- భారత్, మలేసియా మధ్య సంబంధం ఎంతో ప్రత్యేకం
- శాంతి, స్థిరత్వం కోసం కట్టుబడి ఉన్నామని వెల్లడి
- మలేసియా ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో విస్తృత చర్చలు
- 11 కీలక ఒప్పందాలపై ఇరుదేశాల సంతకాలు
- రక్షణ, టెక్నాలజీ రంగాల్లో కీలక అగ్రిమెంట్స్
కౌలాలంపూర్: భారత్, మలేసియాల మధ్య సంబంధం అత్యంత ప్రత్యేకమైనదని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ఉగ్రవాదంపై పోరాటంలో తమ వైఖరి స్పష్టమని ఉద్ఘాటించారు. ‘‘ఉగ్రవాదంపై మా సందేశం చాలా స్పష్టం. ఇందులో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలు ఉండవు.. రాజీ పడే ప్రసక్తే లేదు” అని పేర్కొన్నారు. రెండు రోజుల మలేసియా పర్యటనలో భాగంగా ఆదివారం పుత్రజయలో ఆ దేశ ప్రధాని అన్వర్ ఇబ్రహీంతో ప్రధాని మోదీ విస్తృతస్థాయి చర్చలు జరిపారు. 2024లో ఇరు దేశాల మధ్య ఏర్పడిన ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ మరింత బలోపేతం చేస్తూ.. రక్షణ, సెమీకండక్టర్లు, డిజిటల్ ఆర్థిక వ్యవస్థలాంటి కీలక రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించాలని నిర్ణయించారు. రక్షణ, టెక్నాలజీ సహా పలు రంగాల్లో 11 కీలక ఒప్పందాలపై ఇరుదేశాలు సంతకాలు చేశాయి. వాణిజ్య లావాదేవీలను భారత రూపాయి, మలేసియా రింగిట్లలో జరిపే విధానాన్ని ఇరు ప్రధానులు అభినందించారు. 2025లో ఇరుదేశాల మధ్య వాణిజ్యం 18.59 బిలియన్ డాలర్లకు చేరగా.. దీనిని మరింత పెంచేందుకు ఉన్న అవకాశాలపై చర్చించారు. అలాగే యూఎన్ భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మలేసియా సంపూర్ణ మద్దతు ప్రకటించింది.
వ్యూహాత్మక విశ్వాసంతో ఆర్థిక పరివర్తన: మోదీ
భేటీ అనంతరం మోదీ మీడియాతో మాట్లాడారు. భారత్-–మలేసియా బంధం కేవలం వాణిజ్యానికే పరిమితం కాదని, ఇది శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధమని మోదీ పేర్కొన్నారు. ‘‘మేం సముద్ర తీర పొరుగు దేశాలం. వ్యూహాత్మక విశ్వాసం ద్వారా ఆర్థిక పరివర్తనకు బాటలు వేస్తాం’’ అని ప్రకటించారు. ఇండో–-పసిఫిక్ ప్రాంతం ప్రపంచ వృద్ధికి ఇంజిన్‌గా ఎదుగుతున్నదని, ఏసియాన్ దేశాల కేంద్ర బిందువుగా ఈ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇరు దేశాల మధ్య రక్షణ, భద్రత, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ రంగాల్లో సహకారాన్ని పెంచుకోవాలని నిర్ణయించినట్లు మోదీ తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఫ్రేమ్‌వర్క్ ఒప్పందంతో పాటు మొత్తం 11 ద్వైపాక్షిక ఒప్పందాలు కుదిరాయని వెల్లడించారు. స్థానిక కరెన్సీలైన రూపాయి–-రింగిట్లలో వాణిజ్య లావాదేవీలు జరపడం గొప్ప పరిణామమని తెలిపారు. భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు తెలపడంపై కృతజ్ఞతలు తెలిపారు.
మలేసియాలో భారత కాన్సులేట్
మలేసియాలోని ప్రవాస భారతీయ సమాజం కోసం ప్రధాని మోదీ కీలక ప్రకటనలు చేశారు. అక్కడ కొత్తగా భారత కాన్సులేట్ జనరల్‌ను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. అలాగే, యూనివర్సిటీ మలయాలో తిరువళ్లువర్ కేంద్రం ఏర్పాటును, విద్యార్థుల కోసం తిరువళ్లువర్ స్కాలర్షిప్లను ప్రకటించారు. భారత సంతతి మంత్రులు, ఎంపీలు, సెనేటర్లతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. డిజిటల్ శాఖ మంత్రి తువాన్ గోవింద్ సింగ్ డియో, మానవ వనరుల శాఖ మంత్రి రమణన్ రామకృష్ణన్, ఉప మంత్రులు ఎం. కులశేఖరన్, ఆర్.యునేశ్వరన్ తదితరులు మోదీని కలిశారు. మలేసియా అభివృద్ధిలో, ఇరు దేశాల మధ్య ‘సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని’ బలోపేతం చేయడంలో వారి పాత్రను ప్రధాని మోదీ కొనియాడారు. అలాగే, మలేసియాలోని అగ్రగామి కంపెనీలైన పెట్రోనాస్, ఖజానా నాసియోనల్లాంటి సంస్థల సీఈవోలతో సమావేశమయ్యారు. భారత వృద్ధిలో భాగస్వాములు కావాలని వారిని ఆహ్వానించారు. ఆజాద్ హింద్ ఫౌజ్‌లో నేతాజీతో పనిచేసిన జయరాజ్ రాజారావును మోదీ కలుసుకున్నారు. రెండు రోజుల పర్యటన ముగించుకొని ప్రధాని మోదీ ఆదివారం సాయంత్రం తిరుగుపయనం అయ్యారు.
