ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచిన భారత జట్టుకు ట్రోఫీతో విన్నింగ్ మెడల్ అందించిన సంగతి తెలిసిందే. స్క్వాడ్ లో 15 మందికి మెడల్ అందజేశారు. వరల్డ్ కప్ లీగ్ మ్యాచ్ లాడి గాయపడిన ప్రతీక రావల్ సెమీ ఫైనల్, ఫైనల్ మ్యాచ్ లకు దూరమైంది. సెమీ ఫైనల్ కు ముందు గాయంతో ఈ టీమిండియా ఓపెనర్ దూరం కావడంతో ఆమెను స్క్వాడ్ నుంచి తప్పించారు. ప్రతీక స్థానంలో షెఫాలీని స్క్వాడ్ లో చేర్చారు. ఐసీసీ రూల్స్ ప్రకారం వరల్డ్ కప్ మెడల్ గెలవాలంటే 15 మంది స్క్వాడ్ లో ఉండాలి. స్క్వాడ్ లో 15 మందికే విన్నింగ్ మెడల్స్ దక్కుతాయి. ఈ కారణంగా ప్రీతీక రావల్ కు విన్నింగ్ మెడల్ లభించలేదు.
ఇదిలా ఉంటే.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్ గెలిచి చరిత్ర సృష్టించిన టీమిండియాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. బుధవారం (నవంబర్ 05) రాత్రి అధికారిక నివాసంలో హర్మన్‌సేనకు ఆతిథ్యం ఇచ్చిన మోదీ.. ప్లేయర్లను సత్కరించి ఒక్కొక్కరితో ఆత్మీయంగా మాట్లాడారు. సుదీర్ఘ పోరాటం, కీలక ఓటముల తర్వాత జట్టు పుంజుకున్న తీరు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఈ మీటింగ్ లో ప్రతీక రావల్ విన్నింగ్ మెడల్ ధరించింది. వరల్డ్ కప్ ట్రోఫీ గెలుచుకున్న తర్వాత రూల్స్ లో భాగంగా స్క్వాడ్ లో లేని ఈ టీమిండియా ఓపెనర్ కు మెడల్ ఇవ్వలేదు. కానీ ప్రతీక మాత్రం విన్నింగ్స్ మెడల్ ధరించడం చూసి ఆశ్చర్యపోయారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆ తర్వాత అధ్యక్షురాలు ద్రౌపది ముర్ముతో జట్టు సమావేశంలో విజేత పతకాన్ని ధరించి కనిపించింది. దీంతో ప్రతీకను మెడల్ ఎలా వచ్చిందనే డౌట్ అందరికీ వచ్చింది. అయితే ప్రతీక రావల్ తండ్రి ఈ విషయంలో క్లారిటీ ఇచ్చాడు. ఐసీసీ చైర్మన్ జై షా ప్రతీకకు విజేత పతకాన్ని అందజేసినట్లు వెల్లడించారు. రావల్ తండ్రి మాట్లాడుతూ "జై షా మాకు వ్యక్తిగతంగా మెసేజ్ చేశాడు. ఆయన ఐసీసీతో మాట్లాడి మాకు పతకం అందజేశారు. ప్రధాని మోడీని కలవడానికి ముందే ప్రతీక పతకాన్ని అందుకుంది. జై షా స్వయంగా చొరవ తీసుకుని ప్రతీకకు వ్యక్తిగతంగా ఈ సమాచారం అందించారు". అని ప్రదీప్ రావల్ చెప్పుకొచ్చారు.
ప్రధానితో ఫోటో దిగుతున్నప్పుడు అమన్ జ్యోత్ కౌర్ మెడలో మెడల్ లేదు. అదే సమయంలో మెడల్ రావల్ దగ్గర కనిపించడంతో ఆ మెడల్ కౌర్ ది అని భావించారు. అయితే రావల్ తండ్రి క్లారిటీ ఇవ్వడంతో ఆ మెడల్ ప్రతీకదే అని కన్ఫర్మ్ అయింది. ఈ టోర్నమెంట్ లీగ్ మ్యాచ్ లు ఆడిన ప్రతీక రావల్ నిలకడగా రాణించింది. 7 మ్యాచ్ లాడిన ఈ టీమిండియా ఓపెనర్ 51.33 యావరేజ్ తో 308 పరుగులు చేసింది. న్యూజిలాండ్ తో జరిగిన కీలక మ్యాచ్ లో సెంచరీ చేసి సత్తా చాటింది. మరోవైపు అమన్ జ్యోత్ కౌర్ ఆల్ రౌండ్ షో తో సత్తా చాటింది. బ్యాటింగ్, బౌలింగ్ లో రాణించి జట్టు విజయంలో తన వంతు పాత్రను సమర్ధవంతంగా పోషించింది.
