- 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకీ దక్కని మ్యాజిక్ ఫిగర్
- ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో సభ్యుల ఓట్లే కీలకం
- ఇండిపెండెంట్ల కోసం హైడ్రామా.. మొదలైన బేరసారాలు..
- జనగామ, మహబూబాబాద్‌లాంటి చోట్ల
హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఈ సారి కొన్నిచోట్ల పార్టీలకు ఊహించని షాక్ ఇచ్చాయి. 36 మున్సిపాలిటీల్లో ఏ పార్టీకి కూడా మ్యాజిక్ ఫిగర్ దక్కలేదు. దీంతో అక్కడ హంగ్ ఏర్పడే పరిస్థితి కనిపిస్తున్నది. ఆయా చోట్ల ఇండిపెండెంట్లు, ఎక్స్అఫీషియో సభ్యుల ఓట్లు కీలకం కానున్నాయి. జనగామ, మహబూబాబాద్, వర్ధన్నపేట, జమ్మికుంటలాంటి చోట్ల ఇండిపెండెంట్ల కోసం హైడ్రామా నడుస్తున్నది. దీంతో మరో రెండు రోజుల్లో ఇక్కడ హంగ్ ఏర్పడే మున్సిపాలిటీల్లో కింగ్ ఎవరో తెలిపోనున్నది.
మొదలైన బేరసారాలు
కొన్ని మున్సిపాలిటీల్లో గెలిచిన కొందరు ఇండిపెండెంట్లకు గిరాకీ పెరిగింది. ఇప్పుడు వాళ్లు ఏ పార్టీ వైపు పోతే ఆ పార్టీ అభ్యర్థులు చైర్ పర్సన్ అయ్యే చాన్స్ ఉన్నది. దీంతో వారు ఎంత అడిగితే అంత డబ్బు ఇవ్వడానికి పార్టీ లీడర్లు, చైర్ పర్సన్ క్యాండిడేట్లు సిద్ధమయ్యారు. ఫలితాలు వెలువడిన కొద్ది క్షణాలకే వాళ్లకు టచ్‌లోకి వెళ్లారు.
మహబూబాబాద్‌లో మొత్తం 36 సీట్లు ఉండగా 18కి పైగా ఓట్లు వచ్చిన పార్టీ అభ్యర్థి ఇక్కడ చైర్మన్ అవుతారు. అయితే, ఈ పట్టణంలో కాంగ్రెస్‌కు 13, బీఆర్‌ఎస్‌కు 11 సీట్లు వచ్చాయి. దీంతో ఇక్కడ గెలిచిన ముగ్గురు సీపీఎం, ముగ్గురు సీపీఐ, ఒక బీజేపీ, ఐదుగురు ఇండిపెండెంట్క్యాండిడేట్లకు డిమాండ్ పెరిగింది. జనగామలో మొత్తం 30 సీట్లు ఉండగా.. కాంగ్రెస్ 12, బీఆర్‌ఎస్ 13, ఇండిపెండెంట్లు 5 చోట్ల గెలిచారు. స్వతంత్రులు ఎటు వైపు వెళితే ఆ పార్టీ అభ్యర్థి చైర్‌పర్సన్ అవుతారు.. కేసముద్రంలో మొత్తం 16 సీట్లకు కాంగ్రెస్, బీఆర్‌ఎస్ సమానంగా చెరో 8 సీట్లు గెలిచారు.
కామారెడ్డిలో మొత్తం 49 సీట్లు ఉండగా కాంగ్రెస్ 19, బీఆర్ఎస్ 10, బీజేపీ 18, ఇండిపెండెంట్లు రెండు చోట్ల గెలిచారు. ఇండిపెండెంట్ల సపోర్ట్ తీసుకున్నా కానీ ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రావట్లేదు. దీంతో ఇక్కడ ఏవో రెండు పార్టీలు ఏకమై చైర్మన్, వైస్ చైర్మన్ సీటు పంచుకోవాల్సి వస్తుంది. జమ్మికుంటలో మొత్తం 30 సీట్లు ఉండగా కాంగ్రెస్ 10, బీఆర్ఎస్ 12, బీజేపీ 4, ఇతరులు నాలుగు చోట్ల గెలిచారు. ఇక్కడ కూడా రెండు పార్టీలు కలిసిపోవాల్సి వస్తున్నది.
