ఇల్లు కొంటున్నారా? ‘బేస్ ప్రైస్’ చూసి మోసపోకండి.. మీ బడ్జెట్ తలకిందులు చేసే సీక్రెట్ ఖర్చులివే..

ఇల్లు కొంటున్నారా? ‘బేస్ ప్రైస్’ చూసి మోసపోకండి.. మీ బడ్జెట్ తలకిందులు చేసే సీక్రెట్ ఖర్చులివే..

ఇల్లు కొనాలనేది సగటు మధ్యతరగతి మనిషి జీవితకాల కల. సొంతిల్లు అనేది ఒక భావోద్వేగమే కాదు.. ఒక వ్యక్తి జీవితంలో చేసే అతిపెద్ద ఆర్థిక నిర్ణయం కూడా. అయితే ఈ నిర్ణయం చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ఎందుకంటే చూపించే రేటుకు వాస్తవంగా ఖర్చు చేయాల్సిన మెుత్తానికి చాలా వ్యత్యాసం ఉండటం సగటు మధ్యతరగతి జీవితాలను కొన్నిసార్లు లెక్కల్లో పూర్తిగా తలకిందులు చేస్తుంటుంది. బెంగళూరుకు చెందిన సచితా మెహతా అనే మహిళా టెక్కీ అనుభవం ఇందుకు ఒక ఉదాహరణ. ఆమె రూ.90 లక్షల విలువైన ఫ్లాట్‌ను కొనుగోలు చేశారు. అయితే రిజిస్ట్రేషన్, స్టాంప్ డ్యూటీ, జీఎస్టీ, పార్కింగ్, క్లబ్ హౌస్ ఛార్జీలన్నీ కలిపి ఆమె చేతికి బిల్లు వచ్చేసరికి రూ.కోటి 10 లక్షలకు చేరింది. అంటే ఆమె వాస్తవ బడ్జెట్ కంటే రూ.20 లక్షల భారం పెరిగింది. 

జీఎస్టీ మాయాజాలం:
సాధారణంగా గృహ కొనుగోలుపై జీఎస్టీ రెండు రకాలుగా ఉంటుంది. అఫర్డబుల్ హౌసింగ్ కింద 1% జీఎస్టీ ఉంటే, ఇతర ప్రాజెక్టులకు 5% వసూలు చేస్తారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. బిల్డర్లు సిమెంట్, స్టీల్ వంటి ముడి సరుకులపై చెల్లించే ఇన్‌పుట్ టాక్స్ క్రెడిట్ ప్రయోజనం వారికి అందదు. ఫలితంగా ఆ ఖర్చును కూడా కొనుగోలుదారుల పైనే వేస్తారు. ప్రాజెక్ట్ ఆలస్యమయ్యే కొద్దీ బిల్డర్ల నిర్వహణ ఖర్చులు పెరిగి, ఆ భారం చివరకు వినియోగదారుడి జేబుకే చిల్లు పెడుతుంది.

స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్:
రాష్ట్రాల వారీగా స్టాంప్ డ్యూటీ మారుతూ ఉంటుంది. కొన్ని రాష్ట్రాలు మహిళలకు 1% రాయితీని ఇస్తుంటే (ఉదాహరణకు ఉత్తరప్రదేశ్), మరికొన్ని రాష్ట్రాల్లో భారీగా వసూలు చేస్తున్నాయి. కోవిడ్ సమయంలో డిమాండ్‌ను పెంచడానికి రాష్ట్రాలు ఈ ఫీజును తగ్గించాయి. కానీ ఇప్పుడు మళ్ళీ పెరిగాయి. మెట్రో నగరాల్లో ఇల్లు కొనాలనుకునే వారు ఈ రిజిస్ట్రేషన్ ఖర్చులను ముందుగానే లెక్కించుకోవాలి.

ప్రాపర్టీని కొనుగోలు చేయటంలో దాగిఉండే కొన్ని సీక్రెట్ హిడెన్ ఖర్చుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.. అవేంటంటే..

1. అప్రూవల్ ఫీజులు & డెవలప్‌మెంట్ ఛార్జీలు: ప్రభుత్వం నుంచి అనుమతులు పొందినందుకు అయ్యే ఖర్చు.
2. ఎమెనిటీ ఫీజులు: క్లబ్ హౌస్, జిమ్, స్విమ్మింగ్ పూల్, పార్కింగ్ స్లాట్ కోసం లక్షల్లో వసూలు చేస్తారు.
3. ప్రాజెక్ట్ డిలే: నిర్మాణం ఆలస్యమైతే వడ్డీ భారం పెరగడంతో పాటు ధరలు కూడా పెరుగుతాయి.

మరి భారాన్ని తగ్గించుకోవడమెలా?
అండర్ కన్‌స్ట్రక్షన్ ఇళ్లకు జీఎస్టీ ఉంటుంది, కానీ పూర్తిస్థాయిలో సిద్ధమైన ఇళ్లకు జీఎస్టీ ఉండదు. రెడీ టూ ఆక్యుపై ప్రాపర్టీలను ఎంపిక చేసుకోవటం వల్ల 1% నుండి 5% వరకు ఆదా చేయవచ్చు. అలాగే సేల్స్ పెంచుకునేందుకు బిల్డర్లు ఇచ్చే స్టాంప్ డ్యూటీ మాఫీ లేదా రిజిస్ట్రేషన్ ఫీజు రాయితీలను సద్వినియోగం చేసుకోవాలి. ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 24(బి), 80సి కింద వడ్డీ అసలు చెల్లింపులపై లభించే మినహాయింపులను వాడుకోవాలి. ఇక చివరిగా బిల్డర్ నుండి ఐటమైజ్డ్ కాస్ట్ షీట్ అడగండి. బ్యాంకులు ఏయే ఖర్చులకు రుణం ఇస్తాయో, వేటికి ఇవ్వవో ముందే తెలుసుకోండి.

ఇల్లు కొనేముందు కేవలం అడ్వర్టైజ్‌మెంట్ చూసి మురిసిపోకుండా.. అన్ని రకాల పన్నులు, అదనపు ఖర్చులను లెక్కగట్టుకుని బడ్జెట్ ప్లాన్ చేసుకుంటే మీ కలల నిలయం మీకు ఆర్థిక భారం కాకుండా ఉంటుంది.