హైదరాబాద్: దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతిపై అనుమానాలున్నాయని, సమగ్ర విచారణ జరిపించాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఇవాళ ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ఆయన తల్లికి కొడుకు మృతదేహాన్ని చూపించకపోడం బాధాకరమన్నారు. 'నా కొడుకు మరణం ఒక మిస్టరీ.. అంటూ గోపీనాథ్ తల్లి చెబుతోందని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులు, ఆసుపత్రి యాజమాన్యం స్టేట్ మెంట్లను రికార్డు చేయాలన్నారు. తన తండ్రిని చూడటానికి రావొద్దంటూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి పువ్వాడ అజయ్ బెదిరించినట్లుగా గోపీనాథ్ కొడుకు ప్రద్యుమ్న ఆరోపించారని గుర్తు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గోపీనాథ్ అనుచరులెవరూ ప్రచారం కూడా చేయడం లేదని.. ప్రజలకు వాస్తవాలు అర్థం అయ్యాయని అన్నారు.
జూబ్లీహిల్స్ లో సర్వేల అంచనాలు తలకిందులవుతాయని, బీజేపీ తప్పక విజయం సాధిస్తుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రిపీట్ కాబోతున్నాయని అన్నారు. తెలంగాణలో అధికార, ప్రతిపక్ష పార్టీలు కలిసిపనిచేస్తున్నాయని అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే మజ్లిస్ పార్టీ గెలిచినట్లేనని చెప్పారు. సాయంత్రం ప్రచారంపర్మిషన్ ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు మాత్రమే అనుమతులు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీ సభ ఎక్కడ పెట్టుకోవాలో ఎన్నికల కమిషన్ చెబుతోందని అన్నారు. రెండు పార్టీలు రాజకీయ దూషణలతో అభివృద్ధి నుంచి ప్రజల దృష్టిని మరల్చుతున్నాయని అన్నారు. జూబ్లీహిల్స్ లో బీజేపీ కాంగ్రెస్ మధ్యే పోటీ అని అన్నారు. బీఆర్ఎస్ క్షేత్ర స్థాయిలో సైడైపోయిందని చెప్పారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాకిస్తాన్ ను ప్రోత్సహిస్తూ.. దేశ సైనికులను అవమాన పరిచారని ఆరోపించారు.
