గత కొన్నాళ్లుగా విజయాల కంటే వివాదాలతోనే ఎక్కువ వార్తల్లోకెక్కిన యువ హీరో రాజ్ తరుణ్.. సైలెంట్‌గా ఓ సినిమా చేసేసి ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకొచ్చాడు. అదే ‘చిరంజీవ’. అదిరే అభిగా పాపులర్ అయిన జబర్దస్త్ కమెడియన్ అభినయకృష్ణ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. కుషిత కల్లపు హీరోయిన్. రాహుల్ అవురెడ్డి, సుమాసిని రాహుల్ నిర్మించిన ఈ చిత్రం ‘ఆహా’ ఓటీటీ ద్వారా ఈరోజు (నవంబర్ 7)న జనం ముందుకొచ్చింది. ఈ సినిమా ఎలా ఉందో రివ్యూలో చూద్దాం..
కథగా..
జీవితంలో స్పీడు ఎక్కువైన శివ (రాజ్ తరుణ్) తన స్పీడుకు తగ్గట్టుగా అంబులెన్స్ డ్రైవర్‌గా వర్క్ చేస్తుంటాడు. మరోవైపు కుషిత కల్లపుతో ప్రేమలో పడతాడు. ఓ రోజు అంబులెన్స్ డ్రైవ్ చేస్తుంటే దున్నపోతు అడ్డొచ్చి యాక్సిడెంట్ అవుతుంది. హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిన అతనికి చుట్టు ఉన్న వాళ్లందరి తలలపై డిజిటల్ ఛార్జింగ్ మీటర్‌లా ఆయుష్షు మీటర్ కనిపిస్తుంటుంది. మొదట్లో అర్థం కాకపోయినా యాక్సిడెంట్ ద్వారా తనకు వచ్చిన సూపర్ పవర్ ఇదని గ్రహిస్తాడు. దీన్ని సరిగ్గా వాడుకుని డబ్బు సంపాదిస్తే లైఫ్‌లో సెటిల్ అవ్వొచ్చని భావిస్తాడు. దాన్నే ఫాలో అవుతాడు. అయితే అనుకోకుండా ఓ రోజు మార్కెట్‌లో చిన్న పిల్లల గుంపు కనిపిస్తుంది. వాళ్లంతా చనిపోబోతున్నారని అర్థమవుతుంది. వాళ్లను కాపాడటానికి అతను ఏం చేశాడు.. ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లు ఏమిటి అనేది మిగతా కథ.
ఎవరెలా నటించారంటే..
రాజ్ తరుణ్‌కు ఈ తరహా పాత్రల్లో కొత్తేమి కావు. శివ పాత్రలో ఒదిగిపోయాడు. తనదైన కామెడీ టైమింగ్‌తో హుషారుగా కనిపించాడు. కుషిత కల్లపు స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది. ఇమ్మాన్యుయేల్, సంజయ్ కృష్ణ, రాజా రవీంద్ర, కిరీటి, గడ్డం నవీన్ సహా ఇతర నటీనటులు పాత్ర పరిధి మేరకు ఆకట్టుకున్నారు. సినిమాటోగ్రఫీ, అచ్చు రాజమణి సంగీతం పర్వాలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ క్రిస్ప్‌గా ఉంది. నిడివి 1.50 నిమిషాలే ఉండటం ప్లస్ అయింది.
ఎలా ఉందంటే..
చావు అనేది ఎంతటి గొప్ప వాళ్లనైనా, ధైర్యవంతులనైనా భయపెట్టే విషయం. మన చావు గురించి తెలియడం ఒకరకమైన భయమైతే, మన చుట్టూ ఉన్న వాళ్ల ఆయుష్షు గురించి తెలియడం వరమో, శాపమో తెలియని అయోమయ పరిస్థితి. ఇలాంటి ఐడియాలు వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ఎవరైనా దీన్నొక ఇంటెన్స్ డ్రామాగా చేయాలనుకుంటారు.. కానీ అభి మాత్రం తన బలం కామెడీ కనుక కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కించాడు. ఎదుటి వ్యక్తి ఎప్పుడో చనిపోతాడో తెలిసిన హీరో, దాన్ని అడ్డుపెట్టుకుని ఎలా ఎదిగాడు.. ఆ ప్రయత్నంలో ఎలాంటి ఒత్తిడులకు లోనయ్యాడు అనేది ప్రధానాంశం. సెన్సిటివ్ స్టోరీ లైన్ తీసుకుని ఫన్నీ వేలో ప్రజెంట్ చేశాడు.
హీరోకి పవర్స్ వచ్చాయని తెలియడానికి మొదటి అరగంట సమయం తీసుకున్న దర్శకుడు.. ఆ తర్వాత ఏం జరగబోతోంది అనే ఉత్కంటను కొనసాగిస్తూ సరదాగా ఫస్ట్ హాఫ్ అంతా నడిపించాడు. ఆ తర్వాత పిల్లల ప్రాణాలు కాపాడటానికి ఏం చేశాడనేది ఆసక్తి రేపుతుంది. అయితే కామెడీని బాగానే హ్యండిల్ చేసిన దర్శకుడు ఎమోషనల్ సీన్స్‌లో తేలిపోయాడు. తను ఎంచుకున్న కాన్సెప్ట్ బాగున్నప్పటికీ దాన్ని తెరపై చూపించడంలో కొంత తడబడ్డాడు. కథతో పాటు కథనంపై కూడా దృష్టి పెడితే రిజల్ట్ ఇంకాస్త ఇంప్రెసివ్‌గా ఉండేది.
ఫైనల్‌గా..
కామెడీ జానరే కనుక పెద్దగా అంచనాలు లేకుండా సరదాగా టైమ్ పాస్ కోసం ఓ లుక్ వేయొచ్చు.
