Pakistan Cricket: టీ20 వరల్డ్ కప్ 2026లో పేలవమైన ప్రదర్శన చేసిన పాకిస్తాన్ జట్టుపై ఆ దేశ క్రికెట్ బోర్డు (PCB) కఠిన చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. సూపర్– 8 దశలోనే టోర్నమెంట్ నుంచి నిష్క్రమించిన పాక్ జట్టుకు చెందిన ప్రతి ఆటగాడికి 50 లక్షల జరిమానా విధించినట్లు తెలుస్తుంది. గ్రూప్ దశలో భారత్ చేతిలో ఓటమి పాలైన పాకిస్తాన్, సూపర్ 8లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. మంచి ప్రదర్శన చేస్తే బహుమతులు ఇస్తాం, ఫలితాలు దారుణంగా ఉంటే చర్యలు కూడా తప్పవని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) అధికారులు వెల్లడించినట్లు తెలుస్తుంది.
నఖ్వీ తీవ్ర అసంతృప్తి:
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ జట్టు ప్రదర్శనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సెలెక్టర్లు, జట్టు మేనేజ్‌మెంట్ నుంచి ఈసారి మంచి ఫలితాలు వస్తాయని హామీ ఇచ్చినప్పటికీ, అది సాధ్యపడలేదని సమాచారం.
కొందరి కెరీర్ ముగింపు?:
ఈ టోర్నమెంట్ అనంతరం బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది, కెప్టెన్ సల్మాన్ అలీ ఆఘా, ఉస్మాన్ ఖాన్ తదితరులకు అంతర్జాతీయ టీ20 కెరీర్‌కు ముగింపు పలకాల్సిన సమయం వచ్చిందని పీసీబీ వర్గాలు చెబుతున్నాయి. కాగా గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడు గెలిచిన పాకిస్తాన్ జట్టు సూపర్ 8కు చేరుకుంది. కానీ సూపర్ 8లో తొలి మ్యాచ్ వర్షంతో రద్దు అయింది. ఇంగ్లండ్ చేతిలో ఓటమి చవిచూసింది.. దీంతో సెమీఫైనల్ ఆశలు నిలుపుకోవాలంటే శ్రీలంకను 147 పరుగులకే కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉండగా, 213 పరుగులు చేసినప్పటికీ ఆ లక్ష్యాన్ని కాపాడుకోలేకపోయింది. చివరకు కేవలం 5 పరుగుల తేడాతో గెలిచినా సెమీస్ నుంచి ఔట్ అయింది.
మంచు వల్లే ఓడిపోయాం:
ఈ మ్యాచ్‌లో సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ సాధించగా, ఫఖర్ జమాన్ 84 పరుగులతో అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంక తరఫున కెప్టెన్ దాసున్ షనక 31 బంతుల్లో అజేయంగా 76 పరుగులు చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. చివరి ఓవర్‌లో షాహీన్ ఆఫ్రిది బౌలింగ్ లో 22 పరుగులు సాధించి పాక్ ఆశలపై నీళ్లు చల్లాడు. ఈ మ్యాచ్ తర్వాత పాకిస్తాన్ కెప్టెన్ సల్మాన్ ఆఘా మాట్లాడుతూ.. మేము ఆశించిన విధంగా టోర్నీని ముగించలేకపోయాం.. చివరి రెండు ఓవర్లలో 10, -15 పరుగులు చేసుంటే పరిస్థితి మారిపోయేదేమో.. డ్యూ కారణంగా 213 పరుగులు కూడా కాపాడుకోవడం చాలా కష్టమైందని వ్యాఖ్యానించాడు.
