ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్​పర్సన్ల మధ్య ‘పవర్’ పంచాయితీ

ఎమ్మెల్యేలు, జడ్పీ చైర్​పర్సన్ల మధ్య ‘పవర్’ పంచాయితీ
  • నియోజకవర్గాల్లో తామే సుప్రీం అంటున్న ఎమ్మెల్యేలు
  • అఫీషియల్ ప్రోగ్రామ్​లకు జడ్పీ చైర్​పర్సన్లను పిలవట్లే
  • పర్మిషన్ లేకుండా అడుగుపెట్టొద్దని కొందరు ఎమ్మెల్యేల ఆర్డర్స్
  • ప్రొటోకాల్ ప్రకారం పెద్దపీట వేయాల్సి వస్తుందని దూరం
  • ఫండ్స్ రాక, విలువ లేక జడ్పీ చైర్​పర్సన్ల ఆవేదన

వెలుగు, నెట్వర్స్: పేరుకు డిప్యూటీ మినిస్టర్​ హోదా కానీ ఏ ప్రోగ్రామ్​కు పిలవడం లేదని.. కనీసం ప్రొటోకాల్ ప్రకారం సమాచారం కూడా ఇవ్వట్లేదని జడ్పీ చైర్ పర్సన్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నరు. ప్రారంభోత్సవాలు, ప్రమాణస్వీకారాలు, రివ్యూ మీటింగ్​లే కాదు ఆఖరుకు జాతరలు, ఉత్సవాలు, టోర్నమెంట్లకు కూడా ఇన్​వైట్ చేయడం లేదని వాపోతున్నారు. తమ పర్మిషన్ లేకుండా నియోజకవర్గాల్లో అడుగు పెట్టొద్దని కొందరు ఎమ్మెల్యేలు ఏకంగా జడ్పీ చైర్ పర్సన్లకు ఆర్డర్లు వేస్తున్నారు. దీంతో అటు ఫండ్స్ రాక, ఇటు కనీస విలువ లేక లోలోన కుమిలిపోతున్న జడ్పీ చైర్​పర్సన్లు ఇప్పుడిప్పుడే బయటపడుతున్నరు.. ఆవేదన వెళ్లగక్కుతున్నరు.

జడ్పీ చైర్​పర్సన్స్​కు ఎన్నో పవర్స్

రాజ్యాంగం ప్రకారం జడ్పీ చైర్​ పర్సన్​కు చాలా అధికారాలు ఉన్నాయి. జిల్లాలో డిప్యూటీ మినిస్టర్ హోదా ఉండే జడ్పీ చైర్​పర్సన్​కు ప్రభుత్వ ప్రొటోకాల్ ప్రకారం ఎమ్మెల్యే కంటే ఎక్కువ హోదా ఉంటుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జిల్లాకు ఇచ్చే ఫండ్స్​ను మండల పరిషత్‌ల వారీగా పంపిణీ చేయడం, జిల్లా డెవలప్​మెంట్ ప్లాన్స్ తయారుచేయడం, ప్రభుత్వ ప్రాజెక్టులు, స్కీమ్​ల అమలును పర్యవేక్షించడం, జిల్లాలో మండల పరిషత్‌లు, గ్రామ పంచాయతీల్లో జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన రిపోర్టులను తయారుచేసి ప్రభుత్వాలకు రిపోర్ట్ చేయడం.. లాంటి అధికారాలు జడ్పీ చైర్​పర్సన్ల కు ఉంటాయి. స్కూళ్లు, పీహెచ్​సీలు, ఏరియా, జిల్లా హాస్పిటళ్లను, సర్కార్ ఆఫీసులను తనిఖీ చేసి నిర్లక్ష్యంగా ఉండే స్టాఫ్​పై చర్యలు తీసుకునే పవర్ కూడా జడ్పీ చైర్​పర్సన్స్​కు ఉంది.జిల్లాల్లో ప్రభుత్వం చేపట్టే వివిధ అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలకు జడ్పీ చైర్​పర్సన్​ను ప్రొటోకాల్ ప్రకారం మస్ట్​గా ఆహ్వానించాలి. మొత్తంగా మంత్రి లేనప్పుడు ఆ తర్వాతి స్థానం జడ్పీ చైర్​పర్సన్స్​దే.

నియోజకవర్గాల్లో అడుగుపెట్టనివ్వట్లే..

