UN హెచ్చరిక.. భూమికి మరింత మంట

UN హెచ్చరిక.. భూమికి మరింత మంట

వస్తే వరదలు. లేకుంటే కరువు. విపరీతమైన వేడి. లేకుంటే ఎముకలు కొరికే చలి. వాతావరణం ఎప్పుడు, ఎట్లుంటదో తెలియని పరిస్థితుల్లోకి వచ్చేసినం  మనం. దీనంతటికీ క్లైమేట్ చేంజ్ సమస్యే ప్రధాన కారణం కాగా, ఆ క్లైమేట్ చేంజ్ కు మాత్రం మనమే కారణమవుతున్నం! బొగ్గు, ఆయిల్, గ్యాస్ వంటి శిలాజ ఇంధనాల తవ్వకాలను తగ్గించాల్సింది పోయి.. ఏటా పెంచుకుంటూ పోతున్నం. అందుకే.. వాతావరణంలోకి కార్బన్​ డయాక్సైడ్​ పెద్ద మొత్తంలో చేరుతూ మన భూగోళానికి మంట పెంచుతున్నది. ఇప్పటికైనా శిలాజ ఇంధనాల తవ్వకాలను తగ్గించకపోతే.. ఇక క్లైమేట్ చేంజ్ సమస్యను ఆపడం కష్టమేనని ఐక్యరాజ్యసమితి ‘ప్రొడక్షన్ గ్యాప్ రిపోర్ట్ 2019’లో హెచ్చరించింది.

పారిస్ అగ్రిమెంట్​కు పాతర

మూడేండ్ల కిందట ఉత్తరాఖండ్​ను ముంచెత్తిన వరదలు గుర్తున్నాయా? ఆ రాష్ట్రంలో అంతకుముందెన్నడూ చూడనంత భారీ స్థాయిలో కుండపోత వర్షాలు కురిసి అతలాకుతలం చేసేసినయి. క్లైమేట్ చేంజ్ ఎఫెక్ట్ ఎట్లా ఉంటదంటే వాతావరణ నిపుణులు ఇప్పటికీ ఆ విపత్తును ఒక ఉదాహరణగా చెబుతుంటరు. అట్లనే కాలిఫోర్నియాలో 2017కు ముందు ఐదేంట్లపాటు ఘోరమైన కరువు ఏర్పడింది. దానికీ వాతావరణ మార్పులే కారణమని తేల్చారు. ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే కార్బన్​ డయాక్సైడ్​ ఉద్గారాలను తగ్గించడం ఒక్కటే పరిష్కారం. అందుకే.. యావరేజ్ గ్లోబల్ టెంపరేచర్లను ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ నాటికంటే 2 డిగ్రీలకు మించి పెరగకుండా ఆపాలని ఐక్యరాజ్యసమితి డిసైడ్ చేసింది. దీనికి సంబంధించిన పారిస్ అగ్రిమెంట్​ను తెరమీదికి తెచ్చింది. ఈ ఒప్పందంపై మూడేండ్ల కింద 195 దేశాలు సంతకాలు కూడా చేసినయి. కానీ.. ఒకవైపు క్లైమేట్ చేంజ్​ను ఆపేందుకని సంతకం చేసిన దేశాలే.. మరోవైపు విచ్చలవిడిగా శిలాజ ఇంధనాలను తవ్వేస్తున్నాయి. ఇప్పుడు ఇండియాతో కలిపి ఆయా దేశాలు వేసుకున్న ప్లాన్ల ప్రకారం చూస్తే.. 2030 నాటికి బొగ్గు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి ఏకంగా 50% పెరుగుతుందని తాజా యూఎన్ రిపోర్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.

వాటి వల్లే 90% కార్బన్​ డయాక్సైడ్​

ఈ ఏడాది వాతావరణంలోకి విడుదలైన కార్బన్​ డయాక్సైడ్​లో 90% బొగ్గు, ఆయిల్, గ్యాస్ వాడకం వల్లే ఉత్పత్తి అయిందట. ఇప్పటికీ ప్రపంచమంతటా వాడుతున్న ఇంధనాల్లో ఈ మూడు కలిపి 80% ఉన్నాయట. 2030 నాటికి బొగ్గు తవ్వకం 17%, ఆయిల్ ఉత్పత్తి 10%, నేచురల్ గ్యాస్ ఉత్పత్తి 5% పెరుగుతాయని అంచనా. చైనా, అమెరికా, రష్యా, ఇండియా, ఆస్ట్రేలియా, ఇండొనేసియా, కెనడా, జర్మనీ, నార్వే, బ్రిటన్లు  ఎక్కువగా బొగ్గు, ఆయిల్, గ్యాస్ ఉత్పత్తి చేస్తున్నాయని, కార్బన్​ డయాక్సైడ్​ విడుదలకు  ఎక్కువ కారణమవుతున్నాయని రిపోర్ట్ పేర్కొంది. ప్రపంచ టెంపరేచర్లను 1.5 డిగ్రీలకు తగ్గించాలంటే శిలాజ ఇంధనాలను తగ్గించడం ఒక్కటే మార్గమని, కానీ ఆయా దేశాల ప్లాన్లు చూస్తుంటే.. మరో పదేళ్లలో ఈ లిమిట్ కంటే120% ఎక్కువ బొగ్గు, ఆయిల్, గ్యాస్ ను తవ్వేసే అవకాశాలు ఉన్నాయని రిపోర్ట్ తెలిపింది.

ఈ దేశాలను చూసి నేర్చుకోవాలె 

గ్లోబల్ వార్మిం గ్ తగ్గించడంలో ఫ్రాన్స్, డెన్మా ర్క్, కోస్టారికా, స్పెయిన్, న్యూజీలాం డ్ దేశాలు మంచి చర్యలుతీసుకుంటున్నా యని యూఎన్ రిపోర్ట్ మెచ్చుకుంది.ఈ దేశాలు ఆల్రెడీ శిలాజ ఇంధనాల తవ్వకాలు,వాడకం, ఎగుమతులు, దిగుమతులు కూడా తగ్గించేశాయని, అన్ని దేశాలూ వీటిని ఫాలో కావాలని సూచించింది. ఇకనైనా బొగ్గు, ఆయిల్, గ్యా స్ ఉత్పత్తి,వాడకం తగ్గించకపోతే వాతావరణ మార్పు లను ఎదుర్కోవడం సాధ్యం కాదని, భవిష్యత్తు తరాలు తీవ్ర కష్టాలపాలు కావడం ఖాయమని రిపోర్ట్ హెచ్చరించింది.