డ్రోన్ ఎటాక్ దెబ్బ.. స్టాక్​ మార్కెట్​లో పెట్రో మంటలు

డ్రోన్ ఎటాక్ దెబ్బ.. స్టాక్​ మార్కెట్​లో పెట్రో మంటలు

అసలకే మాంద్యం ఎఫెక్ట్‌, ట్రేడ్‌ వార్ టెన్షన్లతో దేశాలన్నీ తలపట్టుకుంటుం టే… మరోవైపు నుంచి క్రూడాయిల్ సెగ స్టార్ట్‌ అయింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఆయిల్ ప్రాసెసింగ్ ఫెసిలిటీలైన  రెండు క్రూడ్‌ స్థావరాలపై ఇటీవల డ్రోన్ అటాక్ జరిగింది. ఈ రెండూ సౌదీ అరేబియాకు చెందిన సౌదీ ఆరామ్‌కోకు చెందినవే.  ఇంకేముంది.. దీంతో క్రూడ్ ధరలకు రెక్కలొచ్చేశాయి. క్రూడ్‌ మంటకు స్టాక్ మార్కెట్లు ఢమాలన్నాయి. అటు వాల్‌స్ట్రీట్‌ మొదలుకొని.. ఇటు ఇండియన్ మార్కెట్ల వరకు ప్రపంచంలో స్టాక్ మార్కెట్లన్నీ డ్రోన్ అటాక్ దెబ్బకు అతలాకుతల మవుతున్నాయి. మన దేశ మార్కెట్లు తీవ్ర​అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.  

వెలుగు, బిజినెస్‌‌డెస్క్ : క్రూడాయిల్ దెబ్బకు దలాల్ స్ట్రీట్‌‌ మంగళవారం కూడా  ‘బేర్‌‌’ మనింది. సౌదీ అరేబియాలోని రెండు ఆయిల్ ఉత్పత్తి స్థావరాలపై డ్రోన్ అటాక్‌‌లు జరగడంతో, క్రూడాయిల్ ధరలు ఒక్కసారిగా పైకి జంప్ చేశాయి. క్రూడాయిల్‌‌ ధరల పెరుగుదల భయాందోళనలతో బీఎస్‌‌ఈ సెన్సెక్స్‌‌ 642.22 పాయింట్ల మేర పతనమైంది. ఒకానొక దశలో 704 పాయింట్ల మేర పడిన సెన్సెక్స్ చివరికి 36,481.09 వద్ద కనిష్ట స్థాయిలను తాకింది. నిఫ్టీ కూడా 185.9 పాయింట్లు  నష్టపోయి 10,817.60 వద్ద స్థిరపడింది. 30 ప్యాక్ సెన్సెక్స్‌‌లో కేవలం మూడు కంపెనీల షేర్లు మాత్రమే లాభాల్లో ముగిశాయి. మిగిలిన 27 కంపెనీల షేర్లు నష్టాల్లోనే క్లోజయ్యాయి. దీనిలో హీరో మోటోకార్ప్‌‌ షేర్లు భారీగా పడిపోయాయి. హీరోతోపాటు టాటా స్టీల్, టాటా మోటార్స్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి షేర్లు కూడా 7 శాతం వరకు నష్టపోయాయి.  బీఎస్‌‌ఈ ఆటో ఇండెక్స్‌‌ 3.80 శాతం పడిపోయింది.  రియాల్టీ, మెటల్,బ్యాంకెక్స్ ఇండెక్స్‌‌లు కూడా కుదుపులకు లోనయ్యాయి. సోమవారం బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్‌‌ రికార్డు స్థాయిలో పెరగడంతో, మార్కెట్ సెంటిమెంట్ బాగా దెబ్బతింది. డ్రోన్ అటాక్‌‌లతో ఆయిల్ సరఫరాలో అనిశ్చితి నెలకొంది. ఆయిల్ ధరలు పెరగడం ఇండియాలో ఇప్పటికే అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక వ్యవస్థకు మరింత చేటని ఆర్థిక వేత్తలంటున్నారు. మన దేశ ఆయిల్ అవసరాల్లో 80 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడినట్టు పేర్కొన్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌‌లో సోమవారం 20 శాతం పెరిగి బ్యారల్‌‌కు 71.95 డాలర్లు చేరుకున్న బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్.. మంగళవారం కాస్త తగ్గి  67.97 డాలర్లకు చేరుకున్నాయి. ఆయిల్ ధరలు ఇటు ఇండియన్‌‌ రూపాయికి కూడా భారీగా దెబ్బకొడుతున్నాయి. ఇంట్రాడేలో అమెరికా డాలర్‌‌‌‌తో పోలిస్తే.. రూపాయి విలువ ఇంట్రాడేలో 37 పైసలు బలహీనపడి 71.97 వద్ద ట్రేడైంది. మరోవైపు చైనా, అమెరికాల మధ్య ట్రేడ్‌‌ చర్చలు, ఫెడరల్ రిజర్వ్ పాలసీ మీటింగ్‌‌లు కూడా మార్కెట్లపై ప్రభావితం చూపిస్తున్నాయి.

