
- ఆర్‌అండ్‌ఆర్ సెంటర్ పూర్తి కాకపోవడంతో గ్రామాన్ని ఖాళీ చేయని ప్రజలు
- రిజర్వాయర్‌లోకి నీరు చేరుతుండడంతో ఆందోళన
గద్వాల, వెలుగు : రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు చిన్నోనిపల్లి నిర్వాసితులు భయం గుప్పిట్లో కాలం వెల్లదీస్తున్నారు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా గట్టు మండలంలో చిన్నోనిపల్లి రిజర్వాయర్‌ను నిర్మిస్తున్నారు. దీంతో ఆ గ్రామం ముంపునకు గురవుతుందని గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే రిజర్వాయర్ పనులు పూర్తికాకపోవడం, ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌లో సౌలత్‌లు లేకపోవడంతో ప్రజలు చిన్నోనిపల్లిలోనే ఉంటున్నారు.
ఇటీవల కురిసిన వర్షాలకు రిజర్వాయర్‌లోకి భారీ ఎత్తున నీరు వస్తుండడంతో గ్రామస్తులు ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత ఆఫీసర్లు స్పందించి రిజర్వాయర్‌లోకి వచ్చే నీటిని మరో వైపు మళ్లించాలని, లేదంటే నీటిని దిగువకైనా విడుదల చేయాలని కోరుతున్నారు. అలాగే తమకు పూర్తి స్థాయిలో పరిహారం అందజేసి, తాము ఆర్‌అండ్‌ఆర్ సెంటర్‌కు షిఫ్ట్ అయ్యాక రిజర్వాయర్ పనులు పూర్తి చేసుకోవాలని కోరుతున్నారు.