కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలపై రాష్ట్రపతి ప్రకటన

కరోనా ఎఫెక్ట్.. హోలీ వేడుకలపై రాష్ట్రపతి ప్రకటన

ప్రాణాంతక కరోనా వైరస్ ప్రపంచమంతటా వ్యాపిస్తున్న క్రమంలో ఈ ఏడాది రాష్ట్రపతి భవన్ లో హోలీ వేడుకలను  నిర్వహించబోమని చెప్పారు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్. మార్చి 10 న రంగుల పండుగైన హోలీ కాగా.. ఆ వేడుకలను, సాంప్రదాయాలను రాష్ట్రపతి  భవన్ లో నిర్వహించట్లేదని బుధవారం చేసిన ఓ ప్రకటనలో తెలిపారు. కరోనా వ్యాప్తి చెందకుండా ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అన్నారు.

హోలీ పండుగ  ఒకరిపై ఒకరు రంగులు చల్లుకొని, సాంప్రదాయకంగా జరుపుకునే పండుగ. ఈ  వేడుకల్లో ఎవరైనా వైరస్ లక్షణాలున్న వ్యక్తి పాల్గొంటే.. ఆ వైరస్ సోకిన వ్యక్తి దగ్గు, తుమ్ము తుంపరల ద్వారా మరో వ్యక్తికి వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంది. అందువల్ల కనీస జాగ్రత్త పాటించాలన్న ఉద్దేశంతో రాష్ట్రపతి భవన్ లో  వేడుకలు దూరంగా ఉందని సమాచారం.

ఈ వైరస్ కారణంగా ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా 3,000 మంది మరణించారు. భారతదేశంలో 28 మందికి ఈ వైరస్ సోకింది. గత ఏడాది డిసెంబర్‌లో చైనా వుహాన్‌లో పుట్టిన ఈ ప్రాణాంతక కరోనా వైరస్ 60 దేశాలకు వ్యాపించి 90,000 మందికి సోకింది.