- పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి రాజ్యసభ చైర్మన్ సూచన
- జంతర్‌మంతర్ వద్ద లాఠీచార్జ్‌పై కేంద్ర హోం మంత్రి ప్రకటన కోరిన ఖర్గే
న్యూఢిల్లీ: స్టూడెంట్ల మీద పోలీసుల లాఠీచార్జ్‌పై సమాధానం చెప్పాలన్న ప్రతిపక్షాల డిమాండ్‌ను కేంద్ర హోం మంత్రి అమిత్‌షా దృష్టికి తీసుకెళ్లాలని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజుకు రాజ్యసభ చైర్మన్ సీపీ రాధాకృష్ణన్ సూచించారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే చేసిన విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోవాలని, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిగా ప్రతిపక్షాల అభిప్రాయాన్ని కేంద్ర హోంమంత్రికి తెలియజేయాలని చైర్మన్ స్పష్టం చేశారు.
అమిత్‌షా ఆన్సర్ చెప్పాల్సిందే: ఖర్గే
గురువారం రాజ్యసభ సమావేశం ప్రారంభంకాగానే ప్రశ్నోత్తరాలు చేపట్టేందుకు చైర్మన్ ప్రయత్నించినప్పటికీ, అపొజిషన్ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన మల్లికార్జున ఖర్గే.. విద్యార్థులపై పోలీసుల దాడి గురించి అమిత్ షా సభకు వచ్చి ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. దేశంలోని 140 కోట్ల మంది ప్రజలకు సంబంధించిన నిజమైన సమస్యలనే తాము లేవనెత్తుతున్నామని, స్టూడెంట్లను పోలీసులు కొట్టిన అంశంపై చర్చకు సిద్ధంగా ఉన్నామని అన్నారు.
‘‘హోంమంత్రి అమిత్‌షా, ప్రధాని మోదీ సభకు రావాలని కోరుతున్నాం. హోంమంత్రి సభలో ప్రకటన చేయాలని చైర్మన్ ఆదేశించాలి” అని ఖర్గే డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో నిరసనలు కూడా భాగమేనని గతంలో అరుణ్ జైట్లీ చెప్పారని గుర్తు చేశారు. తాము ప్రజా సమస్యలను సభలో ప్రస్తావిస్తుంటే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటోందని విమర్శించారు.
ఏ మంత్రి సమాధానం ఇవ్వాల్నో మీరే చెప్తరా?: రిజిజు
ఖర్గే డిమాండ్‌కు స్పందించిన పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు.. ఏ నిబంధన కింద అమిత్ షా సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారో ఖర్గే చెప్పలేదని అన్నారు. ప్రభుత్వం తరఫున ఏ మంత్రి సమాధానం చెప్పాలో నిర్ణయించే అధికారం.. విపక్షానికి లేదని ఆయన స్పష్టం చేశారు. కొత్త కాంగ్రెస్ ఎంపీలకు వారి నాయకత్వం పార్లమెంటరీ విధానాలను నేర్పించట్లేదని మండిపడ్డారు. దీంతో ఇరుపక్షాల మధ్య వాగ్వాదం మొదలై సభలో గందరగోళం నెలకొంది.
