= అభివృద్ధి అస్త్రంతో బరిలో నిలిచిన కాంగ్రెస్
= సెంటిమెంట్ పై ఆధారపడ్డ బీఆర్ఎస్
= సైలెంట్ ఓటుపై కమలనాథుల నజర్
= ప్రచారానికి మాజీ సీఎం కేసీఆర్ దూరం
= కనిపించని బీజేపీ స్టార్ క్యాంపెయినర్లు
హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారం మరో 24 గంటల్లో ముగియనుంది. ఈ స్థానం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. నవంబర్ 11న ఇక్కడ పోలింగ్ జరగనుంది. రేపటితో (నవంబర్ 09) ప్రచార పర్వం పరిసమాప్తం కానుంది. ఇక్కడ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు పోటీపడుతున్నాయి. ముక్కోణపు పోటీలో ఓటరు మహాశయుడు ఎవరికి పట్టం కడతారనేది ఆసక్తికరంగా మారింది. ఈ స్థానంలో గెలుపు, ఓటములపై రకరకాల ఊహాగానాలున్నాయి.
సెఫాలజిస్టులు తిష్టవేసి రకరకాల సర్వే నివేదికలు ఇచ్చారు. ఒకరు బీఆర్ఎస్ గెలుస్తుందంటే.. మరొకరు కాంగ్రెస్ గెలుస్తుందనే నివేదికలు ఇచ్చారు. ఇవన్నీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి ఎజెండాగా ముందుకు సాగుతోంది. ఆ పార్టీ నుంచి నవీన్ యాదవ్ బరిలో నిలిచారు. నవీన్ యాదవ్ స్థానికుడు కావడంతోపాటు గతంలో ఎంఐఎం తరఫున పోటీ చేసిన అనుభవం కూడా ఉంది. దీనికి తోడు అధికార పార్టీ కూడా కావడం మరో విశేషం. బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సతీమణి సునీత పోటీలో ఉన్నారు. గోపీనాథ్ మృతి చెందడంతో సెంటిమెంట్ కలిసొస్తుందని కారు పార్టీ భావిస్తోంది.
గోపీనాథ్ వరుసగా మూడు సార్లు అక్కడి నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు. దీంతో అక్కడి ప్రజలతో ఆ కుటుంబానికి సంబంధాలున్నాయి. ఇదిలా ఉండగా బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. ఆయన సైలెంట్ ఓటు ను నమ్ముకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, పార్టీ స్టేట్ చీఫ్ రాంచందర్ రావు చెబుతున్నారు. దీపక్ రెడ్డి గతంలో ఇక్కడ పోటీ చేసి 25 వేల పైచిలుకు ఓట్లు పొందారు. ఈ ముగ్గురిలో విజేత ఎవరన్నది ఈ నెల 11న ఓటరు నిర్ణయించనున్నాడు.
కానరాని కేసీఆర్
స్టార్ క్యాంపెయినర్లుగా పేర్కొన్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ఈ ఎన్నికల్ ప్రచారంలో పాల్గొనలేదు. అదే విధంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేరును బీజేపీ పేర్కొన్నప్పటికీ ఇక్కడికి వచ్చి ఆమె ప్రచారం చేయలేదు. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్ లాల్ శర్మ, తేజస్వీ సూర్య, అన్నామలై, పురంధేశ్వరి తదితరులు ఎవరూ జూబ్లీహిల్స్ కు వచ్చి ప్రచారం చేయలేదు.
పోలింగ్ శాతం పెరిగేనా?
జూబ్లీహిల్స్ ఓటర్లు 4,01,365 మందిగా తేలారు. అందులో 2,08,561 మం ది పురుషులు, 1,92,779 మంది మహిళలు, 25 మంది ఇతరులు ఉన్నారు. 139 పోలింగ్ స్టేషన్‌లలో 407 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఒక్కో పోలింగ్ కేంద్రంలో కనీసం 986 మంది ఓటర్లున్నారు. 1200 మంది ఓటర్లకు పైగా 11 పోలింగ్ కేంద్రాలుండగా అత్యల్పంగా 263 పోలింగ్ స్టేషన్‌లో 540 మంది ఓటర్లు.. అత్యధికంగా 9 వ నంబర్ పోలింగ్ స్టేషన్‌లో 1233 మంది ఓటర్లున్నారు. ఇక్కడ ప్రతి ఎన్నికల్లోనూ యాభై శాతానికి కొంచం అటు ఇటుగా పోలింగ్ నమోదవుతోంది. ఈ సారి పోలింగ్ శాతాన్ని పెంచేందుకు అటు రాజకీయ పార్టీలు, ఇటు అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఓటరు పోలింగ్ కేంద్రానికి వచ్చేలా చర్యలు తీసుకుంటున్నారు.
