పుట్టుకతోనే ఎవ్వరూ బానిసలు కాదు

పుట్టుకతోనే ఎవ్వరూ బానిసలు కాదు

రామచంద్రాపురం, వెలుగు: ప్రజాస్వామ్యంలో ఓటుకు ఉండే విలువ దేనికి లేదని, ఓటు.. తూటా కంటే బలమైందని ప్రజా గాయకుడు గద్దర్ అన్నారు. పుట్టుకతోనే ఎవ్వరూ బానిసలు కాదని ఆర్థిక దోపిడీ, పాలకులు, ఆఫీసర్ల నిరంకుశత్వం, వైఫల్యాల వల్లే మనుషులు బానిసలుగా మారుతున్నారని వాఖ్యానించారు. సంగారెడ్డి జిల్లా తెల్లాపూర్ పట్టణంలో సోమవారం అమృత సత్తయ్య కొల్లూరి ఎడ్యుకేషనల్ సొసైటీ(ఆస్క్) ఆధ్వర్యంలో స్వాతంత్ర్య వేడుకలు నిర్వహించగా.. రిటైర్డ్ ప్రొఫెసర్ కంచె ఐలయ్యతో కలిసి గద్దర్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఓటును నోటు కోసం అమ్ముకోవద్దని, ఆ సంస్కృతి మారినప్పుడే సమాజం మారుతుందన్నారు. కుటుంబ వ్యవస్థలను విడిచిపెట్టి, ప్రజలను విద్యావంతులను చేయాలని.. అప్పుడే బీఆర్ అంబేద్కర్, ఫూలే వంటి మహనీయుల ఆశయాలు నెరవేరుతాయన్నారు. కుల, మతాలకు అతీతంగా ఎడ్యుకేషనల్​ సొసైటీని నడుపుతున్న కొల్లూరి సత్తయ్యను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో సీనియర్​జర్నలిస్ట్ పాశం యాదగిరి, కౌన్సిలర్ కొల్లూరి భరత్, బీఎస్పీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బాలయ్య, గీతారామస్వామి, ప్రవీణ్, సుదర్శన్​, మణికంఠ తదితరులు పాల్గొన్నారు.