్‌పీ రిగ్గింగ్‌ స్కాం: రిపబ్లిక్ టీవీకి వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న ఈడీ

టీఆర్‌పీ రిగ్గింగ్‌ స్కాం: రిపబ్లిక్ టీవీకి వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న ఈడీ

టీఆర్‌పీ రిగ్గింగ్‌ కుంభకోణంలో రిపబ్లిక్ టీవీకి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) క్లీన్ చిట్ ఇచ్చింది. ఆ న్యూస్ ఛానల్ కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని తాజా చార్జిషీట్‌లో పేర్కొంది. ఈకేసుపై  పీఎంఎల్ఏ కోర్టు జడ్జి జస్టిస్  ఎంజీ దేశ్ పాండేకు  ఛార్జిషీట్ సమర్పించారు. ఈ కేసులో ముంబై పోలీసుల  రిపోర్టు  తమ నివేదికకు  విరుద్ధంగా ఉందని  ఈడీ తెలిపింది. నివేదికలు  బయటకొచ్చాక.. తమ  మీడియాకు  క్లీన్ చిట్ వచ్చిందని రిపబ్లిక్ మీడియా వెల్లడించింది.  తమకు  మద్దతుగా నిలిచిన  వీక్షకులకు ధన్యవాదాలు చెప్పింది.  

ముంబైలోని కొన్ని టీవీ ఛానళ్లు అక్రమ మార్గాల ద్వారా టీఆర్పీలను పెంచుకుంటున్నాయంటూ 2020 నవంబరులో మహారాష్ట్ర పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆ తర్వాత వెంటనే దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్ కేస్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ (ECIR)ని ఈడీ దాఖలు చేసింది. అందులో రిపబ్లిక్ టీవీ, రెండు మరాఠీ ఛానళ్లు, కొంతమంది వ్యక్తులు సైతం ఉన్నట్లు పేర్కొన్నారు.

టీవీ రేటింగ్స్ మ్యానిప్యులేషన్ కోసం న్యూస్ ఛానళ్లు ఇళ్ల డేటాను వాడాయని, అక్రమంగా అడ్వర్టయిజ్మెంట్ ఫండ్స్ పొందాయని అప్పట్లో ముంబై పోలీసులు ఆరోపించారు. ఒకే ఛానల్ ను ఫిక్స్ డ్ గా పెట్టి దాన్నే చూసేందుకు ప్రతి ఇంటికి నెలకు రూ.400 నుంచి 500 వరకు ఇస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. చదువురాని వాళ్ల ఇండ్లలోనూ నిరంతరం ఇంగ్లిష్ న్యూస్ ఛానళ్లు పెట్టేందుకు డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. రిపబ్లిక్ టీవీకి ఈ కుంభకోణంలో భాగముందని అప్పట్లో ముంబై పోలీస్ కమిషనర్ పరమ్ వీర్ సింగ్ అన్నారు.  ముంబైలో 2 వేల బారోమీటర్లు పెట్టారని, వీటిని మానిటర్ చేసే హన్స అనే సంస్థ ఫిర్యాదు మేరకు జరిపిన విచారణలో ఈ అంశాలు వెలుగుచూసినట్లు వెల్లడించారు. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య కేసులో ప్రశ్నించినందుకే.. ముంబై పోలీస్ కమిషనర్ తనపై తప్పుడు అభియోగాలను మోపారని రిపబ్లిక్ టీవీ ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ అర్ణబ్ గోస్వామి ఆనాడు ఆవేదన వ్యక్తం చేశారు.