ప్రతి 150 మందిలో ఒకరు బానిసత్వంలో మగ్గుతున్నారు

ప్రతి 150 మందిలో ఒకరు బానిసత్వంలో మగ్గుతున్నారు
  • యూఎన్ ఏజెన్సీస్ ఫర్ లేబర్, మైగ్రేషన్ స్టడీలో వెల్లడి
  • ప్రపంచంలో ప్రతి 150 మందిలో ఒకరు మోడర్న్ స్లేవరీలో మగ్గిపోతున్నట్లు నివేదిక

జెనీవా: బానిసత్వం ఇంకా పోలేదు.. కాకపోతే రూపు మార్చుకున్నది అంతే. ఐక్యరాజ్యసమితి లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల మంది బలవంతంగా కూలీలుగా మారిపోయారు.. లేదా బలవంతపు పెండ్లిళ్ల బాధితులయ్యారు. ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారు. నిజానికి 2030 నాటికల్లా అన్ని రూపాల్లోని ‘మోడర్న్ స్లేవరీ’ని నిర్మూలించాలని ఐక్యరాజ్యసమితి లక్ష్యంగా పెట్టుకున్నది. 

కానీ బలవంతంగా కార్మికులుగా, పెండ్లిళ్ల బాధితులుగా మారిపోతున్న వారి సంఖ్య 2016 – 2021 మధ్య మరో కోటి పెరిగింది. వాక్ ఫ్రీ ఫౌండేషన్.. యూఎన్ ఏజెన్సీస్ ఫర్ లేబర్, మైగ్రేషన్ ఈ మేరకు స్టడీ చేశాయి. ఈ రిపోర్టును ఆగస్టు 31న యూఎన్ రైట్స్ మాజీ చీఫ్ మిషెల్లే బాచ్‌‌‌‌లెట్ ప్రచురించారు. దాని ప్రకారం గతేడాది చివరికి 2.8 కోట్ల మందిని బలవంతంగా కార్మికులుగా మార్చారు. 2.2 కోట్ల మంది ఇష్టం లేకున్నా పెండ్లిళ్లు చేసుకున్నారు. దీని ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి 150 మందిలో ఒకరు ఆధునిక బానిసత్వంలో మగ్గిపోతున్నారు.

కరోనా దెబ్బ.. దేశాల్లో అనిశ్చితి..

‘‘రెండున్నరేండ్ల కిందట ప్రపంచాన్ని పట్టిపీడించిన కరోనా.. పేదల పరిస్థితిని దిగజార్చింది. చాలా మంది కార్మికుల అప్పులను పెంచింది. వీటితోపాటు వాతావరణ మార్పులు, దేశాల్లో అంతర్యుద్ధాలు, సాయుధ పోరాటాల వల్ల ఉపాధి, విద్యపై పెద్ద ఎత్తున ప్రభావం పడింది. తీవ్రమైన పేదరికం.. బలవంతపు, ప్రమాదకర వలసల పెరుగుదలకు దోహదపడింది. ఇది ముప్పును మరింత పెంచింది” అని యూఎన్ రిపోర్టులో వెల్లడించింది. బలవంతంగా లేబర్‌‌‌‌‌‌‌‌గా మారేటోళ్లు కొన్నేండ్లపాటు ఆ ఊబిలో కొనసాగితే.. బలవంతపు పెండ్లిళ్లు చేసుకున్న వాళ్ల పరిస్థితి ‘జీవిత ఖైదు’ కిందే లెక్కని అని చెప్పింది. ‘‘ప్రతి ఐదుగురు పిల్లల్లో ఒకరు కార్మికులుగా మారిపోతున్నారు. వారిలో సగానికిపైగా లైంగికంగా వేధింపులకు గురవుతున్నారు” అని పేర్కొంది. 2016తో పోలిస్తే 2021 నాటికి బలవంతపు పెండ్లిళ్ల బాధితులు 66 లక్షల మంది పెరిగారని తెలిపింది. అన్ని వలసలు సురక్షితంగా, క్రమబద్ధంగా, సక్రమంగా ఉండేలా చూసుకోవాల్సిన అవసరాన్ని ఈ నివేదిక నొక్కి చెబుతున్నదని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐవోఎం) చీఫ్ ఆంటోనియో విటోరినో ఓ ప్రకటనలో చెప్పారు. 

ప్రతి దేశంలోనూ.. 

‘‘ప్రపంచంలోని ప్రతి దేశంలోనూ మోడర్న్ స్లేవరీ ఉంది. ఇంకో దురదృష్టకర విషయం ఏంటంటే.. బలవంతంగా కార్మికులుగా మారిన వాళ్లలో సగానికి పైగా.. బలవంతపు పెండ్లిళ్ల బాధితుల్లో నాలుగో వంతు మంది ఎగువ మధ్య తరగతి ఆదాయం లేదా అధిక ఆదాయ దేశాల్లోనే ఉన్నారు. ఇక ఫోర్స్‌‌‌‌డ్ లేబర్ ఎక్కువగా ప్రైవేటీ ఎకానమీలోనే ఉన్నారు” అని యూఎన్ చెప్పింది. అమెరికాతో సహా అనేక దేశాల్లో నిర్బంధ జైలు కార్మికుల దుర్వినియోగం గురించి యూఎన్ ఆందోళన వ్యక్తం చేసింది. బలవంతపు కార్మికుల్లో 14 శాతం మంది ప్రభుత్వ అధికారులు ఇచ్చిన పనులు చేస్తున్నారని నివేదికలో పేర్కొంది. నార్త్ కొరియా, చైనా దేశాల్లో ఫోర్స్‌‌‌‌డ్ లేబర్ పెరుగుతున్నారని చెప్పింది.