 వాల్‌‌స్ట్రీట్‌‌ను తాకిన క్రూడ్‌‌ సెగ…

దలాల్‌‌ స్ట్రీట్‌‌తో పాటు అటు వాల్‌‌స్ట్రీట్‌‌ను కూడా క్రూడాయిల్ సెగ తాకింది. ఎనిమిది రోజుల పాటు బ్రేక్ లేకుండా పెరిగిన డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్… సోమవారం నష్టాలు పాలైంది. అమెరికాలోని మేజర్ స్టాక్‌‌ సూచీలన్నీ రికార్డు గరిష్టాల నుంచి కిందకు పడ్డాయి. డౌజోన్స్ 0.5 శాతం వరకు పడిపోయి 27,076.82 వద్ద, ఎస్‌‌ అండ్ పీ ఇండెక్స్ 0.3 శాతం నష్టపోయి 2,997.96 వద్ద క్లోజయ్యాయి. నాస్‌‌డాక్ కూడా 0.5 శాతం పడి 8,139.64 వద్ద స్థిరపడింది. ఆయిల్ ధరలు మరింత పెరుగుతాయని ఇన్వెస్టర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఓ వైపు మార్కెట్లు క్రూడ్‌‌ ధరలకు భయపడిపోతూ ఉంటే.. మరోవైపు అదే మార్కెట్లలో ట్రేడయ్యే క్రూడ్ కంపెనీల షేర్లు లాభాలను పండిస్తున్నాయి. ఎక్సోన్ మొబిల్ కార్పొరేషన్ షేర్లు 2.6 శాతం, షెవ్రాన్ షేర్లు 2.7 శాతం వరకు పెరిగాయి. వాల్‌‌స్ట్రీట్‌‌కు కీలకమైన వడ్డీ రేట్ల కోతపై ఫెడరల్ రిజర్వ్ నిర్ణయం కూడా వెలువడనుంది. ఇది కూడా వాల్‌‌స్ట్రీట్‌‌ మార్కెట్లపై ప్రభావం చూపనుందని విశ్లేషకులంటున్నారు.

నెల రోజులు పడుతుంది…

డ్రోన్ అటాక్‌‌లు జరగడంతో సౌదీ అరేబియాలోని ఆయిల్‌‌ ఉత్పత్తి సంస్థల్లో, సగం ప్రొడక్షన్ ఆగిపోయింది. దీని నుంచి కోలుకుని, మళ్లీ పూర్తిస్థాయిలో ఉత్పత్తి మొదలుపెట్టడానికి నెల పడుతుందని ఎస్‌‌ అండ్ పీ ప్లాట్స్ చెప్పింది.   ఇందుకోసం తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలిపింది. గ్లోబల్ ప్రొడక్షన్‌‌లో ఆరు శాతం లేదా రోజుకు 5.7 మిలియన్ బ్యారల్స్‌‌ క్రూడ్ ఉత్పత్తి డ్రోన్ అటాక్ జరిగిన అబ్‌‌క్వాయిఖ్​,  ఖురైస్​ఆయిల్‌‌ఫీల్డ్స్‌‌ నుంచే జరుగుతోంది. అక్కడి నుంచి రోజుకు 3 మిలియన్ బ్యారల్స్‌‌ క్రూడ్ ఉత్పత్తి చేపట్టాలంటే ఇంకా నెల రోజులు సమయం పడుతుందని ఎస్‌‌ అండ్ పీ అంచనావేసింది. రియాద్‌‌ రోజుకు 7.0 మిలియన్ టన్నుల బ్యారల్స్‌‌ను ఆసియన్ మార్కెట్లకు పంపుతుందని సౌదీ చెప్పింది.

పెట్రోల్, డీజిల్ షాక్…

పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ వాహనదారులకి షాకివ్వడం ప్రారంభించాయి. జూలై 5న బడ్జెట్‌‌ ప్రవేశపెట్టినప్పటి నుంచి మన దేశంలో ఈ మేర ధరలు పెరగడం ఇదే తొలిసారి. గ్లోబల్‌‌గా క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో, దేశీయంగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ఆ భారాన్ని  వాహనదారులపై మోపుతున్నాయి. దేశ రాజధానిలో పెట్రోల్ ధరలు లీటరుకు 14 పైసలు పెరిగి రూ.72.17 వద్ద, డీజిల్ ధరలు 15 పైసలు పెరిగి 65.58 వద్ద నమోదైనట్టు ప్రభుత్వ రంగ ఆయిల్ సంస్థల డేటాలో వెల్లడైంది. జూలై 5 తర్వాత ఇదే బిగ్గెస్ట్ సింగిల్ డే జంప్‌‌. బడ్జెట్‌‌ ప్రవేశపెట్టినప్పుడు ఫ్యూయల్‌‌పై ఎక్సైజ్ డ్యూటీ పెంచడంతో లీటరుకు రెండున్నర రూపాయలు పెరిగింది. ఇంటర్నేషనల్‌‌గా ఆయిల్ ధరలు 20 శాతం పెరగడం.. గత 30 ఏళ్లలో ఇదే మొట్టమొదటిసారి. సౌదీ అరేబియాలోని ఆయిల్ ఉత్పత్తి స్థావరాలపై దాడులే ఆయిల్ ధరలు పెరగడానికి ప్రధాన కారకాలు. ఇరాక్‌‌ తర్వాత ఇండియాకు ఆయిల్ సరఫరా చేసే రెండో అతిపెద్ద దేశం సౌదీ అరేబియానే. ఇది 2018–19 ఆర్థిక సంవత్సరంలో 40.33 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌‌ను ఇండియాకు సరఫరా చేసింది. డ్రోన్ అటాక్స్ తర్వాత, సౌదీ నుంచి వచ్చే సప్లయిలలో రోజుకు 50 లక్షల బ్యారల్స్‌‌ను కోల్పోతామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్పారు. ఆసియాలో చైనా, దక్షిణ కొరియా, జపాన్, ఇండియాలు సౌదీ ఆయిల్‌‌ కొంటున్న ప్రధాన దేశాలు.