V6 News

నో దోస్త్.. ఫీజులు మస్త్.. దోస్త్లో చేరకుండా పలు పెద్ద డిగ్రీ కాలేజీల దందా

నో దోస్త్.. ఫీజులు మస్త్.. దోస్త్లో చేరకుండా పలు పెద్ద డిగ్రీ కాలేజీల దందా
  •     అడ్డగోలుగా అడ్మిషన్లు.. ఇష్టారాజ్యంగా ఫీజులు   
  •     దోస్త్‌ లో రూ.24 వేలు ఉంటే.. రూ.లక్ష దాకా వసూలు 
  •     అన్ని కాలేజీలను తోవకు తెచ్చేందుకు అధికారుల కసరత్తు 

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియలో కొన్ని ప్రైవేట్  కాలేజీల ఇష్టారాజ్యం నడుస్తోంది. సర్కారు నిబంధనలను బేఖాతరు చేస్తూ, 'దోస్త్' పరిధిలోకి రాకుండా ఇష్టానుసారంగా అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. ఎవరి కంట్రోల్  లేకపోవడంతో పేరెంట్స్‌‌‌‌  నుంచి వేలాది రూపాయల ఫీజులు దండుకుంటూ దందా సాగిస్తున్నాయి. సామాన్య విద్యార్థులకు అందాల్సిన విద్యను వ్యాపారంగా మార్చేస్తున్నాయి. దోస్త్  షెడ్యూల్‌‌‌‌తో సంబంధం లేకుండా తమకు నచ్చినట్లు అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. అడ్డగోలుగా సాగుతున్న ఈ నాన్ దోస్త్  కాలేజీల తీరుపై సర్కారు సీరియస్​గా ఉంది. వీటిని దోస్త్  గొడుగు కిందకు తెచ్చేందుకు లీగల్ గా అడుగులు వేస్తున్నది. రాష్ట్రవ్యాప్తంగా 969 డిగ్రీ కాలేజీలు ఉండగా, వీటిలో 60 ప్రైవేటు కాలేజీలు దోస్త్  పరిధిలో కొనసాగడం లేదు. 

వీటిలో 14 ఎయిడెడ్  కాలేజీలు ఉండగా, 46 ప్రైవేటు కాలేజీలు ఉన్నాయి. దీంట్లోనూ ఆరు అటానమస్  కాలేజీలు ఉన్నాయి. ప్రస్తుతమున్న 60 నాన్ దోస్త్  కాలేజీల్లో మొత్తం 39 వేల వరకు సీట్లు ఉండగా, ప్రస్తుత విద్యా సంవత్సరంలో (2025–26) 17,583 మంది విద్యార్థులు చేరారు. స్టేట్ వైడ్​గా ఉన్న అన్ని డిగ్రీ కాలేజీల సీట్లను దోస్త్  ద్వారా కామన్  అడ్మిషన్  విధానంలో హయ్యర్  ఎడ్యుకేషన్  కౌన్సిల్  భర్తీ చేస్తోంది. దోస్త్  పరిధిలోని డిగ్రీ కాలేజీలకు యూనివర్సిటీలు ఫీజులు నిర్ణయిస్తుంటాయి. వీటిలో ఒక్కో కోర్సును బట్టి ఓయూ పరిధిలో రూ.22 వేల నుంచి రూ.25 వేల వరకూ ఫీజులున్నాయి. వీటిని మాత్రమే కాలేజీలు వసూలు చేయాలి.

నాన్ దోస్త్ లో అడ్డగోలు ఫీజులు 

స్టేట్ లోని నాన్ దోస్త్  కాలేజీల్లో ఇష్టారాజ్యం నడుస్తోంది. అడ్మిషన్లతో పాటు ఫీజులనూ వారికి నచ్చినట్టు వసూలు చేస్తున్నాయి. ఇంజినీరింగ్, ఇతర ప్రొఫెషనల్ కాలేజీల్లో ఏఎఫ్ఆర్సీ ఫీజులను ఫిక్స్  చేస్తుండగా.. దోస్త్  పరిధిలోని డిగ్రీ కాలేజీలకు ఆయా యూనివర్సిటీలు నిర్ణయిస్తున్నాయి. వాటిల్లో అడ్మిషన్లనూ అధికారంగానే హయ్యర్  ఎడ్యుకేషన్  నిర్వహిస్తోంది. కానీ, నాన్ దోస్త్  కాలేజీలు మాత్రం.. తమకు సర్కారుతో సంబంధం లేదన్నట్టుగా వారికి నచ్చినట్టు నిర్వహించుకుంటున్నాయి. కొన్ని నాన్ దోస్త్ కాలేజీల్లో నిబంధనలకు విరుద్ధంగా ఒకే గ్రూపు కోర్సులనూ కొనసాగిస్తున్నది. 

