
న్యూఢిల్లీ, వెలుగు : ఢిల్లీ లిక్కర్‌స్కాం కేసులో అరెస్టయి తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో శుక్రవారం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ములాఖత్ అయ్యారు. అనంతరం తెలంగాణ భవన్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. ఏ రాష్ట్రమైనా, దేశమైనా ఆదాయం పెంచుకోవడానికి రకరకాల పాలసీలు చేస్తుంటాయని.. ఈ క్రమంలోనే ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీని తీసుకొచ్చిందని అన్నారు. ఇది పాలసీయే తప్ప స్కాం కాదని పేర్కొన్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే కవితను ఇందులో ఇరికించారని ఆయన ఆరోపించారు. అడ్వకేట్‌కు నోటీసులు కూడా ఇవ్వకుండానే జైల్లో ఉన్న కవితను సీబీఐ అరెస్టు చేసిందంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చని ఆయన అన్నారు.
బీజేపీ ప్రభుత్వం కోర్టులను కూడా భయపెడుతున్నదని ఆరోపించారు. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో పీఎంఎల్ ఏ చట్టం వర్తించదని ప్రవీణ్ కుమార్ అన్నారు. టెర్రరిస్టులకు ఆర్థిక వనరులు చేర్చడం, డ్రగ్స్ రవాణాకు నిధుల వినియోగం, దేశ ఆర్థిక వ్యవస్థకు విఘాతం కలించే చర్యలకు మాత్రమే వర్తిస్తుందన్నారు. ఈ కేసులో ఎక్కడా డబ్బు దొరకలేదని, అలాంటప్పుడు పీఎంఎల్ఏ ఎలా వర్తిస్తుందని ఆయన ప్రశ్నించారు. లంచం డిమాండ్ చేసినట్లు కూడా లేనప్పుడు అవినీతి నిరోధక చట్టం ఎలా వర్తింపజేశారో దర్యాప్తు సంస్థలు సమాధానం చెప్పాలన్నారు. ఆయనతో పాటు బాల్క సుమన్ కూడా ఉన్నారు.