టీఆర్​ఎస్​ రెండోసారి అధికారంలోకి వచ్చాక నియోజకవర్గాల్లో  ఎమ్మెల్యేలకు ఫుల్​ పవర్స్ ఇచ్చారు. జిల్లా మంత్రులను సైతం వాళ్ల సొంత నియోజకవర్గాలకే పరిమితం చేశారు. దీంతో మెజారిటీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో తామే సుప్రీం అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అఫీషియల్ ప్రోగ్రామ్స్, మీటింగులకు కూడా జడ్పీ చైర్మన్లను పిలవడం లేదు. పార్టీ పరంగా ప్రస్తుత జడ్పీ చైర్మన్లను భవిష్యత్​లో తమకు పోటీగా భావించడం, ప్రోగ్రామ్​కు జడ్పీచైర్మన్లను పిలిస్తే ప్రొటోకాల్​ ప్రకారం తమ ప్రయారిటీ తగ్గిపోతుందనే కారణాలతో ఎమ్మెల్యేలు వారిని దూరం పెడుతున్నరు. కొందరు ఎమ్మెల్యేలైతే తమకు తెలియకుండా తమ నియోజకవర్గాల్లో అడుగు కూడా పెట్టవద్దని జడ్పీ చైర్మన్లకు చెప్తున్నరు.

ఏ జిల్లాలో చూసినా ఇదే పరిస్థితి..

  • వరంగల్ అర్బన్ జడ్పీ చైర్మన్ డాక్టర్ సుధీర్ హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్ బాబు అనుచరుడు కావడంతో ఆ ఒక్క నియోజకవర్గంలో తప్ప ఎక్కడా కనిపించట్లేదు. అర్బన్ పరిధిలోని మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, ఆరూరి రమేశ్.. సుధీర్​ను ఏ కార్యక్రమానికీ పిలవట్లేదు. రూరల్ జడ్పీ చైర్మన్ గండ్ర జ్యోతిని ఎవరైనా మినిస్టర్ వస్తే తప్ప అర్బన్ జిల్లాలోని ఎమ్మెల్యేలు ఆహ్వానించట్లేదు.
  • భూపాలపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎవరినీ అడుగుపెట్టనివ్వడంలేదు. ఇక్కడ ఏ కార్యక్రమానికీ జడ్పీ చైర్​పర్సన్ శ్రీహర్షిణి ని పిలవట్లేదు. జిల్లా హెడ్ క్వార్టర్ లో జరిగే కార్యక్రమాలకు సైతం పిలుపు లేకపోవడంపై శ్రీహర్షిణి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.
  • మెదక్ జడ్పీ చైర్ పర్సన్ ర్యాకల హేమలతకు మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి ప్రయారిటీ ఇవ్వట్లేదనే ఆరోపణలున్నాయి. ఈ రెండు సెగ్మెంట్లలో జరిగే ఏ  ప్రారంభోత్సవాలకు, శంకుస్థాపనలకు హేమలతను ఇన్వైట్‌ చేయడంలేదు.
  • ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ జనార్దన్ రాథోడ్  ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న శిష్యుడే. దీంతో ఇక్కడ రామన్న హవానే నడుస్తోంది.
  • మహబూబ్​నగర్​ జిల్లాలోనూ జడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్ రెడ్డిని ఎమ్మెల్యేలు తమ ప్రోగ్రామ్స్​కు పిలవడంలేదు. మహబూబ్​నగర్​, జడ్చర్ల, దేవరకద్రల్లో ఏ కార్యక్రమంలోనూ కనిపించడంలేదు. రిపబ్లిక్ డే వేడుకల్లో పరాభావాన్ని ఎదుర్కొన్న జడ్పీ చైర్మన్.. అక్కడ నుంచి అలిగి వెళ్లిపోయారు.
  • గద్వాల నియోజకవర్గంలో ఏ ప్రోగ్రామ్ కి జడ్పీ చైర్మన్​ను పిలవడం లేదు. అలంపూర్ ఎమ్మెల్యే, జడ్పీ చైర్మన్ మధ్య సఖ్యత లేదు. మానవపాడు మండలం లో సెగ్రిగేషన్ షెడ్లను వారు వేర్వేరుగా ప్రారంభించారు.
  • వనపర్తి జిల్లా పరిషత్ చైర్మన్ లోక్ నాథ్ రెడ్డిని జిల్లా ఎమ్మెల్యేలు పట్టించుకోవడంలేదు. పర్మిషన్ లేకుండా తమ సెగ్మెంట్లలో తిరగొద్దని ఎమ్మెల్యేలు అడ్డుకుంటున్నట్టు జడ్పీ చైర్మన్ అంటున్నారు.
  • నిజామాబాద్ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్ రావ్ సొంత మండలమైన మాక్లూర్​ను ఆర్మూర్ రెవెన్యూ డివిజన్ లో విలీనం చేసేందుకు ఎమ్మెల్యే జీవన్​రెడ్డి ప్రయత్నించగా.. జడ్పీ చైర్మన్ అడ్డుకున్నారు. దాంతో వారి మధ్య గ్యాప్ ఏర్పడింది. వేరే నియోజకవర్గాల్లో మంత్రుల ప్రోగ్రామ్స్ ఉంటేనే జడ్పీ చైర్మన్​ను పిలుస్తున్నారు.
  • కరీంనగర్ జడ్పీ చైర్ పర్సన్ తన సొంత నియోజకవర్గం హుజూరాబాద్​లోనే ప్రోగ్రామ్స్​కు అటెండ్ అవుతున్నారు. చొప్పదండి, కరీంనగర్, మానకొండూర్​ నియోజకవర్గాల్లో జరిగే అఫీషియల్​ ప్రోగ్రామ్స్​కు ఆయనకు ఇన్విటేషన్​ ఉండడంలేదు.
  • రాజన్న సిరిసిల్ల జిల్లా జడ్పీ చైర్​పర్సన్ న్యాలకొండ అరుణను సిరిసిల్ల నియోజకవర్గంలో జరిగే చాలా కార్యక్రమాలకు ఆహ్వానించట్లేదు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్​బాబు జర్మనీలో ఉండడంతో ఆ ఒక్క నియోజకవర్గంలోనే ఆమె అప్పుడప్పుడూ కనిపిస్తున్నారు.
  • ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు తన సొంత నియోజకవర్గమైన మధిర ఏరియాలో జరిగే కార్యక్రమాల్లోనే పాల్గొంటున్నారు. మంత్రి అజయ్​ వెంట ఉంటే మాత్రమే ఇతర నియోజకవర్గాల్లో అడుగుపెడుతున్నారు.
  • అఫీషియల్ ప్రోగ్రామ్స్​కు సంబంధించి సిద్దిపేట నియోజకవర్గం నుంచి తప్ప తనకు మరే సమాచారం ఉండట్లేదని సిద్దిపేట జడ్పీ చైర్​పర్సన్ రోజాశర్మ​ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
  • నల్గొండ జిల్లా జడ్పీ చైర్మన్ బండా నరేందర్ రెడ్డికి మునుగోడు, మిర్యాలగూడ, నాగార్జునసాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు ఆహ్వానం ఉండడంలేదు. ప్రొటోకాల్ ప్రకారం ఆఫీసర్లు సమాచారం ఇస్తున్నా.. ఎమ్మెల్యేల నుంచి ఆహ్వానం అందడం లేదు.