ఒక్కో కాలేజీలు కోర్సును బట్టి రూ.50 వేల నుంచి రూ.1.20 లక్షల దాకా వసూలు చేస్తున్నాయని  పేరెంట్స్  చెప్తున్నారు. పర్యవేక్షించాల్సిన యూనివర్సిటీలు అవేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ కూడా దోస్త్  షెడ్యూల్​ తో సంబంధం లేకుండానే మేనేజ్ మెంట్లు ఇష్టానుసారంగా నిర్వహిస్తున్నాయని అధికారులే చెప్తున్నారు. వీటిని ఓయూ అధికారులు, దోస్త్ అధికారులతో రాటిఫై చేయించుకుంటున్నారు. 

ఏటా కోర్టును ఆశ్రయిస్తూ...

తమకు యూనివర్సిటీలు నిర్ణయించే ఫీజులు చాలడం లేదని.. పలు ప్రైవేటు కాలేజీలు కోర్టును ఆశ్రయించి స్టేటస్ కో తెచ్చుకున్నాయి. తొలుత మేనేజ్మెంట్లు వెళ్లిన సందర్భంలోనే తుది తీర్పుకు లోబడి అడ్మిషన్లు ఉంటాయని హైకోర్టు స్పష్టం చేసింది. కాలేజీలకు వ్యతిరేకంగా తీర్పు వస్తే.. అక్కడ చదివిన వారి డిగ్రీలు చెల్లవని వెల్లడించింది. ఈ విషయాన్ని స్టూడెంట్లకు చెప్పాలని సూచించినా..  కాలేజీల మేనేజ్మెంట్లు దాచిపెట్టి అడ్మిషన్లు నిర్వహిస్తున్నాయి. ఏటా అడ్మిషన్ల టైమ్  రాగానే ఈ నాన్ దోస్త్ కాలేజీలు కోర్టును ఆశ్రయిస్తున్నాయి. అక్కడ స్టేటస్ కో కంటిన్యూ చేయాలని ఆర్డర్లు తెచ్చుకుని, తమకు నచ్చినట్లు అడ్మిషన్లు చేసుకుంటున్నాయి. తర్వాత వర్సిటీల నుంచి రాటిఫికేషన్ చేయించుకుంటూ అడ్మిషన్లను రెగ్యులరైజ్  చేసుకుంటున్నాయి. 

లీగల్​గా విద్యా శాఖ ముందుకు

నాన్ దోస్త్  కాలేజీల తీరుపై సర్కారు సీరియస్ గా ఉంది. నిబంధనల ప్రకారం దోస్త్  పరిధిలోకి రావాలని అధికారులు గత కొన్నేండ్లుగా సూచిస్తున్నా.. పట్టించుకోవడం లేదు. మరోపక్క మేనేజ్మెంట్లతో హయ్యర్  ఎడ్యుకేషన్ అధికారులు ఇప్పటికే చర్చలు జరుపుతున్నారు. అయితే, వారు దోవకు రాకపోతే లీగల్ గానే ముందుకెళ్లాలని నిర్ణయించారు. కోర్టులో పెండింగ్‌‌‌‌లో ఉన్న కేసులను త్వరగా విచారణకు తెచ్చేలా ఏజీపీతో మాట్లాడాలని ఇటీవల జరిగిన సమావేశంలో ఉన్నతాధికారులు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని కాలేజీలూ ఇకపై కచ్చితంగా దోస్త్  పరిధిలోనే అడ్మిషన్లు నిర్వహించేలా పటిష్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది.

చర్చలు జరుపుతున్నం

నాన్ దోస్త్  పరిధిలోని కాలేజీలు కూడా దోస్త్  పరిధిలోకి రావాలని కోరుతున్నాం. మేనేజ్మెంట్లతో చర్చలు చేస్తున్నాం. వర్సిటీ నిర్ణయించే ఫీజు సరిపోవడం లేదని కాలేజీలు చెప్తున్నాయి. దీన్ని చర్చలతో పరిష్కరించుకోవాలని సూచించాం. దీనికి ఒప్పుకోకుంటే లీగల్ గానే ముందుకు పోతాం.

ప్రొఫెసర్ బాలకిష్టారెడ్డి, టీజీసీహెచ్​ఈ చైర్మన్