ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్

ప్రారంభోత్సవానికి సిద్ధమవుతున్న కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్

పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్ ప్రారంభోత్సవానికి సిద్ధమవుతోంది. వచ్చే నెలలో దీనిని ప్రారంభించేందుకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లో నిర్మితమౌతున్న ఈ భవనాన్ని శనివారం హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్‌ పరిశీలించారు. నిర్మాణం జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను ఆగస్టులో ప్రారంభించనున్నట్లు సమాచారం. సీఎం చేతుల మీదుగా మెయిన్‌ కమాండ్‌ కంట్రోల్‌ను ప్రారంభించే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి అధికారులు సన్నాహాలు మొదలుపెట్టారు.

హెలిప్యాడ్ తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో

ఈమేరకు పనులు పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ అధికారులకు సీవీ ఆనంద్ సూచించారు. అంతకుముందు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా అణువణువు నిఘా పెట్టనున్నారు. ఎక్కడేం జరిగినా క్షణాల్లో పసిగట్టే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అంతర్జాతీయ ప్రమాణాలతో ముస్తాబవుతోంది. ఏ మూలన ఏం జరిగినా క్షణాల్లో కనిపెట్టే అవకాశం ఉందని సమాచారం. ఏ, బీ, సీ, డీ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ టవర్లను ఏర్పాటు చేశారు. టవర్ ఏ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 84.2 మీటర్ల ఎత్తు ఉంది. టవర్ బీ, సీ, డీలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 65.2 మీటర్ల ఎత్తులో ఉన్నాయి. ఆఫీసు బిల్డింగ్ టవర్ ఏ ప్రధానమైందిగా తెలుస్తోంది. హెలిప్యాడ్ తో కలిపి జీ ప్లస్ 20 అంతస్తుల్లో టవర్ ‘ఏ’ నిర్మించారు.