రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలుండే ప్రాంతాలివే

రాష్ట్రపతి పర్యటన.. ట్రాఫిక్ ఆంక్షలుండే ప్రాంతాలివే

రాష్ర్టపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ లో పర్యటించనున్న వేళ జూన్​ 16, 17 తేదీల్లో  నగరంలోని పలు మార్గాల్లో అధికారులు ట్రాఫిక్​ ఆంక్షలు విధించారు.  సీటీవో జంక్షన్, పీఎన్​టీ ఫ్లైఓవర్,  హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఔట్‌తో సహా కొన్ని జంక్షన్లు, స్ట్రెచ్‌లలో శుక్రవారం సాయంత్రం 4 నుంచి రాత్రి 8 గంటల మధ్య, శనివారం ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య  ప్రయాణం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. గేట్, బేగంపేట్ ఫ్లైఓవర్, గ్రీన్ ల్యాండ్స్ జంక్షన్, మోనప్ప జంక్షన్, యశోద హాస్పిటల్ రోడ్, వీవీ విగ్రహం జంక్షన్, పంజాగుట్ట జంక్షన్ లో ఈ ప్రభావం పడనుంది.

సికింద్రాబాద్‌ నుంచి బేగంపేట, రాజ్‌భవన్‌ మీదుగా అమీర్‌పేట్‌, మెహదీపట్నం వైపు వెళ్లే బస్సులు అప్పర్‌ ట్యాంక్‌బండ్‌ మీదుగా వెళ్లాలని పోలీసులు ఆదేశించారు. మోనప్ప జంక్షన్, వీవీ విగ్రహం (ఖైరతాబాద్) నుంచి రాజ్ భవన్ రోడ్డుపైకి వాహనాలు అనుమతించరు.  పంజాగుట్ట- రాజ్ భవన్ క్వార్టర్స్ రోడ్ (మెట్రో రెసిడెన్సీ)లో కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుందన్నారు. సీటీఓ జంక్షన్, మినిస్టర్ రోడ్డు నుంచి వచ్చే వాహనాలు రసూల్‌పురా జంక్షన్‌లో కొద్దిసేపు ఆగాలి. అలాగే పంజాగుట్ట, గ్రీన్‌ల్యాండ్‌ జంక్షన్‌ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్టు వైపు జరిగే రాకపోకలు ప్రకాష్‌నగర్‌ టి జంక్షన్‌లో కొద్దిసేపు నిలిచిపోతాయి. కూకట్‌పల్లి, బాలానగర్‌ నుంచి ఫతేనగర్‌ వంతెన మీదుగా హైదరాబాద్‌ పబ్లిక్‌ స్కూల్‌, బేగంపేట రోడ్డు వైపు వెళ్లే వాహనాలను బల్కంపేట్‌ ఎల్లమ్మ ఆలయం వద్ద సత్యం థియేటర్‌ మీదుగా మైత్రివనం జంక్షన్‌ వైపు మళ్లిస్తారు. ట్రాఫిక్​ ఆంక్షలు ఉన్నందున ప్రజలు సహకరించాలని పోలీసులు కోరుతున్నారు.