వడ్లు వానపాలు.. ఇప్పటి దాకా సర్కార్ కొన్నది 28 శాతమే

వడ్లు వానపాలు.. ఇప్పటి దాకా సర్కార్ కొన్నది 28 శాతమే
  •     కాంటాలు, ట్రాన్స్​పోర్ట్​లో ఆలస్యం
  •     చెడగొట్టు వానలకు సెంటర్లు, కళ్లాల్లో తడుస్తున్న వడ్లు
  •     పర్దాలు, సంచులు కూడా ఇయ్యని సర్కారు 
  •     కుప్పల దగ్గర  రైతుల పడిగాపులు
  •     దిగుబడి అంచనా 1.32 కోట్ల టన్నులు
  •     కొనుగోళ్లు స్టార్టయి నెలదాటినా 38 లక్షల టన్నులే కొన్నరు

వెలుగు , నెట్​వర్క్: వడ్ల కొనుగోళ్లలో ఆలస్యం రైతుల పాలిట శాపంగా మారింది. చెడగొట్టు వానల వల్ల కొనుగోలు సెంటర్లలో, కళ్లాల్లో వడ్లు తడిసిపోతున్నాయి. వాటిని కాపాడుకునేందుకు రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. కప్పేందుకు పర్దాలు, నింపేందుకు సంచులు కూడా సర్కారు ఇవ్వడం లేదు. టైమ్​కు వడ్లు కొనేటోళ్లు లేక రోజులతరబడి కుప్పల దగ్గర పడిగాపులు కాస్తున్నామని, తీరా ఇప్పుడు వర్షాలతో వడ్లన్నీ తడిసిపోతున్నాయని రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. మరో రెండు మూడు రోజులు వర్షాలు పడే అవకాశం ఉండటంతో మరింత భయపడుతున్నారు. వెంట వెంటనే సర్కారు కొనుగోళ్లు చేపట్టకపోవడంతోనే సమస్యలు వస్తున్నాయని రైతులు అంటున్నారు.  

మూడోవంతు కూడా కొనలే

ఈ యాసంగిలో 1.32 కోట్ల టన్నుల వడ్ల దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎఫ్‌‌సీఐ  80.88 లక్షల టన్నులను తీసుకునేందుకు అంగీకరించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఐకేపీ, పీఏసీఎస్‌‌‌‌, జీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 6,391 సెంటర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వడ్లను కొంటోంది. కొనుగోళ్లు మొదలై నెల దాటగా ఇప్పటివరకు ప్రభుత్వం 28 శాతం వడ్లను మాత్రమే కొన్నది. కోటీ 32 లక్షల టన్నులకు గాను ఈ నెల 15 వరకు కేవలం 38 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. అందులోనూ 3 లక్షల టన్నుల వడ్లను సెంటర్ల నుంచి మిల్లులకు తరలించలేదు. దీంతో తాజాగా పడిన వానలకు రైతుల దగ్గర ఉన్న వడ్లు, వారి నుంచి సర్కారు కొన్న వడ్లు వడ్లు తడిసిపోయాయి.

కాంటాలు, ట్రాన్స్​పోర్ట్​ లేట్

కొనుగోలు సెంటర్లలో వడ్ల కాంటాలు చాలా లేటవుతున్నాయి. వడ్లు తెచ్చి రోజుల తరబడి రైతులు ఎదురుచూడాల్సి వస్తోంది . ఒక్కో సెంటర్​లోనైతే 25, 30 రోజులపాటు  పడిగాపులు కాయాల్సి వస్తోంది. అసలే కొనుగోళ్లు ఆలస్యమవుతుంటే  కొన్న వడ్లను కూడా రైస్‌‌‌‌ మిల్లులకు తరలించే పరిస్థితి లేదు. జిల్లాల్లో వడ్ల ట్రాన్స్​పోర్ట్​కు టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. లాక్​డౌన్​ వల్ల లారీ డ్రైవర్లు, క్లీనర్లలో ఎక్కువ మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారని వారు చెప్తున్నారు. దీంతో సెంటర్లకు సరిపడా లారీలు రావడం లేదు. మరోవైపు మిల్లుల్లో బిహార్, జార్ఖండ్​, చత్తీస్‌‌‌‌గఢ్‌‌ ‌‌తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన హమాలీలు, కూలీలే పనిచేస్తుంటారు. వీళ్లలో చాలా మంది  లాక్​డౌన్​ వల్ల సొంత రాష్ట్రాలకు వెళ్లడంతో వడ్ల అన్​లోడ్​ ఆలస్యమవుతోందని మిల్లర్లు చెప్తున్నారు. ప్రస్తుతం 33 శాతం మంది ఆఫీసర్లు, ఉద్యోగులే వడ్ల కొనుగోళ్ల డ్యూటీకి హాజరవుతున్నందున సెంటర్లలో కాంటా పెట్టడం, బస్తాలను లారీల్లోకి ఎక్కించడం లాంటి పనులు ఆలస్యమవుతున్నాయి. 

