ఓరుగల్లు​పై సీఎం ఫోకస్​

ఓరుగల్లు​పై సీఎం ఫోకస్​
  • 14 రోజుల్లో 3 సార్లు జిల్లాకు
  • సగటున ఐదురోజులకోసారి జిల్లాలో అడుగుపెడ్తున్న సీఎం రేవంత్‍రెడ్డి
  • నేడు గ్రేటర్ వరంగల్‍ ఎన్నికల ప్రచారాని ముఖ్యమంత్రి

వరంగల్‍, వెలుగు: ఓరుగల్లుపై సీఎం రేవంత్‍రెడ్డి స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. పార్లమెంట్‍ నియోజకవర్గంపై కాంగ్రెస్​ జెండా ఎగురవేయడం, అభ్యర్థి కడియం కావ్య విజయమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. మిగతా నియోజకవర్గాలకు భిన్నంగా కావ్య తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఐదురోజులకోసారి వరంగల్‍ ఎంపీ నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. 14 రోజుల వ్యవధిలోనే సీఎం మూడుసార్లు జిల్లాకు రావడంతో పార్టీ కేడర్‍లో జోష్‍ పెరుగుతోంది. దీనికితోడు రేవంత్‍రెడ్డి రాష్ట్ర సీఎంగా జిల్లా అభివృద్ధికి భరోసా ఇస్తుండడంతో ఆ పార్టీ ఎమ్మెల్యేలు సైతం ఖుషీ అవుతున్నారు.  

వరంగల్‍ ఎంపీ సీటు వెరీ హాట్‍.. 

వరంగల్‍ పార్లమెంట్‍ పరిధిలో గతంలో ఎంపీ ఎలక్షన్‍ జరిగిందా అంటే జరిగింది అన్నట్లు ఉండేది. ఈసారి మాత్రం మొదటి నుంచి రాష్ట్ర రాజకీయాల్లో ఈ నియోజకవర్గం హాట్‍ టాపిక్‍గా మారింది. మొదట్లో కడియం శ్రీహరి, ఆరూరి రమేశ్‍, తాటికొండ రాజయ్య, సిట్టింగ్‍ ఎంపీ పసునూరి దయాకర్‍ వంటి దళిత నేతలతో బీఆర్‍ఎస్‍ కు నియోజకవర్గంలో ఎదురే లేదన్నట్లుగా ఉంది. తీరా నోటిఫికేషన్‍ వచ్చేసరికి ఆ పార్టీలో ప్రభావం చూపే దళిత నేతలంతా కాంగ్రెస్‍, బీజేపీలో చేరడంతో గులాబీ పార్టీ డీలా పడింది. ఈ క్రమంలో అదే పార్టీ నుంచి కాంగ్రెస్‍లో చేరిన కడియం శ్రీహరి బిడ్డ కడియం కావ్య, బీజేపీలో చేరిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ మధ్యనే అసలు పోటీ నెలకొంది. రెండు జాతీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలపడంతో పాలిటిక్స్ వేడందుకున్నాయి.

కడియంను పార్టీలోకి తేవడంతో షురూ..

రాష్ట్రంలో 17 పార్లమెంట్‍ స్థానాలు ఉండగా సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్‍ లోక్‍సభ సీటు గెలవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలో మారిన రాజకీయ పరిణామాల్లో గతంలో ఇక్కడినుంచి పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య తప్పితే పార్టీలో పెద్దగా ప్రభావం చూపే అభ్యర్థి లేరని భావించారు. ఈ క్రమంలో బీఆర్‍ఎస్‍ తరఫున ఏకంగా టిక్కెట్‍ సాధించి ప్రచారంలో ఉన్న కడియం కావ్యను హస్తం పార్టీలోకి తీసుకురావడం  ద్వారా సీఎం రేవంత్‍రెడ్డి వరంగల్‍ ఎంపీ స్థానంపై గురి పెట్టారు. వరంగల్‍ లోక్‍సభ పరిధిలో ఉన్న ఏడుగురు ఎమ్మెల్యేలతో సమావేశం పెట్టి వారి చేతికే గెలుపు బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత తానే రంగంలోకి దిగారు. 14 రోజుల వ్యవధిలో ఐదురోజులకోసారి అన్నట్లుగా మూడుసార్లు వరంగల్ లో పర్యటించారు. హస్తం పార్టీ అభ్యర్థి కడియం కావ్య విజయం కోసం ఏప్రిల్‍ 24,, 30న సభలు నిర్వహించగా, నేడు గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో ప్రచారంలో పాల్గొననున్నారు. 

ఓరుగల్లు అభివృద్ధిపై భరోసా..

కాంగ్రెస్‍ అధికారంలోకి రావడంతో ఓరుగల్లుకు చెందిన 11 మంది కాంగ్రెస్‍ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‍రెడ్డిని నియోజకవర్గానికి పిలిచి, అభివృద్ధికి ఫండ్స్​ కేటాయించేలా చూడాలని భావించారు. కాగా, గత అసెంబ్లీ ఎన్నికల తర్వాత మళ్లీ పార్లమెంట్‍ ఎన్నికల ప్రచారంలో సీఎంగా జిల్లాకు వస్తున్న రేవంత్‍రెడ్డి ఓరుగల్లు అభివృద్ధిపై ఎమ్మెల్యేలకు, జనాలకు భరోసా ఇస్తున్నారు. హైదరాబాద్‍కు దీటుగా వరంగల్‍ను అభివృద్ధి చేస్తానని, హైదరాబాద్‍ నుంచి వరంగల్‍, అక్కడి నుంచి రామగుండం వరకు నేషనల్‍ హైవేస్‍ను ఆనుకుని ఇండస్ట్రీయల్‍ కారిడర్‍ ఏర్పాటు చేస్తామని ఇప్పటికే ఈ పార్లమెంట్​ పరిధిలో జరిగిన సభల్లో సీఎం హామీ ఇచ్చారు. 

ఎస్సారెస్పీ స్టేజ్‍ వన్‍, టూ, దేవాదులతోపాటు ఓరుగల్లులో ఆగిన ప్రాజెక్టులన్నీ పూర్తిచేసి ప్రతి ఎకరాకు సాగు నీరందించే బాధ్యత తనదేనన్నారు. ఐటీ రంగంతోపాటు వరంగల్‍ కాకతీయ మెగా టెక్స్​టైల్‍ పార్కును అంతర్జాతీయ స్థాయిలో డెవలప్‍ చేస్తామని, గ్రేటర్‍ సిటీ జనాల చిరకాల కోరికగా ఉన్న అండర్‍గ్రౌండ్‍ డ్రైనేజీ నిర్మాణంపై హామీ ఇచ్చారు. వరంగల్‍, కరీంనగర్‍, ఖమ్మం కార్పొరేషన్‍లో చెత్త సమస్యకు పరిష్కారం చూపడంలో భాగంగా విద్యుత్‍ ఉత్పత్తి తీసుకువస్తామన్నారు. కేయూను ప్రక్షాళన చేసి కొత్త వీసీని నియమించనున్నట్లు తెలిపారు. పరకాల నియోజకవర్గంలోని ప్రొఫెసర్‍ జయశంకర్‍ సొంత గ్రామమైన అక్కంపేటను రెవెన్యూ గ్రామం చేస్తామనే ప్రకటనను తమ ప్రభుత్వంలో అమలు చేసి చిత్తశుద్ధిని నిరూపించుకున్నట్లు చెప్పారు.