- తన తండ్రి రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాహుల్ గాంధీ నివాళి
- ఢిల్లీలోని వీర్ భూమి వద్ద సోనియా, ప్రియాంక, ఖర్గే పలువురు నేతల నివాళి
న్యూఢిల్లీ: భారత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ 35వ వర్ధంతి సందర్భంగా గురువారం దేశవ్యాప్తంగా ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తన తండ్రితో ఉన్న జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు. తండ్రితో ఉన్న ఓ ఫొటోను ‘ఎక్స్’లో పోస్ట్ చేస్తూ, భావోద్వేగ నివాళి అర్పించారు. ‘‘నాన్నా.. మీరు కలలుగన్న నైపుణ్యాలు గల, సంపన్నమైన, శక్తివంతమైన భారతదేశాన్ని నిర్మించే బాధ్యతను నేను తీసుకుంటున్నాను.
మీ బోధనలు, మీ విలువలు, మీ జ్ఞాపకాలు ఎల్లప్పుడూ నాతోనే ఉంటాయి’’ అని రాహుల్ పోస్ట్ చేశారు. అంతకుముందు, రాహుల్ గాంధీ ఢిల్లీలోని ‘వీర్ భూమి’ని సందర్శించి తన తండ్రి స్మారకం వద్ద నివాళి అర్పించారు. కాగా, రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన స్మారక స్థలం ‘వీర్ భూమి’ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా, కేసీ వేణుగోపాల్, మాజీ సీఎంలు భూపిందర్ సింగ్ హుడా, అశోక్ గెహ్లాట్, పలువురు కేంద్రమాజీ మంత్రులు నివాళి అర్పించారు.
पापा, आपने जिस कुशल, समृद्ध और मजबूत भारत का सपना देखा था, उसे साकार करने की जिम्मेदारी मैं पूरी करूंगा।
— Rahul Gandhi (@RahulGandhi) May 21, 2026
आपकी सीख, आपके संस्कार और आपकी यादें हमेशा मेरे साथ रहेंगी। pic.twitter.com/uToSqMGdY3
పేపర్ లీక్స్ జరుగుతుంటే.. మోదీ రీల్స్: రాహుల్
నీట్-యూజీ పేపర్ లీకేజీ వ్యవహారంపై ప్రధాని మోదీపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రధాని మోదీ ఇటలీలో రీల్స్ చేసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారని, ఇక్కడ మాత్రం పేపర్ లీకులతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్ నాశనమై యువత న్యాయం కోసం రోడ్లపైకి వస్తున్నారని మండిపడ్డారు.
గురువారం ‘ఎక్స్’ వేదికగా రాహుల్ స్పందిస్తూ కేంద్రంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పేపర్ లీకేజీపై ప్రధాని మోదీ కనీసం స్పందించడంలేదని, విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ను పదవి నుంచి తొలగించలేదని ధ్వజమెత్తారు. జైపూర్‌లో విద్యార్థులు, ఎన్‌ఎస్‌యూఐ కార్యకర్తలపై లాఠీచార్జీ చేయించడాన్ని ఆయన ఖండించారు.