పర్దాలు లేక తడుస్తున్నయ్​

చెడగొట్టు వానలతో వడ్లు తడవకుండా ప్రతి సెంటర్​లో కనీసం 50 నుంచి 100 పర్దాలు అందుబాటులో ఉంచాలని మొదట్లో ఆఫీసర్లు నిర్ణయించారు. కానీ ఇప్పటికీ మెజారిటీ సెంటర్లకు టార్పాలిన్ల  సప్లయ్​జరగలేదు. దీంతో  సెంటర్లలో పోసిన వడ్ల కుప్పలు వర్షాలకు తడుస్తున్నాయి. అన్ని సెంటర్లలో 54 శాతం కొత్త, 46 శాతం పాత బార్దాన్​ కలిపి 20 కోట్ల సంచులు ఉన్నట్లు ఇటీవల సివిల్​సప్లయ్​ మంత్రి గంగుల కమలాకర్​ చెప్పారు. కానీ ఏ సెంటర్​లో చూసినా వడ్ల కుప్పలే కనిపిస్తున్నాయి. ‘‘సర్కారు చెప్తున్నట్లుగా సరిపడా బర్దాన్ ​ఉండి, మాకు ఇస్తే వడ్లను సంచుల్లోనే నింపుకునేవాళ్లం కదా?’’ అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా కురిసిన వానలకు రాష్ట్రవ్యాప్తంగా వేలాది సెంటర్లలో వడ్ల కుప్పలు తడిసి రైతులు ఆందోళన చెందుతున్నారు. తడిసిన వడ్లను కొంటామని ఎమ్మెల్యేలు, మంత్రులు చెప్తున్నా అవి మాటలకే పరిమితం అవుతున్నాయి. తాలు పేరిట వడ్లను దింపుకోకుండా ముప్పుతిప్పలు పెడుతున్న మిల్లర్లు తడిసిన వడ్ల జోలికే వెళ్లట్లేదు. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో వీటిని ఆరబోసే పరిస్థితి లేదు. దీంతో రైతుల్లో ఆందోళన పెరిగిపోతోంది.

రైతులకు చెల్లింపులు లేట్​

వడ్లను కొన్న 72 గంటల్లో రైతుల అకౌంట్లలో డబ్బులు వేస్తామని చెప్పిన సర్కారు ఆ విషయంలోనూ ఆలస్యం చేస్తోంది. వారాలు గడుస్తున్నా పైసలు పడ్తలేవని రైతులు అంటున్నారు. ఇప్పటికి రూ. 7,181 కోట్ల విలువైన వడ్లు కొన్న ప్రభుత్వం కేవలం రూ. 2943 కోట్లను చెల్లించింది. మరో రూ. 4238 కోట్లు పెండింగ్​లో ఉన్నాయి. 

తడిసిన ధాన్యం కొనాలెనా వడ్లను సెంటర్​కు తెచ్చి 

10 రోజులైతున్నా ఆఫీసర్లు పట్టించుకుంటలేరు. ఎప్పుడు కాంటా పెడ్తరో అని కండ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నం. తీరా ఇప్పుడు చెడగొట్టు వాన వల్ల  వడ్లన్నీ కొట్టుకపోయినయ్. ఇందుకు ఆఫీసర్ల నిర్లక్ష్యమే కారణం. మాకు వెంటనే  కొట్టుకపోయిన వడ్లకు నష్టపరిహారం ఇయ్యాలె. తడిసిన వడ్లను ఎలాంటి షరతులు లేకుండా కొనాలె.
- మార్గం శ్రీనివాస్, దమ్మన్నపేట, 
మేడిపల్లి మండలం, జగిత్యాల జిల్లా

8 రోజులుగా కాంటా పెడ్తలేరు

మా మండలంలో పీఏ సీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో దాదాపు 40 నుంచి 50 లారీల వడ్లు కుప్పలు పోసి ఉన్నయ్​.  ఎనిమిది రోజులుగా కాంటా పెడ్తలేరు. వర్షం వస్తే వడ్లు తడుస్తున్నయ్​. వాటిపై పట్టాలు కప్పడంతోనే సరిపోతున్నది. ఇక ఆరబోసేదెప్పుడు? వెంటనే కొనుడు స్పీడ్ చేయాలి.
- యాకంటి రవికుమార్, రైతు, ములకలపల్లి మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

వారం రోజులుగా పడిగాపులు కాస్తున్నం

కొనుగోలు సెంటర్​లో వడ్లు పోసి వారం రోజులైతున్నది. వర్షం వల్ల తేమ కూడా వచ్చింది. మా సెంటర్ నుంచి రోజుకు ఒకటి రెండు లారీల వడ్లు మాత్రమే లోడయితున్నయ్​. ఇప్పటికే  వారం రోజులుగా పడిగాపులు పడ్తున్నం. మబ్బులను చూసి పై పాణాలు పైన్నే పోతన్నయి. మరోసారి వర్షం పడితే చాలా ఇబ్బంది పడ్తం. ఆఫీసర్లు వెంటనే వడ్లు కొనాలె.
- అజ్మీర భాస్కర్ నాయక్ , రైతు, 
మహాముత్తారం, భూపాలపల్లి జిల్లా