బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారుచేశారు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారుచేశారు: సీఎం చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు

కర్నూలు: ప్రసాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఐదేళ్లు ఆలయాల్లో కల్తీ నెయ్యితో ప్రసాదాలు పంచారని.. శ్రీశైలం ఆలయ ప్రసాదంలోనూ కల్తీ జరిగిందని చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో మరోసారి హాట్ టాపిక్గా మారాయి. బాత్‌రూమ్‌లు క్లీన్ చేసే కెమికల్స్‌తో తిరుమల లడ్డూ తయారుచేశారని.. తాను NDDB నివేదిక ఆధారంగానే మాట్లాడుతున్నానని ఏపీ సీఎం చెప్పుకొచ్చారు.

ALSO READ : టీటీడీ కొత్త ఈవోగా ముద్దాడ  రవిచంద్ర బాధ్యతలు స్వీకరణ

సీబీఐ, సిట్ క్లీన్‌ చిట్ ఇచ్చినట్లు వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, కల్తీ జరిగినట్లు సిట్ రిపోర్టులో ఉందని వైవీ సుబ్బారెడ్డే చెప్పారని సీఎం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు మరోసారి ఏపీలో కలకలం రేపాయి. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గం కలుగట్లలో ‘మీ భూమి- మీ హక్కు’ పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించిన సమయంలో సీఎం చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు.

తిరుమల లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వినియోగించి డబ్బులు దోచుకోవడంతో పాటు తిరుమల పవిత్రతను గత వైసీపీ పాలకులు దెబ్బతీశారని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో గురువారం కూడా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. లడ్డూలో రసాయనాలు కలిపారని తెలిపారు. రసాయనాలు కలిపినట్టు సీబీఐ చార్జ్‌షీట్‌లో ఉందని స్పష్టం చేశారు. గురువారం అమరావతిలో మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. వైసీపీ నేతలు చేసిన తప్పును ఒప్పుకోవడానికి బదులు.. క్లీన్‌చిట్ వచ్చిందంటూ దుష్ప్రచారం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తిరుమల లడ్డూ విషయంలో గత పాలకులు మహా పాపం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

‘‘తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా వ్యవహారం భక్తుల మనోభావాలకు సంబంధించినది. గత వైసీపీ సర్కార్ పాలనలో శ్రీవారి ప్రసాదం విషయంలో అపచారం చోటు చేసుకుంది. ఏడు కొండలవాడికి రెండు కొండలు చాలు అని నాటి పాలకులు అన్నారు. భక్తుల మనోభావాలతో ఆడుకున్నారు. తిరుమల లడ్డూలో కల్తీ జరుగుతోందని 2022లో సీఎఫ్‌టీఆర్ఐ చాలా స్పష్టంగా చెప్పినా పట్టించుకోకుండా యథేచ్ఛగా కొనసాగించారు. 2022లో వచ్చిన నివేదికను దాచిపెట్టారు. ఉద్దేశపూర్వకంగా అక్రమాలు చేయడానికే గత పాలకులు నాటి నివేదికను దాచేశారు. గతంలో పని చేసిన చైర్మన్ పీఏ రూ.4 కోట్లు లంచంగా తీసుకున్నారు”అని సీఎం వెల్లడించారు.

లడ్డూ కల్తీ వ్యవహారంలో చర్యలు తీసుకోవాలని ఇప్పటికే సీబీఐ నివేదిక ఇచ్చింది. ఈ విషయంలో తప్పుచేసిన వారిని వదిలే ప్రసక్తే లేదు. ఈ వ్యవహారంపై ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేస్తున్నం. ఈ కమిటీ ఎదుట అన్ని నివేదికలు ఉంచుతాం” అని ప్రకటించారు.