68 చెరువుల్లో 268 ఎకరాల ఆక్రమణ

68 చెరువుల్లో 268 ఎకరాల ఆక్రమణ
  • కలెక్టర్ ఆదేశించినా కదలని యంత్రాంగం
  • కబ్జాదారుల్లో టీఆర్ఎస్​ నేతలే ఎక్కువ 
  • హద్దులు గుర్తిస్తేనే మిగిలినవైనా దక్కేవి

కారేపల్లి మండల కేంద్రంలోని పెద్ద చెరువు శిఖం భూమి ఆక్రమణలను తొలగించాలని రెండు నెలలుగా మత్స్యకారులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. సర్వే నెంబర్ 432 లో 184 ఎకరాల చెరువు శిఖం ఉండగా, 60 ఎకరాల దాకా ఆక్రమణకు గురైందని అధికారులకు ఫిర్యాదు చేశారు. గత నెల 28న జిల్లా కలెక్టర్ గౌతమ్ శిఖం భూమిని పరిశీలించి, వారం రోజుల్లోగా సర్వే పూర్తి చేసి రిపోర్టు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. రెండు వారాలు దాటుతున్నా ఇప్పటి వరకు సర్వే పూర్తికాలేదు. అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు, వివిధ రాజకీయ కారణాలతో జిల్లా బాస్​ ఆదేశించినా మండల ఆఫీసర్లు కదలడం లేదు. 

ఖమ్మం, వెలుగు: జిల్లాలో రిజర్వాయర్లు, చెరువులు, కుంటలు కలిపి 1400కు పైగా నీటివనరులు ఉన్నాయి. అన్ని చోట్లా వీటి శిఖం భూములు ఆక్రమణలకు గురవుతున్నాయి. పక్కనే ఉన్న రైతులు తమ భూముల్లో శిఖం భూములను కలుపుకొని సాగుచేసుకునేవారు కొందరైతే, మరికొందరు చెరువులను ఆనుకుని ఉన్న భూములను టార్గెట్ చేసుకొని దాని పక్కన ప్రైవేట్ పట్టా భూములను కొని వెంచర్లు వేస్తున్నారు. ఖమ్మం సిటీలోని లకారం ట్యాంక్​ బండ్​ చుట్టూ వందలాది ఎకరాల భూములు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లగా, ధంసలాపురం చెరువును ఆనుకొని శిఖం భూమి కబ్జా చేసి వెంచర్లు వేశారు. ఖానాపురం చెరువు పరిస్థితి కూడా ఇంతే... ఇలా జిల్లా వ్యాప్తంగా అధికారిక లెక్కల ప్రకారమే 68 చెరువుల్లో 268 ఎకరాల భూమి 353 మంది ఆక్రమణదారుల చేతుల్లో ఉంది. అనధికారికంగా ఇంతకు రెట్టింపు ఉంటుందని అధికారులే ఆఫ్ ది రికార్డు చెబుతున్నారు. 

రియల్​వ్యాపారంతో పెరిగిన కబ్జాలు

ఖమ్మం లాంటి చోట్ల రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరగడంతో భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో చాలా మంది రాజకీయ నేతలు రియల్​వ్యాపారులుగా మారుతుండగా, చాలా ఏళ్ల నుంచి ఈ రంగంలో ఉన్న వారు బాగా సంపాదించి రాజకీయ రంగంలోకి దిగుతున్నారు. అధికార పార్టీ అండదండలు ఉండడం, పైనుంచి ఒత్తిళ్లు ఉంటుండటంతో కింది స్థాయి ఆఫీసర్లు శిఖం భూముల కబ్జాల విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. చెరువు శిఖం భూముల్లో గ్రానైట్ వ్యర్థాలను పోస్తూ వెంచర్లు, ప్లాట్లు చేసి అమ్ముకుంటున్నారు. చెరువుల కబ్జాలపై వరుస ఫిర్యాదులు వస్తుండడంతో ఇటీవల జిల్లా కలెక్టర్​ వీపీ గౌతమ్.. ఇరిగేషన్, రెవెన్యూ, ల్యాండ్ సర్వే డిపార్ట్ మెంట్ అధికారులతో రివ్యూ చేశారు. గూగుల్ మ్యాప్స్​ సహకారంతో చెరువుల కబ్జాలపై పరిశీలన చేసి జాయింట్ సర్వే చేసి, హద్దులు నిర్ణయించాలని ఆదేశించారు. అయినా సర్వే డిపార్ట్ మెంట్ లో స్టాఫ్​ కొరత, ఇరిగేషన్​ ఆఫీసర్లకు నిధుల కొరతతో ఈ ప్రాసెస్ ఇప్పట్లో కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

శిఖం కబ్జాలపై ఫిర్యాదులు 

గత నెలలో కొణిజర్ల మండలం లాలాపురం తుమ్మల చెరువులో చేపల చెరువు కోసం శిఖం భూమిని కబ్జా చేస్తున్నారని ఆఫీసర్లకు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. అంతకుముందు వైరా రిజర్వాయర్​ శిఖం భూముల్లో, ఖమ్మం రూరల్​ మండలం తల్లంపాడు చెరువులో కబ్జాలపై ఫిర్యాదులు వచ్చాయి. ఇలా ఏడాదిలో మొత్తం 620 ఫిర్యాదులు రాగా, దాదాపు 50 చోట్ల కబ్జాలు నిజమేనని గుర్తించి మండల అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కొన్ని ఏరియాల్లో కబ్జాదారుల నుంచి చెరువు భూములను వెనక్కి తీసుకోవడం అధికారులకు తలకు మించిన భారంగా మారుతోంది. ఇక జిల్లా మొత్తం చెరువుల కబ్జాలపై జాయింట్ సర్వే జరిగేదెప్పుడు..? హద్దులను గుర్తించి, కబ్జాదారులపై చర్యలు తీసుకునేందుకు ఎంతకాలం పడుతుందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. 

చెరువు భూములు కాపాడుకునేందుకు చర్యలు

జిల్లా కలెక్టర్ ఆదేశాలతో చెరువుల శిఖం భూముల కబ్జాలపై రెవెన్యూ శాఖతో కలిసి జాయింట్ సర్వే చేయాలని నిర్ణయించాం. మండల స్థాయిలో  ఆ శాఖతో కోఆర్డినేట్ చేసుకొని సర్వే చేయాలని ఆదేశించాం. కబ్జాలపై వచ్చిన ఫిర్యాదులపై వేగంగా స్పందించి, చెరువులను కాపాడుకునేందుకు చర్యలు తీసుకుంటున్నాం.

-  శంకర్​నాయక్​, 
సీఈ, ఇరిగేషన్​ డిపార్ట్ మెంట్, ఖమ్మం