మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన సోదరుడు వెంకట్ రామిరెడ్డి కోర్టులో లొంగిపోయారు. గురువారం ( డిసెంబర్ 11 ) మాచర్లలోని జూనియర్ అడిషనల్ సివిల్ జడ్జి కోర్టులో లొంగిపోయారు ఇద్దరు నేతలు. పల్నాడు జిల్లా వెల్దుర్తిలో జరిగిన జంట హత్యల కేసులో నిందితులుగా ఉన్న పిన్నెల్లి బ్రదర్స్ సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇవాళ మాచర్ల కోర్టులో లొంగిపోయారు. ఈ కేసులో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి A6గా, పినెల్లి వెంకట్ రామిరెడ్డి A7గా ఉన్నారు.
ఈ కేసుకి సంబంధించి పిన్నెల్లి బ్రదర్స్ దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించింది ఏపీ హైకోర్టు. అనంతరం నవంబర్ 28న సుప్రీంకోర్టును ఆశ్రయించారు పిన్నెల్లి బ్రదర్స్. ఈ క్రమంలో వీరి ముందస్తు బెయిల్ రద్దు చేసిన సుప్రీంకోర్టు.. రెండు వారాల్లోగా కోర్టులో లొంగిపోవాలని ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు విధించిన గడువు ముగియడంతో ఇవాళ కోర్టులో లొంగిపోయారు పిన్నెల్లి బ్రదర్స్.
ఈ క్రమంలో గురజాల సబ్ డివిజన్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 144 సెక్షన్ విధించారు పోలీసులు. అలాగే యాక్ట్ 30ని కూడా విధించిన పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా పలువురు వైసీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేశారు.
