కాంగ్రెస్​లో సూట్ కేస్​లు, బ్రీఫ్ కేస్​లు మామూలే : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

కాంగ్రెస్​లో సూట్ కేస్​లు, బ్రీఫ్ కేస్​లు మామూలే : ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్

న్యూఢిల్లీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీలో సూట్ కేసులు, బ్రీఫ్ కేసులు, కార్ల బహుమతులు మాములేనని  బీజేపీ నేత ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ విమర్శించారు. తెలంగాణ, కర్నాటక నుంచి కాంగ్రెస్ కప్పం వసూళ్లు జరుగుతున్నాయని ఆరోపించారు. మంగళవారం ఆయన ఢిల్లీలోని తెలంగాణ భవన్ లో  మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ కి చెందిన ముఖ్య నేతపై చేసిన వ్యాఖ్యాలపై... తనకు ఇంకా ఎలాంటి లీగల్ నోటీసులు అందలేదన్నారు. ఆ నోటీసుల తర్వాత సరైన సమాధానం చెబుతానని తెలిపారు. కాంగ్రెస్ నేతల అవినీతి, అక్రమాలను కచ్చితంగా బయటపెడతానని చెప్పారు. 

బీజేపీ పరువు దెబ్బతీసేలా.. బీజేపీ,  బీఆర్ఎస్ ఒక్కటే అని కాంగ్రెస్ ప్రచారం చేస్తుందని ఫైర్ అయ్యారు. అలాంటి వ్యక్తులు కూడా ఆధారాలు చూపాలని, లేదంటే లీగల్ నోటీసులు అందుకోవలసి ఉంటుందని హెచ్చరించారు. కాంగ్రెస్ ఇన్ చార్జ్ ను ఎందుకు తొలగించారన్న ఆరోపణలపై పార్టీ నేతలు సమాధానం చెప్పలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రెవెన్యూ, పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖలో అవినీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు.