ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..నిందితుల లిస్ట్​లో ఆప్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు..నిందితుల లిస్ట్​లో ఆప్
  • కింగ్​పిన్​గా సీఎం అర్వింద్ కేజ్రీవాల్
  •     చార్జ్​షీట్ దాఖలు చేసిన ఈడీ అధికారులు
  •     ఓ కేసులో పార్టీ పేరు చేర్చడం ఇదే ఫస్ట్​ టైమ్

న్యూఢిల్లీ :  లిక్కర్ స్కామ్ కేసులో మనీలాండరింగ్​కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్​పై ఈడీ అధికారులు చార్జ్​షీట్ దాఖలు చేశారు. ఆమ్ ఆద్మీ పార్టీని కూడా ఈ కేసులో నిందితుడిగా చేర్చారు. ఓ కేసులో పార్టీని నిందితుడిగా చేర్చడం ఇదే ఫస్ట్ టైమ్. నిందితులందరిపై మనీలాండరింగ్ యాక్ట్ నిబంధనల ప్రకారం అభియోగాలు మోపినట్టు స్పెషల్ కోర్టులో ఈడీ స్పష్టం చేసింది. లిక్కర్ స్కామ్ కేసులో కేజ్రీవాల్​ను కింగ్​పిన్, కీలక కుట్రదారుగా చార్జ్​షీట్​లో పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటిదాకా మొత్తం 8 చార్జ్​షీట్​లు ఈడీ దాఖలు చేసింది. కాగా, మార్చి 21న కేజ్రీవాల్​ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయగా.. ప్రస్తుతం ఆయన మధ్యంతర బెయిల్​పై బయట ఉన్నారు. ఈ కేసులో మొత్తం 18 మందిని ఈడీ అరెస్ట్ చేసింది. ఢిల్లీ గవర్నమెంట్​లోని మంత్రులు, ఆప్ నేతలు, ఇతర వ్యక్తులు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కేజ్రీవాల్ సెవెన్ స్టార్ హోటల్​లో స్టే చేసినట్టు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని, ఈ కేసులోని నిందితులే ఆయన బిల్లులో కొంతవరకు చెల్లించినట్టు సుప్రీం కోర్టుకు అడిషనల్ సొలిసిటర్ జనరల్ ఎస్​వీ రాజు సుప్రీం కోర్టుకు ఇప్పటికే వివరించారు. ఆమ్ ఆద్మీ పార్టీకి కేజ్రీవాల్ నేషనల్ కన్వీనర్​గా ఉన్నారని తెలిపారు. 

సుప్రీం పిటిషన్​పై తీర్పు రిజర్వ్

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తనను అరెస్ట్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్ సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్​పై శుక్రవారం విచారణ జరిగింది. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తాతో కూడిన ధర్మాసనం ఈ కేసులో అటు కేజ్రీవాల్, ఇటు ఈడీ అధికారుల వాదనలు విన్నది. ఈమేరకు తీర్పును ధర్మాసనం రిజర్వ్ చేసింది. పిటిషనర్ చట్టానికి అనుగుణంగా బెయిల్ కోసం ట్రయల్ కోర్టుకు వెళ్లొచ్చని సూచించింది. కేజ్రీవాల్ తరఫున సీనియర్ అడ్వకేట్​ అభిషేక్ సింఘ్వి, ఈడీ తరఫున సొలిసిటర్ జనరల్ ఎస్​వీ రాజు ధర్మాసనం ముందు వాదనలు వినిపించారు.