కండ్లకు కనవడ్తలేనా.. ఇదేనా మర్యాద?

‘‘డిప్యూటీ మినిస్టర్​ హోదాలో ఉన్నా లెక్క చేయవా.. కండ్లకు కనవడ్తలేనా.. ఇదేనా  మర్యాద’’.. అంటూ నిర్మల్ జడ్పీ చైర్మన్ డి.విఠల్​రావు ఆర్మూరు ఎమ్మెల్యే జీవన్​రెడ్డిపై ఫైర్ అయ్యారు. సోమవారం సాయంత్రం మంత్రులు గంగుల కమలాకర్, వేముల ప్రశాంత్​రెడ్డి, ఎమ్మెల్సీ కవిత ఎదురుగానే ఆయన తన కోపాన్ని వెళ్లగక్కారు. ‘‘సొంత నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన నువ్వే నాకు విలువ ఇవ్వకుంటే ఎట్లా.. నిన్ను చూసి జిల్లాలోని మిగతా ఎమ్మెల్యేలు కూడా విలువ ఇవ్వడంలేదు” అన్నారు. నందిపేట్ మండలం సెజ్‌లో బయోప్లాస్టిక్ యూనిట్ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ ఘటన జరిగింది. ప్రోగ్రాం గురించి సమాచారం లేకపోవడంతో విఠల్​రావు ఆలస్యంగా అక్కడికి వచ్చారు. గేటు దగ్గర పోలీసులు కొంత సేపు ఆయన్ను ఆపారు. తీరా లోపలికి వెళ్లగా అప్పటికే కార్యక్రమం మొదలైంది. దీంతో విఠల్​రావ్ కోపంతో జీవన్​రెడ్డి మీద విరుచుకుపడ్డారు. పక్కనే ఉన్న ప్రశాంత్​రెడ్డి విఠల్​రావును సముదాయించారు.