జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్.. కృష్ణానీళ్లు తాకట్టు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

జగన్ తో కుమ్మక్కైన కేసీఆర్.. కృష్ణానీళ్లు తాకట్టు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ పదేండ్ల పాటు అధికారంలో ఉండి, రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చి, ఇరిగేషన్ రంగాన్ని సర్వనాశనం చేశారని ఇరిగేషన్ మినిస్టర్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఆయనే ఇప్పుడు తమ ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటన్నారు. ప్రెస్ మీట్ లో కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్ధాలేనని కొట్టిపారేశారు. ఆదివారం సెక్రటేరియెట్​లో మీడియాతో ఉత్తమ్ మాట్లాడారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా, కొత్తగా ఒక్క ఎకరానికి కూడా నీళ్లివ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు తీరని ద్రోహం చేసింది కేసీఆరేనని ఉత్తమ్ ఆరోపించారు. ‘‘అప్పటి ఏపీ సీఎం జగన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కడుతుంటే.. ఆయనతో కుమ్మక్కై కళ్లు మూసుకుని కూర్చున్నవ్. అపెక్స్ కౌన్సిల్ మీటింగ్​ను వాయిదా వేయించి, ఏపీకి టెండర్లు పిలుచుకునే అవకాశం ఇచ్చింది నువ్వు కాదా? పోతిరెడ్డిపాడు నుంచి అక్రమంగా నీళ్లు తీసుకుపోతుంటే పదేండ్లు ఏం చేసినవ్? పైగా కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా 299 టీఎంసీలు, ఏపీ వాటా 512 టీఎంసీలు అని నువ్వే అపెక్స్ కౌన్సిల్ లో రాతపూర్వకంగా ఒప్పుకున్నవ్. 

ఇది తెలంగాణ రైతుల గొంతు కోయడం కాదా?’’ అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే రాయలసీమ లిఫ్ట్ పనులను అడ్డుకున్నామని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా సమర్థంగా ట్రిబ్యునల్​లో కొట్లాడుతున్నామన్నారు. క్యాచ్​మెంట్ ఏరియా ప్రకారం 500 టీఎంసీలకన్నా ఎక్కువగా తెలంగాణకు ఇవ్వాలని పోరాడుతున్నామని చెప్పారు. తెలంగాణలో దేశంలోనే అత్యధికంగా రికార్డ్ స్థాయిలో వరి ధాన్యం పండింది కాంగ్రెస్ హయాంలోనేనని  స్పష్టం చేశారు. అలాగే పాలమూరు, నల్గొండ జిల్లాలో అత్యధికంగా వరి పండిందన్నారు. పోలవరం–నల్లమలసాగర్ ప్రాజెక్ట్​పై కేంద్రం వద్ద, సుప్రీంకోర్టులో పోరాడుతున్నామని తెలిపారు. కృష్ణా, గోదావరి జలాల్లో రాష్ట్రానికి రావాల్సిన జలాలపై కమిట్​మెంట్​తో కొట్లాడుతున్నామని చెప్పారు.