Pawan Vs Vijay : రూల్ అందరికీ ఒకటే.. విజయ్ 'జన నాయకన్' వివాదంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్!

Pawan Vs Vijay : రూల్ అందరికీ ఒకటే.. విజయ్ 'జన నాయకన్' వివాదంపై పవన్ కళ్యాణ్ రియాక్షన్!

కోలీవుడ్ స్టార్ హీరో, టీవీకే అధినేత దళపతి విజయ్ లేటెస్ట్ గా నటించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్  'జన నాయకన్' (Jana Nayagan). పూర్తిస్థాయి రాజకీయల్లోకి అడుపెట్టిన వేళ ఆయన చివరి మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమా సెన్సార్ సర్టిఫికేట్ విషయంలో గత కొద్ది నెలలుగా పెద్ద డ్రామా నడుస్తోంది. దీనిపై లేటెస్ట్ గా జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్  స్పందించారు. ఈ వివాదానికి రాజకీయ రంగు పూయడం ఏమాత్రం సరికాదంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పడు హాట్ టాపిక్ గా మారాయి.

రాజకీయ జోక్యం లేదు.. 

'జన నాయకన్' సెన్సార్ ఆలస్యానికి కేంద్రంలోని ఎన్డీయే (NDA) ప్రభుత్వమే కారణమని కొందరు చేస్తున్న ఆరోపణలను పవన్ కళ్యాణ్ కొట్టిపారేశారు.సెన్సార్ బోర్డ్ అనేది ఒక స్వతంత్ర సంస్థ. నియమ నిబంధనల ప్రకారమే అక్కడ నిర్ణయాలు జరుగుతాయి. ఇందులో రాజకీయ పార్టీలను లాగడం, ప్రభుత్వాన్ని నిందించడం కరెక్ట్ కాదన్నారు. ఈ సమస్య సెన్సార్ బోర్డ్ స్థాయిలో సరిగ్గా డీల్ చేయలేదని అని పేర్కొన్నారు.

'OG'ని ఉదాహరణగా చూపుతూ..

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ తనసినిమా 'OG' గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. నేను అధికారంలో ఉన్నా సరే, నా సినిమాకు మినహాయింపులు ఉండవు. 'OG'లో హింస ఎక్కువగా ఉన్నందున దానికి 'A' సర్టిఫికేట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. నా టీమ్ మెంబర్స్ కొందరు దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసినా, నేను మాత్రం బోర్డ్ నిర్ణయాన్ని సమర్థించానని చెప్పారు. ఒక రూల్ ఉందంటే అది అందరికీ సమానంగా వర్తించాలి. అది అధికార పార్టీలో ఉన్న వారికైనా, లేని వారికైనా ఒక్కటే అని పవన్ స్పష్టం చేశారు. గతంలో తన సినిమాల్లోని పాటల లిరిక్స్ మార్చమని కోరినప్పుడు కూడా తాను సైలెంట్‌గా మార్చానని, అది ప్రొసీజర్ అని గుర్తు చేశారు.

'జన నాయకన్' ఎందుకు ఆగింది? 

హెచ్. వినోద్ దర్శకత్వంలో తెరకెక్కించిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ 'జన నాయకన్' వాస్తవానికి జనవరి 9, 2026న విడుదల కావాల్సింది. కానీ సెన్సార్ బోర్డ్ అభ్యంతరాల వల్ల వాయిదా పడింది. తొలుత డిసెంబర్ 2025లో చూసిన ఎగ్జామినింగ్ కమిటీ కొన్ని కట్స్ సూచించింది. అనంతరం ఆర్మీకి సంబంధించిన సీన్లు, కొన్ని మతపరమైన మనోభావాలను దెబ్బతీసే అంశాలు ఉన్నాయని కంప్లైంట్స్ రావడంతో ఈ సినిమాను రివైజింగ్ కమిటీకి పంపారు. మేకర్స్ కోర్టును ఆశ్రయించడం వల్ల ప్రక్రియ మరింత ఆలస్యమైంది. చివరకు కేసును విత్ డ్రా చేసుకుని మళ్ళీ రివైజింగ్ కమిటీ ముందుకు వెళ్లారు.

రూ. 120 కోట్ల ఓటీటీ డీల్ రద్దు?

విడుదల ఆలస్యం అవుతుండటంతో ఈ సినిమా వ్యాపారంపై దెబ్బ పడింది. ఒక ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ కుదుర్చుకున్న రూ. 120 కోట్ల డీల్ క్యాన్సిల్ అయినట్లు సమాచారం.  అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ భారీ చిత్రంలో మమితా బైజు, బాబీ డియోల్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్, ప్రియమణి, పూజా హెగ్డే వంటి స్టార్స్ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం, ఏప్రిల్ 23న జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల తర్వాతే ఈ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల హీట్ నేపథ్యంలో 'జన నాయకన్' వివాదం ఇరు రాష్ట్రాల్లో హాట్ టాపిక్‌గా మారింది.