
నిరుద్యోగ యువతి, యువకులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో యువత ఆందోళన చెందుతున్నారన్నారు. ఎన్నికల టైమ్ లో ఇచ్చిన హామీ ప్రకారం ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ఈ సందర్భంగా ఆయన ప్రశ్నించారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గ్రూప్స్ పోస్టులు పెంచాలని అడిగిన కాంగ్రెస్ .. ఇప్పుడు ప్రభుత్వంలో ఉండి ఎందుకు స్పందించడం లేదని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రభుత్వాన్ని నిలదీయాలని అభ్యర్థులు తమ వద్దకు వచ్చి కోరారని అన్నారు. గ్రూప్స్ పరీక్షలకు మధ్య వ్యవధి ఉండాలని అభ్యర్థులు కోరుతున్నారని తెలిపారు.
గ్రూప్ 1 ప్రిలిమ్స్ లో పాస్ అయిన విద్యార్థులకు 1:50 కాకుండా 1:100 చొప్పున మెయిన్స్ ఎగ్జామ్‌కు అవకాశమివ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుందన్నారు హరీష్ రావు . తద్వారా ఎంతో మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మేలు జరుగుతుందని చెప్పారు. గ్రూప్-2లో అదనంగా 2వేల పోస్టులు పెంచాలన్న హరీష్ రావు. పరీక్షల మధ్య రెండు నెలల గ్యాప్ ఉండాలని చెప్పారు. 2 లక్షల ఉద్యోగాల భర్తీపై జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని.. హామీ మేరకు 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.