జీతాలు లేక పండుగ పూట తిప్పలు

జీతాలు లేక పండుగ పూట తిప్పలు
  • జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వ్యథ

హైదరాబాద్, వెలుగు: జీహెచ్ఎంసీలో ఎంప్లాయీస్ కి టైమ్​కి వేతనాలు అందడం లేదు. ఒకటో తారీఖున రావాల్సిన జీతాలు 14 వ తేదీ వచ్చినా రాకపోవడంతో ఔట్​ సోర్సింగ్​ ఉద్యోగులు ఆందోళనకు గురవుతున్నారు. దసరా పండగ ఉన్నప్పటికీ జీతాలు ఇవ్వకపోవడంతో ఎలా చేసుకోవాలని  ప్రశ్నిస్తున్నారు. ప్రతి నెలా జీతాలు ఇలాగే ఆలస్యమవుతున్నప్పటికీ ఎవరు పట్టించుకోవడం లేదంటున్నారు. ప్రస్తుతం చార్మినార్, ఖైరతాబాద్​ జోన్లలో నేటికీ  వేతనాలు ఇవ్వలేదు.  పర్మినెంట్​ ఉద్యోగులకు కూడా 10వ తారీఖు వరకు వేతనాలు అందడంలేదు. శేరిలింగంపల్లి, సికింద్రాబాద్​, కూకట్​పల్లి జోన్లలో పర్మినెంట్​, ఔట్​సోర్సింగ్​ ఉద్యోగులకు వేతనాలు వేశారు. ప్రతి నెలా ఇలాగే అవుతుండడంతో టైమ్​ కి ఈఎంఐలు చెల్లించక చెక్కులు బౌన్స్​ అయి పెనాల్టీలు చెల్లిస్తున్నామని ఉద్యోగులు వాపోతున్నారు. 
ఖజానా ఖాళీ అవడంతోనే..
బల్దియా  కష్టాల్లో ఉందా.. ఉద్యోగుల‌కు జీతాలు చెల్లించడమే భారంగా మారిందా.. అంటే అవుననే సమాధానం వస్తోంది. ఒకటో తారీఖు వస్తోందంటేనే.. ఉద్యోగులు, అధికారుల్లో ఆందోళన మొదలవుతోంది. ఏ బిల్లు ఆపాలి.. ఏ బిల్లు పాస్ చేయాలంటూ ఫైనాన్స్ విభాగం ఒక‌టికి నాలుగు సార్లు చెక్ చేసుకునే పరిస్థితి ఏర్పడింది. ఖజనా ఖాళీ అవడంతోనే జీహెచ్ఎంసీ ఉద్యోగులకు వేతనాలు టైమ్ కి అందడం లేదని పలు యూనియన్​ లీడర్లు అంటున్నారు. గతంలో ఒకటో తారీఖున జీతాలు వేసిన బల్దియా ఇప్పుడు 10 వరకు కూడా శాలరీలు వేయడం లేదని అంటున్నారు.  
జీతాలు ఇవ్వకపోతే ఎట్ల..
దసరా పండుగకు కూడా వేతనాలు ఇయ్యక పోతే ఉద్యోగులు పండుగ ఎలా జరుపుకుంటారు. ప్రతి నెలా 15 వరకు వేతనాలు ఇవ్వడం లేదు. ఇప్పటికైనా కమిషనర్ స్పందించి అందరికీ ప్రతి నెలా ఒకటో తేదీన వేతనాలు అందేలా చూడాలి. లేకపోతే బల్దియా ఆఫీసు ముందు ఆందోళన నిర్వహిస్తాం.                  ‑ ఊదరి గోపాల్, బీజేపీ మజ్దూర్​ మోర్చా సిటీ చైర్మన్​