ఆగస్టులో బండ్ల సేల్స్‌‌  దూసుకుపోయినయ్‌

ఆగస్టులో బండ్ల సేల్స్‌‌  దూసుకుపోయినయ్‌

న్యూఢిల్లీ:ఆటోమొబైల్ రిటైల్ అమ్మకాలు ఈ ఏడాది ఆగస్టులో 14 శాతం పెరిగి 13.8 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. గత ఏడాది ఆగస్టులో 12.9 లక్షల యూనిట్లు అమ్ముడుపోయాయి.  ప్యాసింజర్ వెహికల్స్ తో పాటు కమర్షియల్ వెహికల్స్ అమ్మకాలు కూడా బలంగా ఉన్నాయని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ అసోసియేషన్ (ఫాడా) డేటా పేర్కొంది. సెమీకండక్లర్ల కొరత వల్ల ఉత్పత్తి తగ్గినా రిటైల్ అమ్మకాలు మాత్రం 14 శాతం పెరిగాయని తెలిపింది. పెట్రోల్,  డీజిల్ ధరలు పెరుగుతున్నా, అన్ని విభాగాలలో వెహికల్స్ ధరలు పెరిగినా అమ్మకాల్లో పురోగతి కనిపిస్తూనే ఉంది. కొత్త మోడళ్లు,  చౌక వడ్డీరేట్లకు ఆటో లోన్లు డిమాండ్ పెరగడానికి దోహదం చేశాయి. కార్లు, ఎస్‌‌యూవీలు  వ్యాన్‌‌లతో కూడిన ప్యాసింజర్ వెహికల్స్ (పీవీలు) ఆగస్టులో 39 శాతం పెరిగి 2,53,363 యూనిట్లకు చేరాయి.  సెమీకండక్టర్ల సప్లైలో కొరత వల్ల చాలా కంపెనీల ప్లాంట్లు షెడ్యూల్ లేకుండా మూతపడ్డాయి. మారుతి సుజుకి  మహీంద్రా & మహీంద్రాతో సహా అనేక కంపెనీలు సెప్టెంబర్‌‌లోనూ ఫ్యాక్టరీలను మూసే ఉంచాలని నిర్ణయించడంతో డీలర్‌‌షిప్‌‌లలో స్టాక్ మరింత తగ్గే అవకాశాలు ఉన్నాయి. డెలివరీ షెడ్యూళ్లు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఫాడా డేటా ప్రకారం ఆగస్టులో పీవీల సగటు ఇన్వెంటరీ పీరియడ్ 25–-30 రోజులుగా ఉంది.

ఎఫెక్ట్‌‌ ఇంకా తగ్గలే..

ఈ విషయమై ఫాడా ప్రెసిడెంట్ వింకేశ్ గులాటి మాట్లాడుతూ, ‘‘కరోనా అనంతర ఎఫెక్ట్‌‌ ఇంకా తగ్గిపోలేదు. 2020లో వెహికల్స్‌‌కు డిమాండ్ లేక ఇబ్బందులు వచ్చాయి. 2021 లో పరిస్థితులు తలకిందులుగా మారింది. ప్యాసింజర్ వెహికల్స్‌‌కు మంచి డిమాండ్ ఉన్నప్పటికీ, సెమీకండక్టర్ల కొరత కారణంగా సప్లై  పెద్ద సమస్యగా మారింది. పండుగను దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు ప్రతి డీలర్ భారీ స్టాకు తీసుకోవడానికి రెడీగా ఉన్నాడు. సప్లై సమస్యల కారణంగా, ఈ ఆర్థిక సంవత్సరంలో ఇన్వెంటరీలు చాలా తగ్గాయి”అని వివరించారు. గత ఏడాది ఆగస్టుతో పోలిస్తే ఈ ఆగస్టులో టూవీలర్ అమ్మకాలు దాదాపు 7 శాతం పెరిగి 976,051 యూనిట్లకి చేరాయి.   ఈ ఆగస్టులో టూవీలర్  సగటు ఇన్వెంటరీ 20–-25 రోజులు. ‘‘కరోనా సంబంధిత సమస్యల కారణంగా కస్టమర్లు ఆర్థికంగా ఇబ్బందులుపడ్డారు.  డీలర్‌‌షిప్‌‌లకు దూరంగా ఉండటంతో తక్కువ అమ్మకాలు జరిగాయి. ఇది ఎంట్రీ లెవల్ సెగ్మెంట్‌‌పై ప్రభావం చూపుతుంది, అందుకే నష్టాలు వచ్చాయి "అని గులాటి తెలిపారు. కమర్షియల్ వెహికల్స్ (సీవీల) అమ్మకాల గ్రోత్ మిగతా సెగ్మెంట్ల కంటే మెరుగ్గా ఉంది. గత ఏడాది ఇదే నెలతో పోలిస్తే ఆగస్టులో సీవీల అమ్మకాలు దాదాపు రెండింతలు పెరిగి 53,150 యూనిట్లకు చేరుకున్నాయి.  మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, రహదారి భవనం, హౌసింగ్,  మైనింగ్ ప్రాజెక్టులు పెరగడంతో మీడియం, హెవీ కమర్షియల్ వెహికల్స్ కోసం ఆర్డర్లు ఎక్కువయ్యాయని ఫాడా తెలిపింది. ఇదిలా ఉంటే ఆగస్టులో హోల్‌‌సేల్‌‌ అమ్మకాలు (టోకు) గత ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో పెరిగాయి.  మారుతి సుజుకీ అమ్మకాలు 2020 ఆగస్టుతో పోలిస్తే 2021 ఆగస్టులో 5 శాతం పెరిగి 1,30,699 యూనిట్లుగా రికార్డయ్యాయి.  గత ఏడాది ఇదే నెలలో కంపెనీ 1,24,624 యూనిట్లను అమ్మింది టాటా మోటార్స్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 53 శాతం పెరిగి 54,190 యూనిట్లకు చేరాయి.  2020 ఆగస్టు లో కంపెనీ 35,420 యూనిట్లను అమ్మింది. హ్యుందాయ్  2020 ఆగస్టుతో పోలిస్తే ఈ ఏడాది ఆగస్టులో అమ్మకాలను రెండు శాతం పెంచుకుంది.  సేల్స్‌‌ 45, 809 యూనిట్ల నుంచి 46, 866 యూనిట్లకు పెరిగాయి.