అమరచింత మున్సిపాలిటీలో 10 వార్డులుండగా కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మూడు చొప్పున, సీపీఎం ఒక స్థానంలో గెలిచాయి. కాంగ్రెస్, సీపీఎం ఏకమైనా మెజారిటీ రావట్లేదు. దీంతో బీజేపీ, బీఆర్‌ఎస్ కూడా అలయన్స్ అయ్యి రెండున్నరేండ్లు బీజేపీ, మరో రెండున్నరేండ్లు బీఆర్‌ఎస్ నుంచి చైర్మన్‌గా ఉండాలని చర్చిస్తున్నారు.
అలంపూర్ మున్సిపాల్టీలో 10 వార్డులుండగా కాంగ్రెస్, బీఆర్‌ఎస్ ఐదు స్థానాలు చొప్పున కౌన్సిలర్లను గెలుచుకోవడంతో హంగ్ ఏర్పడింది. దీంతో ఎక్స్ అఫీషియో ఓటు ఆధారంగా చైర్మన్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. బీఆర్‌ఎస్‌కు చెందిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు, అదే పార్టీకి చెందిన ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి ఎక్స్ అఫీషియో ఓటు హక్కును వినియోగించుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకోనున్నట్టు ప్రచారం జరుగుతున్నది. కాంగ్రెస్‌కు ఒక ఎక్స్ అఫీషియో ఓటు మాత్రమే ఉన్నది.
గద్వాలలో 37 వార్డులుండగా కాంగ్రెస్ 17, ఎంఐఎం ఒకటి, బీఆర్ఎస్ 11, బీజేపీ 7, ఇండిపెండెంట్లు ఇద్దరు గెలుపొందారు. అయితే ఇద్దరు ఇండిపెండెంట్లలో ఒక కౌన్సిలర్ మాత్రమే కాంగ్రెస్‌కు టచ్‌లో ఉన్నారు. మరో కౌన్సిలర్ ఎవరికి మద్దతు ఇచ్చేది స్పష్టం చేయడం లేదు. ఈ క్రమంలో బీజేపీ, బీఆర్‌ఎస్ అలయన్స్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ రెండు కలిస్తే18 స్థానాలు రానున్నాయి. కాంగ్రెస్ ఒక ఇండిపెండెంట్, ఎంఐఎంతో కలుపుకొని 19 స్థానాలు రానున్నాయి. ఈ క్రమంలో బీజేపీ ఎక్స్ అఫీషియో ఓటును వినియోగించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ రెండు పార్టీలకు చెందిన ఎమ్మెల్సీలు ఏవీఎన్ రెడ్డి, సురభి వాణిదేవి ఓట్లను వినియోగించుకొని చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ప్లాన్ చేస్తున్నాయి.
నారాయణపేట మున్సిపాల్టీలో 24 వార్డులు ఉండగా 11 వార్డుల్లో బీజేపీ, 7 కాంగ్రెస్, 2 బీఆర్‌ఎస్, 2 ఎంఐఎం, ఏఐఎఫ్‌బీ ఒకటి, ఇండిపెండెంట్ ఒకరు గెలిచారు. మ్యాజిక్ ఫిగర్ 13 స్థానాలు కావడంతో చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకునేందుకు ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. అయితే ఇండిపెండెంట్‌గా గెలిచిన కౌన్సిలర్ బీజేపీకి రెబల్‌గా పోటీ చేశాడు. ఈయన ఆ పార్టీకే మద్దతు తెలిపే అవకాశాలు ఉన్నాయి.
ఎక్స్అఫీషియో ఓట్లు ఇలా..
