జీహెచ్ఎంసీలో బదిలీ టెన్షన్!

జీహెచ్ఎంసీలో బదిలీ టెన్షన్!
  • మూడేండ్లకుపైగా ఒకేచోట పనిచేసే వారిపై కమిషనర్ ఫోకస్
  • జోనల్ స్థాయి నుంచి ఔట్ సోర్సింగ్ సిబ్బంది దాకా వివరాల సేకరణ 
  • లోక్ సభ ఎన్నికలు పూర్తి అయిన వెంటనే  బదిలీలు చేసే అవకాశం 
  • ఆ లోపు ఉద్యోగుల జాబితా రెడీ చేయాలని అడ్మిన్ విభాగానికి ఆదేశాలు

హైదరాబాద్, వెలుగు  :  జీహెచ్ఎంసీలో మూడేండ్లకుపైగా ఒకేచోట పనిచేసే ఉద్యోగుల బదిలీపై కమిషనర్ రోనాల్డ్ రోస్ ఫోకస్ పెట్టారు. జోనల్ స్థాయి నుంచి కింది స్థాయి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల దాకా వివరాలు సిద్ధం చేయాలని కూడా అడ్మిన్ అడిషనల్ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికలైన వెంటనే బదిలీ చేయనున్నట్లు తెలిసింది. లోక్ సభ ఎన్నికల కోడ్ కు ముందే కొందరు అధికారులను ట్రాన్స్ ఫర్ చేశారు. మరోవైపు రిటైర్డ్ అయి బల్దియాలోనే కంటిన్యూ అయ్యే ఉద్యోగులపైనా వేటు వేశారు.  

తాజాగా మరోసారి మూడేండ్లకు పైగా ఒకేచోట ఉన్న ఉద్యోగుల ట్రాన్స్ ఫర్లకు నిర్ణయించారు. ప్రధానంగా అవినీతి ఆరోపణలు, డ్యూటీలు సరిగా చేయని, ప్రజలకు అందుబాటులో ఉండకుండా.. సమస్యలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా ఉండే ఉద్యోగులపై వేటు పడనుంది. ఇప్పటికే ఏసీబీ దాడులు, విజిలెన్స్ విచారణలపైనా కమిషనర్ ఫోకస్ పెట్టారు. అయితే.. లోక్ సభ ఎన్నికలు రావడంతో పనుల్లో బిజీలో అయ్యారు. ఎన్నికలు ముగిసిన వెంటనే బదిలీల ప్రక్రియ షురూ కానుంది. ఇలా ట్రాన్స్ ఫర్లపై చర్చ జరుగుతుండగా ఎటు బదిలీ అవుతామోనని అధికారులు, సిబ్బందిలో టెన్షన్ నెలకొంది. 

ఎన్నికలప్పుడే అటూ ఇటూ..  

బల్దియాలో ప్రస్తుతం అధికారులు, సిబ్బంది దాదాపు సగానికిపైగా 3,4 ఏండ్లకు మించి ఒకే చోట విధులు నిర్వహిస్తున్నవారే ఉన్నారు. జోనల్ స్థాయి నుంచి డిప్యూటీ కమిషనర్లు సహా పలువురు అధికారులు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది అంతా ఏండ్లుగా తిష్టవేశారు. ఏదో ఒక సందర్భంలో తప్పని పరిస్థితుల్లోనే కొందరిని బదిలీ చేస్తూ వచ్చారు. సాధారణ బదిలీలు ఏండ్లుగా జరగడంలేదు. ఇక ఎన్నికల కోడ్ వచ్చినప్పుడు జీహెచ్ఎంసీ పరిధిలోనే అటు ఇటు ట్రాన్స్ ఫర్లు చేస్తున్నారే తప్ప వేరే చోటకు పంపడంలేదు. ఎన్నికలు అయిపోగానే తిరిగి ఎవరి పోస్ట్ లోకి వారే వస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికలు, ప్రస్తుత లోక్ సభ ఎన్నికల్లోనూ ఇదే జరిగింది. ప్రధానంగా బల్దియాలో  ఎక్కువ మంది సిబ్బంది లేకపోవడంతో  అందులో అనుభవం ఉన్న ఉద్యోగులతో ఒకేచోట పని చేయించాల్సి వస్తుంది. ఇక తప్పనిసరైతేనే అలాంటి వారినే ట్రాన్స్ ఫర్  చేస్తున్నారు.  ఇప్పుడు అందరిని బదిలీ చేసే చాన్స్ ఉంది. 

విజిలెన్స్ విచారణ కూడా.. 

జీహెచ్ఎంసీలోని అన్ని  విభాగాలపైనా కమిషనర్ స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఎక్కడ కూడా అవినీతి, అక్రమాలకు తావులేకుండా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. గత రెండు నెలల్లో రెండింటిపైనా విచారణ చేయించారు.  విజిలెన్స్ అధికారులు మరో రెండింటిపై విచారణ చేపట్టారు. వీటి తర్వాత కూడా ఆరోపణలు వస్తున్న ప్రతి డిపార్టుమెంట్ పై విజిలెన్స్ విచారణకు కమిషనర్ సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఇలా వరుసగా విచారణలు చేస్తుండడంతో పాటు అవినీతి, అక్రమాలకు పాల్పడే ఉద్యోగులపై చర్యలు తీసుకోనున్నారు.

లోక్ సభ ఎన్నికల అనంతరం  మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం కనిపిస్తుంది. గత ప్రభుత్వం ఉన్న సమయంలో ఏ విచారణ జరపాలన్నా కూడా పెద్దగా అనుమతులు వచ్చేవి కాదు. కానీ ప్రస్తుత సర్కార్ నుంచి జీహెచ్ఎంసీకి పూర్తి స్థాయిలో సపోర్టు ఉన్నట్లు తెలుస్తుంది. దీంతో కమిషనర్ స్వేచ్ఛగా నిర్ణయం తీసుకుంటున్నట్లు కనిపిస్తుంది. ఇప్పటికే రిటైర్ మెంట్ అయి కూడా జీహెచ్ఎంసీలోనే కొనసాగేవారిని తొలగించారు.