రాయలసీమలోని ప్రొద్దుటూరు పట్టణంలో జరిగే దసరా ఉత్సవాల వైభవం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సంబరాలు ఎంత ఘనంగా, అంగరంగ వైభవంగా జరుగుతాయంటే, వీటిని చూడటానికి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాక, ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు తరలివస్తుంటారు. ఈ ప్రాంతానికి ఈ దసరా వేడుకలు ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయి. కొంతమంది సినీ విమర్శకులు ఈ ఉత్సవాలను భారతదేశంలో రెండవ మైసూరు దసరాగా కూడా అభివర్ణిస్తారు.
దసరా పండుగ వైభవాన్ని...
రాయలసీమ సంస్కృతి, ముఖ్యంగా ప్రొద్దుటూరు దసరా పండుగ వైభవాన్ని, ఆచారాలను దేశవ్యాప్తంగా ప్రేక్షకులకు పరిచయం చేయాలనే గొప్ప ఉద్దేశంతో దర్శకుడు మురళీ కృష్ణ తుమ్మ ఈ ప్రత్యేక డాక్యుమెంటరీని రూపొందించారు. 'బాల్కనీ ఒరిజినల్స్' బ్యానర్ మీద, బుశెట్టి జువెల్లర్స్ సమర్పణలో నిర్మాత ప్రేమ్ కుమార్ వలపల ఈ ప్రతిష్టాత్మక డాక్యుమెంటరీని నిర్మించారు. ఈ కొత్త టీమ్ తమ మొదటి ప్రయత్నంలోనే కన్నుల పండువగా, అద్భుతమైన సాంకేతిక విలువలతో ఈ డాక్యుమెంటరీని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ప్రముఖ దర్శకుడు కరుణ కుమార్ వంటి సినీ ప్రముఖులు కూడా ఈ డాక్యుమెంటరీని ప్రత్యేకంగా వీక్షించి, ప్రొద్దుటూరు సాంస్కృతిక వారసత్వాన్ని ఈ డాక్యుమెంటరీ రుజువు చేసిందని అభినందించారు.
ఎక్కడ స్ట్రీమింగ్ అంటే?
గత అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలై మంచి ఆదరణ పొందిన ఈ డాక్యుమెంటరీ.. లేటెస్ట్ గా ఓటీటీ ప్రేక్షకులకు అందుబాటులోకి వచ్చింది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ అయిన ఈటీవీ విన్ లో ఈ డాక్యుమెంటరీ నవంబర్ 7 నుండి స్ట్రీమింగ్ అవుతోంది. సుమారు 40 నిమిషాల నిడివి ఉన్న ఈ డాక్యుమెంటరీ.. ప్రొద్దుటూరులో దసరా సందర్భంగా జరిగే అద్భుతమైన ఉత్సవాలు, తరతరాల ఆచారాలు, స్థానికుల భక్తి, మరియు సంస్కృతి-సాంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించింది. కేవలం హింసకు మాత్రమే కాదు, ఇంతటి ఘనమైన సాంస్కృతిక వారసత్వానికి కూడా రాయలసీమ నిలయమని ఈ డాక్యుమెంటరీ నిరూపించిందని ప్రశంసలు దక్కించుకుంది.
ఈ డాక్యుమెంటరీకి స్టార్ సర్కిల్స్ డిజిటల్ ప్రమోషన్స్ అందించగా, కిలారి సుబ్బారావు పీఆర్‌ఓగా వ్యవహరించారు. 'బాల్కనీ ఒరిజినల్స్' బ్యానర్ నుంచి భవిష్యత్తులో మరిన్ని కథాంశాలతో కూడిన సినిమాలు, డాక్యుమెంటరీలు రానున్నాయని సమాచారం. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు, చరిత్రపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన డాక్యుమెంటరీ ఇది అని మేకర్స్ అంటున్నారు.
Rayalaseema’s pride and devotion shine bright! 🌸
— ETV Win (@etvwin) November 6, 2025
Proddatur Dussehra premieres Nov 7 🪔
📲 Only on @etvwin@etvwin #KrishnaMuraliThumma @PremKvalapala @Yashwanth_Nag #VenkateshChunduru @BalconyOrigina1 @AkiCreativeWork@chvenkatesh78 @APTDCofficial @Tourism_AP #IDEALDOTS… pic.twitter.com/O18qO83Bi5
