జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చిద్దాం.. రండి..కేసీఆర్ కు రేవంత్ సవాల్

జనవరి 2 నుంచి  అసెంబ్లీలో చర్చిద్దాం.. రండి..కేసీఆర్ కు రేవంత్ సవాల్

తెలంగాణ రాష్ట్రాన్ని పదేండ్లలో కేసీఆర్ సర్వనాశనం చేశారని.. ఆయనొక ఆర్థిక ఉగ్రవాది అని సీఎం రేవంత్​రెడ్డి మండిపడ్డారు. ‘‘తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన పాలమూరు జిల్లాకే అన్యాయం చేసిన జలద్రోహి కేసీఆర్. రూ.8 లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని నడిబజారులో నిలబెట్టి దివాలా తీయించిండు.  భూకంపం వచ్చి వెళ్లాక మిగిలిన శిథిలాల మాదిరిగా రాష్ట్రాన్ని మార్చితే.. మేం ఇప్పుడు ఆ శిథిలాలను తొలగిస్తూ రాష్ట్రాన్ని దారిలో పెడుతున్నాం” అని ఆయన తెలిపారు.

పాలమూరు జిల్లా కేసీఆర్​కు రాజకీయ భిక్ష పెట్టిన ప్రాంతం. తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన గడ్డ. కానీ, ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ హయాంలోనే ఏపీ జలదోపిడీ ఎక్కువగా జరిగింది. 2004 నుంచి -2014 మధ్య, ఆ తర్వాత 2014 నుంచి -2024 వరకు కృష్ణా జలాలను ఏపీ ఎంత తరలించుకుపోయిందో లెక్కలు తీద్దాం రండి” అని కేసీఆర్​కు సీఎం రేవంత్​రెడ్డి సవాల్​ విసిరారు. ‘‘పదే పదే సంతకాలు పెట్టడం ఎందుకని, 2021-–22లో కేసీఆర్ శాశ్వతంగా సంత కం పెట్టి తెలంగాణ హక్కులను రాసిచ్చేశారు. కృష్ణాలో ఉన్న 811 టీఎంసీల్లో ఏపీకి 512 టీఎంసీలు, తెలంగాణకు 299 టీఎంసీలు చాలు అని సంతకం పెట్టి మన రాష్ట్రానికి మరణశాసనం రాసింది కేసీఆరే అని విమర్శించారు.

‘‘కేసీఆర్​ అసెంబ్లీకి వచ్చి చర్చించాలని కోరుకుంటున్నా. జనవరి 2 నుంచి అసెంబ్లీలో చర్చ చేద్దాం. ఒకరోజు కృష్ణా నది ప్రాజెక్టుల మీద, ఒకరోజు గోదావరి బేసిన్ మీద చర్చిద్దాం. సరి పోదంటే రెండేసి రోజులు అర్థవంతమైన చర్చలు చేద్దాం. ఉమ్మడి ఏపీలో ఏం జరిగింది? పదేండ్లలో ఏం చేశారు? రెండేండ్లలో మేం ఏం చేశామో చర్చిద్దాం. భవిష్యత్ ప్రణాళికలపై సూచనలు ఇవ్వండి. కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి మౌనముద్ర వీడాలి. రోడ్ల మీద కాదు చట్టసభల్లో ప్రజలకు చెబుదాం. అంతేగానీ.. అసెంబ్లీకి చెంచాలను పంపి మాట్లాడిస్తాం అంటే ఎట్లా? చెంచాలకేం తెలుసు? ఒకవేళ రానంటే.. జయలలిత, ఎన్టీఆ ర్ లెక్క అనుకుంటే అదే విషయం బయటకు ప్రకటించండి’’ అని సీఎం రేవంత్ తేల్చిచెప్పారు.