హంగ్ ఏర్పడితే ఎక్స్-అఫీషియో ఓట్లు అత్యంత కీలకంగా మారుతాయి. మున్సిపల్ చైర్‌పర్సన్ లేదా మేయర్ పీఠాన్ని దక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్‌ను లెక్కించేటప్పుడు గెలిచిన వార్డు సభ్యులనే కాకుండా, ఓటు హక్కు ఉన్న ఎక్స్-అఫీషియో సభ్యులను కూడా కలిపి లెక్కిస్తారు. మొత్తం వార్డు సభ్యుల సంఖ్య ప్లస్ అర్హత కలిగిన ఎక్స్-అఫీషియో సభ్యుల సంఖ్య కలిపి మొత్తం ఓట్లుగా చూస్తారు. ఈ మొత్తం ఓట్లలో సగం కంటే ఒకటి ఎక్కువ (50% + 1) సాధించిన పార్టీ లేదా అభ్యర్థి విజేతగా నిలుస్తారు. ఉదాహరణకు.. ఒక మున్సిపాలిటీలో 24 వార్డులు ఉండి, అక్కడ ఇద్దరు ఎక్స్-అఫీషియో సభ్యులు (ఎమ్మెల్యే, ఎంపీ) ఓటు వేయాలని నిర్ణయించుకుంటే.. మొత్తం ఓట్ల సంఖ్య 26 అవుతుంది. అప్పుడు మ్యాజిక్ ఫిగర్ 14 అవుతుంది. ఒక పార్టీకి 12 వార్డులే వచ్చినప్పటికీ.. ఈ ఇద్దరు ఎక్స్-అఫీషియో సభ్యుల మద్దతుతో వారు చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకోవచ్చు. అప్పుడు కూడా రెండు వర్గాలకు సమానంగా ఓట్లు వస్తే, లాటరీ పద్ధతి పాటిస్తారు.
ఎక్స్-అఫీషియోగా ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ
మున్సిపాలిటీ లేదా కార్పొరేషన్ పరిధిలో ఓటు హక్కు కలిగిన స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలను ఎక్స్-అఫీషియో సభ్యులుగా పరిగణిస్తారు. సాధారణ వార్డు సభ్యులతో (కౌన్సిలర్లు, కార్పొరేటర్లు) సమానంగా వీరికి చైర్ పర్సన్ లేదా మేయర్ ఎన్నికలో ఓటు వేసే అధికారం ఉంటుంది. అయితే, ఒక ఎమ్మెల్యే లేదా ఎంపీ తన నియోజకవర్గ పరిధిలో ఎన్ని మున్సిపాలిటీలున్నా.. కేవలం ఒక్క మున్సిపాలిటీలో మాత్రమే తన ఓటు హక్కును వినియోగించుకోవడానికి అవకాశం ఉంటుంది. దీని కోసం వారు ముందే జిల్లా కలెక్టర్ లేదా సంబంధిత ఎన్నికల అధికారికి తమ ఆప్షన్ (ఎంపిక) సమర్పించాల్సి ఉంటుంది. ఒకసారి ఎంచుకున్న తర్వాత దానిని మార్చుకోవడానికి వీలుండదు.
ఎన్నికల ప్రక్రియలో విప్ అమలు
ఎక్స్-అఫీషియో ఓట్లను ఈ నెల 16న చైర్ పర్సన్, మేయర్ ఎన్నికల్లో పరిగణనలోకి తీసుకుంటారు. వీరికి 14వ తేదీ వరకు నమోదుకు అవకాశం ఇచ్చారు. ఇప్పటికే వచ్చిన ఫలితాలకు తగ్గట్టుగా ఆయా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సంబంధిత మున్సిపాలిటీల్లో ఓటరుగా నమోదు చేసుకుంటారు. ఇక ఆ రోజు ఉదయం వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం ముగియగానే.. చేతులెత్తే పద్ధతి ద్వారా ఎన్నిక నిర్వహిస్తారు. ఈ సమయంలోనే రాజకీయ పార్టీలు జారీ చేసే విప్ ఎక్స్-అఫీషియో సభ్యులకు కూడా వర్తిస్తుంది. అంటే, ఒక ఎమ్మెల్యే తన సొంత పార్టీ ఆదేశించిన అభ్యర్థికే ఓటు వేయాలి.
