కొత్త పోడు కొట్టేది లేదు.. పాత పోడు వదిలేది లేదు

కొత్త పోడు కొట్టేది లేదు.. పాత పోడు వదిలేది లేదు
  • పోడు భూముల సమస్యలపై అఖిలపక్ష సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క

మహబూబాబాద్: కొత్త పోడు కొట్టేది లేదు.. పాత పోడు వదిలేది లేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే సీతక్క ప్రకటించారు. పోడు భూముల సమస్యపై త్వరలో ఆదిలాబాద్ నుంచి అచ్చంపేట, మహబూబాబాద్ వరకు పోరాటం చేస్తామని.. ఈనెల 20 వ తేదీన గంగారం నుంచి గూడూరు వరకు ర్యాలీ నిర్వహిస్తామని ఆమె స్పష్టం చేశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో పోడు భూముల సమస్య పై అఖిలపక్ష పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సమావేశంలో ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ అటవీ హక్కుల చట్టాన్ని గౌరవించి పోడు రైతులందరికీ పట్టాలు ఇవ్వాల్సిందేనన్నారు. అంతేకాదు రైతుబంధు కూడా వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. పోడు భూముల్లో అటవీశాఖ అధికారులు ట్రెంచ్ లు కొట్టడం, కందకాలు తవ్వడం, ఆక్రమించుకోవడం,  దాడులు చేయడం ఆపాలని ఆమె కోరారు.
ఎన్నికల ముందు హామీ గుర్తు లేదా: ఎమ్మెల్యే సీతక్క
ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో, బయట, ఎన్నికల ముందు మహబూబాబాద్ బహిరంగ సభలో పోడు రైతులందరికీ పట్టాలిస్తామని ఇచ్చిన హామీ గుర్తు లేదా అని ఎమ్మెల్యే సీతక్క ప్రశ్నించారు. ఎన్నికల ముందు ఇచ్చిన మాటను సీఎం కేసీఆర్ నిలబెట్టుకోవాలన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు పోడు రైతులను తీసుకొనివచ్చి బహిరంగ సభను విజయవంతం చేసుకున్నారని ఆమె గుర్తు చేశారు. మడగూడెంలో అధికారులు రైతులను కొట్టడం వల్లే వారు తిరగబడ్డారని ఆమె తెలిపారు. మీడియా కూడా అధికారుల పక్షం  ఉండకూడదు.. ప్రజల పక్షాన ఉండాలని ఆమె సూచించారు.