ఎగుమతులకు హబ్గా కుప్పం.. త్వరలో రూ.6,339 కోట్ల పెట్టుబడులు: ఏపీ సీఎం చంద్రబాబు

ఎగుమతులకు హబ్గా కుప్పం.. త్వరలో రూ.6,339 కోట్ల పెట్టుబడులు: ఏపీ సీఎం చంద్రబాబు

ఎగుమతులకు హబ్ గా కుప్పంను తయారు చేస్తామని చెప్పారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. తమిళనాడు, కర్ణాటకలకు అనుసంధానంగా కుప్పం ఉందని.. ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని అన్నారు. త్వరలో కుప్పంలో 8 సంస్థలు రూ. 6 వేల 339 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. 2025 నవంబర్ 08 వ తేదీన కుప్పంలో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసిన అనంతరం మీడియాతో మాట్లాడారు  పరిశ్రమల స్థాపనకు పూర్తి సహకారం అందిస్తున్నామని ఈ సందర్భంగా తెలిపారు.

ఎస్ఐబీపీల ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన ఆమోదం తెలుపుతున్నట్లు చెప్పారు. స్పేస్ సిటీ, డ్రోన్ సిటీ, ఎరో స్పేస్ సిటీలను ఏర్పాటు చేయబోతున్నట్లు తెలిపారు. డ్వాక్రా వ్యవస్థను ప్రారంభించామని.. ఇప్పుడు ఆ వ్యవస్థ పెద్ద ఎత్తున ఆర్థిక కార్యాకలాపాలు నిర్వహించగలుగుతోందని తెలిపారు.  ఒకప్పుడు కుప్పం అత్యంత వెనుకబడిన ప్రాంతం అని.. ఇప్పుడు అభివృద్ధి చెందుతున్న ప్రాంతం అని అన్నారు.  హిందాల్కో, శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్, SVF సోయా, మదర్ డైరీ, E–Royce EV, ALEAP మహిళా పార్క్ లు కుప్పంలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. 

మొబైల్, ల్యాప్‌టాప్, టెక్ పరికరాల భాగాల తయారీలో ప్రసిద్ధి చెందిన హిందాల్కో సంస్థ .. కుప్పంలో రూ.586 కోట్లు పెట్టుబడి పెడుతోందన్నారు. ఆదిత్య బిర్లా సంస్థ స్కిల్ డెవలప్మెంట్ తో స్థానిక యువతకు మెరుగైన అవకాశాలు లభిస్తాయన్నారు.  శ్రీజా డైరీ, ఏస్ ఇంటర్నేషనల్,  గ్రీన్ ఫీల్డ్ డెయిరీ, మదర్ డైరీ , SVF సోయా వంటి సంస్థలతో మహిళలకు ఉపాధి, 2 లక్షల పాడి రైతులకు ప్రయోజనం కలిగుతుందని తెలిపారు. 

 E–Royce EV సంస్థ  అడ్వాన్స్డ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కేంద్రాన్ని రూ.200 కోట్లతో కుప్పంలో ఏర్పాటు చేస్తోందని తెలిపారు. ALEAP మహిళా పార్క్  నిర్మించే మహిళా శక్తి భవన్‌తో  4,000 మహిళలకు ఉపాధి, శిక్షణ లభిస్తుందని చెప్పారు. ఈ  కంపెనీల రాకతో ఈ ప్రాంతం ప్రజలకు ప్రత్యక్షంగా, పరోక్షంగా 22,330 మందికి ఉద్యోగాలు లభించనున్నట్లు చెప్పారు. అదే విధంగా  కుప్పం నియోజకవర్గాన్ని 100 శాతం సోలార్ పవర్ వినియోగించుకునే నియోజకవర్గంగా చేయాలనుకుంటున్నామని అన్నారు  సీఎం చంద్రబాబు. .